logo

అ ఆ నుంచి అంతరిక్షం దాకా

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పొత్తానికి ఆదరణ తగ్గిపోయిందన్నది వాస్తవం. ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతికేస్తున్నాం. అది ఎంత వరకు విశ్వసనీయమన్నది ధ్రువీకరించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. అదే పెద్ద బాలశిక్షలో ఏ రంగానికి చెందిన ప్రాథమిక సమాచారన్నైనా నమ్మకంగా అందిస్తుంది.

Updated : 28 Jun 2022 10:24 IST

  పెద్ద బాల శిక్ష అందించే విజ్ఞానం అనంతం
 ప్రతి తెలుగింటా ఉండాల్సిన పుస్తకం
ఆలోచింపజేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పొత్తానికి ఆదరణ తగ్గిపోయిందన్నది వాస్తవం. ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతికేస్తున్నాం. అది ఎంత వరకు విశ్వసనీయమన్నది ధ్రువీకరించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. అదే పెద్ద బాలశిక్షలో ఏ రంగానికి చెందిన ప్రాథమిక సమాచారన్నైనా నమ్మకంగా అందిస్తుంది. అంతటి ప్రాధాన్యం ఉన్న పుస్తకం కాబట్టే చీఫ్‌ జస్టిస్‌ చెప్పిన మాటలు ఇప్పుడు తెలుగు లోగిళ్లను ఆలోచింపజేస్తున్నాయి.

సమగ్ర సమాచారం..
ప్రతి విషయంపై ప్రాథమిక అవగాహన కల్పించే కల్పతరువు పెద్ద బాలశిక్ష. పూర్వం పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఏం చదివారంటే... పెద్ద బాల శిక్ష పూర్తి చేశారనేవారు. ఇప్పుడు పీజీలు, పీహెచ్‌డీలు అన్నంత గర్వంగా చెప్పేవారని అంటుంటారు. ఇది చదివితే దాదాపుగా సంస్కృతీ సంప్రదాయాలు, లోక జ్ఞానం తెలిసి ఉంటుందనే భావన ఉండేది. గతంలో ఐదేళ్ల వరకు పిల్లలను బడికి పంపకపోయేది. నాడు తల్లులు పుస్తకంలోని అంశాలను తమ పిల్లలకు నేర్పించడంవల్ల బడిలో చేరేలోగా చదువుల్లో మిగతా వారి కన్నా కాస్త ముందుండేవారట. తెలుగు వారికి ఎన్‌సైక్లోపీడియా భావిస్తారు. అంతటి విశిష్టత ఉన్న పుస్తకం కాలక్రమేణా సాంకేతిక యుగంలో కనుమరుగవుతోంది. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక మరీ దారుణంగా తయారైంది. ఏ అంశమైనా గూగుల్‌పై ఆధారపడుతున్నారు. మాతృ భాషలో సరళంగా లోక విజ్ఞానాన్ని అందించే దాన్ని విస్మరిస్తున్నారు.

తొలి గురువు
బుజ్జి బుజ్జి మాటలతో అలరించే చిన్నారులు తొలి భాష అమ్మ ఒడిలోనే నేర్చుకుంటారు. అలా తెలుగు అక్షర మాల నుంచి సంస్కృతి, సంప్రదాయాలు, పాటలు, ఆటలు, కళలు, సాహిత్యం, సంఖ్యా శాస్త్రం, భౌగోళిక నైసర్గిక స్వరూపం, దేశభక్తి, నైతిక విలువలు, ఆధ్యాత్మికత, పురాణేతిహాసాలు, భాషా వ్యాకరణం... ఇలా ప్రతి అంశాన్ని పెద్ద బాల శిక్ష స్పృశిస్తుంది. సాధారణంగా బడికి వెళ్లని వ్యక్తి అయినా దీన్ని చదివితే కనీసం పదో తరగతి విద్యార్థికుండే పరిజ్ఞానం ఉంటుందని చెబుతారు. మూఢ విశ్వాసాలకు తావివ్వకుండా శాస్త్రీయ ఆలోచనా ధోరణిని పెంపొందించేదిలా ఉంటుంది. ఇప్పటి తరం పిల్లలు నవధాన్యాలు, నవధాతువులు అంటే సమాధానం చెప్పలేరు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలు ఈ పుస్తకంలో ఉంటాయి. అందుకే ప్రతి ఇంట్లో, బడిలోనూ అందుబాటులో ఉండాల్సింది.
ప్రతి విద్యార్థి పాఠశాల స్థాయిలోనే చదివి ఔపోసన పట్టించుకోవాల్సింది. అన్ని వయసుల వారు నిత్యం అనుసరించాల్సింది ఇదే.

ఎన్నో ప్రయోజనాలు...
కౌన్‌ బనేగా కరోడ్‌ పతిలో వచ్చే ప్రశ్నల్లో దాదాపుగా చాలా సమాధానాలు తెలుస్తాయంటారు. ఇలా విజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయుక్తమైన పుస్తకం చదవడంతో పద సంపద వృద్ధి చెంది భాషపై పట్టు లభిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణం, పఠనాసక్తి, శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది.
‘ప్రతి ఇంట్లో పెద్ద బాలశిక్ష ఉండాలి. అందులో భాషా, సంస్కృతి ఉంటుంది.’
ఈ మాటలు అన్నది దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ..
అమెరికాలో తెలుగువారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్కడే పుట్టి పెరుగుతున్న పిల్లలకు పెద్ద బాలశిక్ష పుస్తకం అందుబాటులో ఉంచి చదివించాలన్నారు.


ఇలా మొదలై...
బ్రిటీష్‌ కాలంలో పిల్లలకు అర్థమయ్యే భాషలో పుస్తకాలు రాయించాలనే బ్రిటీషు అధికారి ఆలోచనతో పరిమిత పేజీలతో పూదూరి సీతారామశాస్త్రి తొలి పొత్తాన్ని రచించారని చెబుతారు. అలా మొదలై కాలానుగుణంగా మార్పులు చోటు చేసుకుంటూ... కంప్యూటర్‌ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించారు. ఇలా ఎన్నో విషయాలను అచ్చ తెలుగు భాషలో వివిధ ముద్రణా సంస్థల ప్రచురణలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ సంస్థలు అటూ, ఇటుగా కొన్ని మార్పులతో తాజా సమాచారంతో పెద్ద బాలశిక్షను ముద్రించి విక్రయిస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా లభ్యమవుతున్నాయి. సంస్థను బట్టి రూ. 350లోపు ధర ఉంది.  

 


విజ్ఞాన గని
పెద్ద బాలశిక్ష ఒక విజ్ఞాన గని. పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఇంటి దగ్గరే ఉండి అన్ని విషయాలు నేర్చుకోవడానికి ఇది దోహదపడుతుంది. నీతివిద్య, శాస్త్ర విద్య, విజ్ఞానం, ప్రపంచం తీరు తెన్నులు, అన్నీ తెలుస్తాయి. పూర్వ కాలంలో ప్రతి ఇంటిలోనూ ఉండేది. ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు మెచ్చుకొన్న పుస్తకం. పెద్ద బాలశిక్షను ప్రతి ఒక్కరూ గృహంలో ఉంచుకోవాల్సిందే.  
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ, ప్రముఖ కవి, అవధాని


వ్యక్తిత్వం తీర్చిదిద్దేది..
- డాక్టర్‌ పింగళి గంగాధర్‌రావు, అధ్యాపకుడు

సంస్కృతీ సంప్రదాయరీతులు, నైతిక విలువలు నేర్పుతుంది. వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతుంది. బాలల జీవితాలకు శ్రీరామ రక్ష పెద్ద బాల శిక్ష. వ్యవహార, శాస్త్రజ్ఞానాలు అందిస్తుంది. పిల్లలు, యుక్త వయసు వారు తప్పకుండా పఠించాల్సిన పుస్తకం. ఇప్పటి వరకు చదవని వారూ ఓసారి తిరగేయాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని