logo

సుపారీ హత్యకు కుట్ర కేసులో నిందితుల అరెస్టు

జిల్లాలో సుపారీ హత్యకు కుట్ర కేసులోని నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ అరవింద్‌బాబు వివరాలు వెల్లడించారు

Published : 28 Jun 2022 06:29 IST

వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీ ప్రభాకర్‌ రావు, సీఐలు గోవర్ధన్‌ రెడ్డి, శ్రీధర్‌,

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: జిల్లాలో సుపారీ హత్యకు కుట్ర కేసులోని నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ అరవింద్‌బాబు వివరాలు వెల్లడించారు. నందిపేట్‌ మండలం లక్కంపల్లి సర్పంచి భర్త మహేందర్‌కు.. అదే గ్రామ ఉపసర్పంచి శ్రీనివాస్‌, మాజీ సర్పంచి ప్రసాద్‌రావుతో కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. పంచాయతీ నిధుల వినియోగంలో శ్రీనివాస్‌ తనకు అడ్డు తగులుతుండటంతో మహేందర్‌ ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నాడు. శ్రీనివాస్‌కు సహకరించి తనకు రాజకీయంగా అడ్డుపడుతున్న ప్రసాద్‌రావును సైతం హత్య చేయించాలని భావించాడు. పదిహేను రోజుల కిందట నందిపేట్‌ మండలానికి చెందిన ఎండీ అక్బర్‌ను సంప్రదించాడు. శ్రీనివాస్‌ కాళ్లు, చేతులు విరగ్గొట్టాలని, ప్రసాద్‌రావును హత్య చేయాలని కోరాడు. రూ.5 లక్షలు సుపారీగా ఇవ్వాలని అడగగా.. చివరకు రూ.3 లక్షలకు ఒప్పందం జరిగింది. అడ్వాన్సుగా అక్బర్‌కు రూ.20 వేలు ఇవ్వగా ఆయన రూ.400తో రెండు కత్తులు కొనుగోలు చేశాడు. అనంతరం నందిపేట్‌కు చెందిన ఉస్మాన్‌తో కలిసి ఇరువురిని హతమార్చేందుకు సమయం కోసం వేచి చూశాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో శ్రీనివాస్‌, ప్రసాద్‌రావు అప్రమత్తమై సీపీ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. నిందితులు అక్బర్‌, ఉస్మాన్‌, మూడ మహేందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, సీఐలు గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని