logo

తగ్గుతున్న రైతు గౌరవం

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌(గౌరవ) నిధి పథకంలో భాగంగా ఇటీవల రైతుల ఖాతాల్లో 11వ విడత నగదు జమ చేశారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. అన్ని అర్హతలున్నా కొంతమందికి సాయం అందడం లేదు. దీనికి తోడు కొందరికి నగదు

Published : 28 Jun 2022 06:38 IST

కిసాన్‌ సమ్మాన్‌ పంపిణీలో సమస్యలు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌(గౌరవ) నిధి పథకంలో భాగంగా ఇటీవల రైతుల ఖాతాల్లో 11వ విడత నగదు జమ చేశారు. జిల్లాలో సాంకేతిక కారణాలతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. అన్ని అర్హతలున్నా కొంతమందికి సాయం అందడం లేదు. దీనికి తోడు కొందరికి నగదు జమ చేసినట్లు చరవాణికి మెసేజ్‌ వస్తున్నా ఖాతాల్లో మాత్రం కనిపించడం లేదు. పరిష్కారం చూపాల్సిన వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు సమర్పిస్తున్నా సాయం అందని పరిస్థితి నెలకొంది.  
రెండున్నరేళ్లుగా తెరుచుకోని పోర్టల్‌
శ్రమను నమ్ముకొని జీవించే అన్నదాతకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధిని ప్రవేశపెట్టింది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయానికి తోడు ఈ డబ్బులు పడటంతో కర్షకులకు ఒకింత భరోసా కలుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా 2019 డిసెంబరు 18 నుంచి కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన వారితోపాటు, సాంకేతిక కారణాలతో నగదు అందుకోని రైతులు దరఖాస్తులు చేసినా మోక్షం లభించడం లేదు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో నమోదైన రైతులకే సాయం అందుతోంది.  
సాంకేతిక కారణాలతో..
ఇటీవల 11వ విడత సాయం పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని నిజాంసాగర్‌, జుక్కల్‌, మద్నూర్‌ తదితర మండలాలకు చెందిన పలువురు రైతులకు సాయం జమైనట్లు చరవాణికి సమాచారం వచ్చింది కానీ ఖాతాలో మాత్రం పడలేదు. ఇలా వందలాది మందికి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఈకేవైసీ చేయడం మూలంగా ఆధార్‌ అనుసంధానం ఉన్న ఇతర బ్యాంకు ఖాతాలో నగదు జమై ఉంటుందని వెల్లడిస్తున్నారు. గతేడాది వేసిన బ్యాంకు ఖాతాల్లో కాకుండా వేరే ఇతర వాటిల్లో జమ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ఖాతాలు సరిచూసుకోవాలని అధికారులు నిర్దేశిస్తున్నారు.
ఏటేటా తగ్గుతున్న లబ్ధిదారులు
ఈ పథకం ప్రారంభమైన మొదట్లో జిల్లాలో 1,24,606 మందికి సాయం అందించారు. ఈ ఏడాది మార్చి నాటికి 1,16,223 మందికి చేరారు. అంటే పది విడతల్లో 8,383 మంది రైతులు తగ్గారు.


ఆరుసార్లు దరఖాస్తు చేసినా..
- దత్తురెడ్డి, పుల్కల్‌, కామారెడ్డి

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కోసం ఇప్పటి వరకు ఆరుసార్లు దరఖాస్తు సమర్పించినా నగదు జమకావడం లేదు. అధికారులను అడిగితే పోర్టల్‌ తెరుచుకోవడం లేదంటున్నారు. ప్రజావాణిలో కలెక్టర్‌కు దరఖాస్తు చేసినా ప్రయోజనం లేదు.


ఖాతాలో జమ కాలేదు
11వ విడత సమ్మాన్‌ సాయం జమైనట్లు చరవాణికి సమాచారం వచ్చింది కానీ ఖాతాలో పడలేదు. అధికారులను అడిగితే వేరే ఖాతాలో చూడమంటున్నారు. ఎందులోనూ పడలేదు. పలువురు రైతులకూ ఇదే విధంగా జరిగింది. అధికారులు దీనిని సరిచేయాలి.


ఉన్నతాధికారులకు నివేదించాం
కొందరు రైతుల చరవాణికి సమాచారం వచ్చినా బ్యాంకు ఖాతాలో జమ కావడంలేదనే ఫిర్యాదులొస్తున్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. కొత్తగా రైతుల నమోదుకు పోర్టల్‌ తెరుచుకోవడం లేదు. రెండున్నరేళ్లుగా ఇదే సమస్య ఉంది. పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు.

- భాగ్యలక్ష్మి, వ్యవసాయాధికారిణి, కామారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని