logo

విరామం ఒక రోజు

విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఒత్తిడితో కూడిన చదువులు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవైపు చదువుల భారంతో సతమత మవుతుంటే. మరోవైపు.. వివిధ రకాల పుస్తకాల మోత వారి శారీరక ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది.

Updated : 12 Sep 2022 14:25 IST

బడుల్లో ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్‌ డే

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

విద్యా విధానంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చినా ఒత్తిడితో కూడిన చదువులు పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకవైపు చదువుల భారంతో సతమత మవుతుంటే. మరోవైపు.. వివిధ రకాల పుస్తకాల మోత వారి శారీరక ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యా ప్రణాళిక - 2005, స్కూల్‌ బ్యాగ్‌ - 2020 విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. నెలలో ఒకరోజు పుస్తకాల సంచి నుంచి విముక్తి(నో బ్యాగ్‌ డే) కల్పించాలని సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ ఈసారి నో బ్యాగ్‌ డేను ఆమోదించింది. ప్రతి నెల మూడో శనివారం అమలు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రాల్లో విభిన్నంగా అమలు..

ఆయా రాష్ట్రాలు దశల వారీగా దీన్ని పాటిస్తున్నాయి. ఏపీలో మొదటి, మూడో శనివారాల్లో ‘సృజన-శనివారం సందడి’ పేరుతో జరుపుతున్నారు. పాడుకుందాం, ఆడుకుందాం, నటిద్దాం, సృజన వంటి నాలుగు అంశాల్లో విద్యార్థుల్లోని సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీసే కార్యక్రమాలు రూపొందించారు. తమిళనాడులో ఫిబ్రవరి 26న పుస్తక దినోత్సవాన్ని నో బ్యాగ్‌ డేగా నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మణిపూర్‌, రాజస్థాన్‌లోనూ ఒక శనివారం విద్యార్థులు పుస్తకాలకు దూరంగా ఉండేలా ప్రకటించారు. హైదరాబాద్‌లోని పలు అంతర్జాతీయ, కేంద్రీయ విద్యాలయాల్లోనూ అమలవుతోంది.

ఏం చేస్తారంటే..

ఒకరోజు పుస్తకాలకు దూరంగా ఉండటం వల్ల వారు మానసికోల్లాసం పొంది.. తదుపరి రోజులు చదువుల్లో రాణించడానికి దోహదం చేస్తుందన్నది నిపుణుల వాదన. ఆ రోజు పిల్లలతో వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు. చిత్రలేఖనం, కాగితంతో వివిధ వస్తువుల తయారీ, ఆంగ్లంలో కథలు చెప్పడం, మిమిక్రీ, హాస్య కవితా సమ్మేళనం, నాటిక, నాట్య ప్రదర్శనల వంటివి చేయిస్తారు.

మోత తగ్గించాలని...

విద్యార్థుల మెదడుపై ఒత్తిడి పడకుండా ప్రయోగాత్మక, సృజనాత్మకంగా విద్యనభ్యసించాలన్నది ప్రధానోద్దేశం. అందులో భాగంగా హోంవర్క్‌, పుస్తకాల మోత విషయంలోనూ ప్రత్యేక మార్గదర్శకాలను నిర్దేశించారు. బ్యాగ్‌ బరువు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. విద్యార్థి బరువులో పుస్తకాల సంచి మోత 10 శాతం మించొద్దన్నది ఒక నియమం.

జిల్లాలో పరిస్థితి: కరోనా అనంతరం పిల్లలు బడులకు దూరంగా, సెల్‌ఫోన్లకు దగ్గరగా మారారు. కొందరు మాత్రం సామాజిక మాధ్యమాల్లో.. సృజనాత్మకతను పెంచే అంశాలను అనుసరించారు. చిత్రలేఖనం, విభిన్న వస్తువుల తయారీ, సంగీతం నేర్చుకోవడం వంటివి చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో నో బ్యాగ్‌ డేతో.. వారి నైపుణ్యాలు ప్రదర్శించడానికి వారికో వేదిక లభించినట్లే. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విధానం అమలుపై సందేహాలు లేకపోయినా.. ప్రైవేటులో మార్కులే లక్ష్యంగా పిల్లలను ఆటపాటలకు దూరంగా ఉంచుతారన్న అపవాదు ఉంది. సెలవు రోజుల్లోనూ బడి కొనసాగించడం, ప్రత్యేక తరగతులని రోజులో 12 గంటలు పుస్తకాలకే అంకితం చేసే సంప్రదాయం కొనసాగుతోంది. అన్ని బడుల్లో కచ్చితంగా అమలు జరిగేలా సంబంధిత శాఖాధికారులు పర్యవేక్షించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని