logo

ప్రగతి పనులకు ప్రతిబంధకాలు

నగర, పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సౌకర్యవంతమైన జీవన విధానానికి అనువుగా ప్రగతి చేపట్టాలని నిధులు కేటాయిస్తోంది.

Published : 02 Jul 2022 05:52 IST

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం


బోధన్‌-నర్సిరోడ్డులో అసంపూర్తిగా వదిలేసిన డ్రైనేజీ పనులు

నగర, పట్టణాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సౌకర్యవంతమైన జీవన విధానానికి అనువుగా ప్రగతి చేపట్టాలని నిధులు కేటాయిస్తోంది.

క్షేత్రస్థాయిలో ప్రగతికి ఎదురవుతున్న ప్రతిబంధకాలు అవరోధంగా మారాయి. కేటాయించిన నిధులు సకాలంలో ఖర్చు చేయలేకపోవడం ఒక ఎత్తైతే.. పనుల్లో జాప్యం మరో ఎత్తు.

టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా 2018లో బల్దియాలకు రుణ రూపంలో రూ.కోట్లలో నిధులు వచ్చాయి. వీటితో సుందరీకరణ పనులు, ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలన్నది లక్ష్యం. పట్టణ ప్రగతి నిధులతో మరికొన్ని పనులు ప్రతిపాదించారు. ఇతర పద్దుల్లోనూ వచ్చిన నిధులు వసతుల కల్పనకు నిర్దేశించారు. అమల్లో మాత్రం ప్రగతి లేకుండాపోయింది.

ఆగడానికి కారణాలెన్నో...

బల్దియాలకు వచ్చిన నిధులు సకాలంలో ఖర్చు చేయడంలో అధికారుల ప్రణాళిక లోపిస్తోంది. పనులు మొదలుపెట్టినప్పుడు ఆక్రమణలు, విద్యుత్తు లైన్లు, భూవివాదం.. ఇవి పనుల జాప్యానికి తొలి కారణంగా నిలుస్తున్నాయి. ఆ తరువాత బిల్లులు సరిగా రావడంలేదని గుత్తేదారులు జాప్యం చేస్తున్నారు.

కొన్ని ఉదాహరణలు..

* నిజామాబాద్‌ నగరంలోని బోధన్‌ రోడ్డులో మాలపల్లి వద్ద కల్వర్టు నిర్మాణానికి తవ్వకాలు చేపట్టి వదిలేశారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

* నగరంలోని వినాయకుల బావి వద్ద సాధారణ నిధులతో రహదారి నిర్మాణానికి పొక్లెయిన్‌తో ఒక పక్క తవ్వారు. పనులు పూర్తి చేయడంలో నెల రోజులుగా తాత్సారం చేస్తున్నారు. అసలే గుంతల రహదారి..ఆపై తవ్వకాలతో సమస్య మరింత జటిలంగా మారింది.

* బోధన్‌-నర్సి రోడ్డులో వరద నీటి కాలువ నిర్మాణం ప్రహసనంగా మారింది. రహదారి వెడల్పుపై నెలకొన్న వివాదంతో సగం వరకు నిర్మించి వదిలేశారు. అసంపూర్తి పనితో వర్షపు నీరు ఎటూ ప్రవహించలేని పరిస్థితి. పైగా ఇది వాణిజ్య కేంద్రం కావడంతో కాలువ అవతల ఉన్న దుకాణాలకు కొనుగోలుదారులు వెళ్లలేని దుస్థితి. దీనికితోడు నిలిచిన మురుగుతో దుర్గంధం వ్యాపిస్తోంది. పట్టణంలో పలు చోట్ల ఇదే సమస్య ఉంది.

* బోధన్‌ శక్కర్‌నగర్‌ చౌరస్తా నుంచి శివాలయం వెళ్లే దారిలో కల్వర్టు ప్రమాదకరంగా మారింది. సగం వరకు గోడ కూలింది. భారీ వాహనం వెళితే మొత్తంకూలడం ఖాయమన్నట్లు ఉంది. దీని నిర్మాణంపై ఇంకా స్పష్టత లేదు. ఏటా వచ్చే వరదతో కల్వర్టు గోడ కొద్దికొద్దిగా కొట్టుకుపోతోంది.

* ఆర్మూర్‌ మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు విస్తరించాల్సిన సెంట్రల్‌ లైటింగ్‌ పనులు ఏడాదిన్నర కాలంగా నిలిచిపోయాయి. ఫలితంగా ఆ కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారులు అరకొర వెలుతురులో మగ్గుతున్నాయి. వర్షాకాలం రహదారులపై విద్యుత్తు కాంతులవసరం ఎంతైనా ఉంది.

టీయూఎఫ్‌ఐడీసీ నిధులు (రూ.కోట్లలో)

నిజామాబాద్‌ : 100

బోధన్‌ : 50

ఆర్మూర్‌ : 50

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు