logo

బిల్లులు రాక బెంగ

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన ఊరు- మన బడి పథకం కింద ఇప్పటికే 132 చోట్ల ప్రారంభమైన మరమ్మతు పనులు మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ నిధులతోనూ మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్‌షెడ్లు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు.

Published : 03 Jul 2022 03:21 IST

బడుల్లో అభివృద్ధి పనులపై ప్రభావం

ఈనాడు, నిజామాబాద్‌

ప్రహరీ లేని తడ్‌పాకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన ఊరు- మన బడి పథకం కింద ఇప్పటికే 132 చోట్ల ప్రారంభమైన మరమ్మతు పనులు మందకొడిగా సాగుతున్నాయి. తాజాగా ఉపాధి హామీ నిధులతోనూ మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్‌షెడ్లు కొత్తవి నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వ్యయ అంచనాలను పూర్తి చేశారు. ముందస్తుగా పెట్టుబడి పెట్టి పనులు చేయాల్సి ఉండటంతో గుత్తేదార్లు ముందుకు రావట్లేదని తెలుస్తోంది. పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీలు, సర్పంచులతో అధికారులు చర్చిస్తున్నా.. బిల్లులు ఆలస్యమైతే ఎలా అనే సంశయంతో ఉన్నారు.

తొలి విడతలో  132

మన ఊరు-మన బడిలో భాగంగా జిల్లాలో 407 పాఠశాలల్లో మరమ్మతులు చేయాల్సి ఉంది. 402 చోట్ల వ్యయ అంచనాలు రూపొందించారు. తొలి విడతగా రూ.2 కోట్లు రావడంతో 15 శాతం చొప్పున 132 బడులకు అడ్వాన్సులు చెల్లించారు. ఆయా చోట్ల పూర్తిస్థాయి బిల్లుల చెల్లింపులతో పాటు.. మిగతా 270 బడుల్లో పనులు చేయాలంటే బడ్జెట్‌ మంజూరు కావాల్సి ఉంది. అయితే రూ.30 లక్షలు దాటే పనులను ఈ వేలం ద్వారా చేపట్టాల్సి ఉంది. కానీ వీటిని పర్యవేక్షించే ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు రూ.10 లక్షల వరకే లాగిన్‌ అయ్యే పరిమితి ఉంది. సాంకేతికంగా మార్పులు చేయడంలో జాప్యం జరుగుతుంది.

లక్ష్యాన్ని  కుదించుకొని..

ఉపాధి హామీ పథకం నిధులతో మరుగుదొడ్లు, ప్రహరీలు, కిచెన్‌షెడ్లు నిర్మించాల్సి ఉంది. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలు కొత్త నిర్మాణాల బాధ్యతలు తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. కాంట్రాక్టు పనులపై గ్రామాల్లో ఆసక్తి చూపే కొందరు సర్పంచులు, మహిళా సర్పంచుల భర్తలు కూడా వీటి విషయంలో ముందుకు రావట్లేదు. ‘ఇటీవల సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాం. ఆ బిల్లులు వస్తేగాని మరో పనికి పెట్టుబడి పెట్టలేమని’ వారు చెబుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాన్ని వాయిదా వేశారు. తొలుత 84 చోట్ల ప్రహరీలు, 83 చోట్ల కిచెన్‌ షెడ్లు నిర్మించాలని భావిస్తున్నారు. 200 మీటర్లలోపు విస్తీర్ణం ఉన్నవి చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికీ మూడు చోట్ల మాత్రమే పనులు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో మంజూరయ్యే నిధులతో బకాయిలన్ని తీర్చేసి.. ఆయా గుత్తేదార్లకే కొత్త పనులు అప్పగించాలనే ఆలోచనతో ఉన్నారు.


బిల్లుల చెల్లింపులకు భరోసా ఇస్తున్నాం

- బావన్న, పీఆర్‌ ఈఈ

మరమ్మతులు, కొత్త నిర్మాణాల పనులను ఆరు ఇంజినీర్ల విభాగాలు పర్యవేక్షిస్తున్నాయి. పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీలు ముందుకురాని చోట గుత్తేదార్లకు అప్పగిస్తున్నాం. చాలావరకు విద్యుత్తు సమస్యలు, చిన్న చిన్న మరమ్మతులు పూర్తయ్యాయి. వివిధ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. త్వరలో నిధులు మంజూరైతే రెండో విడతలో మిగతా పనులు చేపడతాం. ఉపాధి హామీ పథకం నిధులు క్రమం తప్పకుండా వస్తున్నాయి. బిల్లుల చెల్లింపులపై గుత్తేదారులకు భరోసా ఇస్తున్నాం. ఈ విషయాన్ని వివరించి పనులు చేసేలా ఒప్పిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని