logo
Published : 03 Jul 2022 03:21 IST

హరితం.. ఆహ్లాదభరితం

నగరంలో మూడు అర్బన్‌ పార్కుల ఏర్పాటు

ఈనాడు, నిజామాబాద్‌

చిన్నాపూర్‌ పార్కులో కొనసాగుతున్న పనులు

మున్సిపాలిటీలకు సమీపంలోని అటవీ భూముల్లో మరిన్ని అర్బన్‌ పార్కులు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చదనం.. ఆహ్లాదకర వాతావరణానికి తోడు బహుళ ప్రయోజనాలతో వీటిని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే సారంగపూర్‌లో ఒకటి అందుబాటులోకి రాగా.. 63వ నంబర్‌ జాతీయ రహదారిపై మరొకటి రూపుదిద్దుకొంటుంది. తాజాగా భీమ్‌గల్‌లో లింబాద్రి గుట్టకు సమీపంలో అర్బన్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ‘నగర యోజన ఉద్యాన్‌ పథకం’ కింద రూ.2 కోట్లు ఇస్తోంది. వీటికి తోడు కంపా నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొంత మంజూరవుతోంది. పార్కుల నిర్వహణలోనూ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.

* సారంగపూర్‌లో 20 హెక్టార్లలో రూ.3.5 కోట్లతో అభివృద్ధి చేశారు. పిల్లల ఆట పరికరాలు, క్యాంటీన్‌ వంటి సౌకర్యాలు కల్పించారు. అడ్వెంచర్‌ గేమ్స్‌కు ఏర్పాట్లు జరిగినా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది పూర్తిగా సందర్శకుల వినియోగంలో ఉంటున్నప్పటికీ.. కేవలం అర కిలోమీటర్‌ మేర వాకింగ్‌ ట్రాక్‌.. ఆకర్షణీయ మొక్కలతో సరిపెట్టారు. దీన్ని అలీసాగర్‌ వెనుకవైపుగా విస్తరించాలని ఆలోచిస్తున్నారు. అయితే రెవెన్యూ-అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం పరిష్కార దిశగా చర్చలు జరుగుతున్నాయి. సందర్శకులు పరిసరాలను వీక్షించే విధంగా వ్యూ పాయింట్లు ఉండాలని భావిస్తున్నారు. ఒకవేళ విస్తరణ జరిగితే నీటి కుంటలను అభివృద్ధి చేయడం, ఖాళీ స్థలాల్లో పెద్ద మొత్తంలో వివిధ జాతుల మొక్కలు నాటాలని ప్రణాళికలు రూపొందించారు.

చిన్నాపూర్‌లో..

నగరానికి సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కన  చిన్నాపూర్‌లో 166 హెక్టార్లలో అర్బన్‌ పార్కు రూపుదిద్దుకొంటుంది. ఇప్పటివరకు రూ.6 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా మరో రూ.3.62 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నెలాఖరులోగా దీన్ని ప్రారంభించనున్నారు. ఇందులో 25 హెక్టార్లను సందర్శకులకు కేటాయించారు. ఆహ్లాదకర వాతావరణంలో కూర్చోవడానికి వీలుగా బల్లలు.. పిల్లల కోసం ఆట పరికరాలు అమర్చనున్నారు. 5.2 కిలోమీటర్ల మేర జాగింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేశారు. క్యాంటీన్‌, ఇతర సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. మిగతా విస్తీర్ణంలో మూడు నీటి కుంటలను అభివృద్ధి చేస్తున్నారు. కందకాలు తవ్వుతున్నారు. పార్కు ఆవరణలో కాలువల మీదుగా వంతెనలు నిర్మించారు. దట్టమైన అడవిలో సంచరిస్తున్న అనుభూతి కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 8-10 రకాల ఔషధ మొక్కలు నాటుతున్నారు. బండరాళ్లను తొలగించకుండా.. రాక్‌ గార్డెన్‌ తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నారు.

భీమ్‌గల్‌లో..

లింబాద్రి గుట్టకు సమీపంలోనే అటవీ భూముల్లో 130 హెక్టార్లలో అర్బన్‌ పార్కును ప్రతిపాదించారు. మంజూరుకు అటవీశాఖ మంత్రి పచ్చజెండా ఊపారు. తాజాగా జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రూ.10.90 కోట్ల అంచనాలతో అభివృద్ధి చేయనున్నారు. వారాంతాల్లో ఆలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దనున్నారు. తిరుపతి తరహాలో భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇందులోనూ నీటి కుంటలు, మొక్కల పంపకం చేపడతారు. ‘ప్రకృతిపై అవగాహన కల్పించేలా అర్బన్‌ పార్కులు ఉండనున్నాయని’ డీఎఫ్‌వో సునీల్‌ హెరామత్‌ వివరించారు.  

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని