logo
Published : 03 Jul 2022 03:21 IST

విస్తరణ.. పచ్చదనం ప్రక్షాళన

న్యూస్‌టుడే, భిక్కనూరు

భిక్కనూరు చర్చి గేటు వద్ద తొలగించిన భారీ మర్రి వృక్షం

మొక్క ఎదిగి మహావృక్షం కావాలంటే కొన్నేళ్లు పడుతుంది. అలాంటి వాటిని నిమిషాల్లో నేలమట్టం చేస్తున్నారు. ఒక పక్క పచ్చదనం పెంపునకు ప్రభుత్వం హరితహారం పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే.. మరో పక్క అభివృద్ధి పేరిట భారీ చెట్లను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తున్నారు. భిక్కనూరులో రోడ్డు విస్తరణలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 40 భారీ చెట్లను కొట్టేశారు. మరో 15 తొలగించే పనిలో ఉన్నారు. అవసరం లేని చోట అనుమతులు లేకుండా కొట్టేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

22కే అనుమతి

రోడ్లు, భవనాలశాఖ అధికారులు భిక్కనూరులో పాత జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వేప 12, మామిడి 1, మర్రి 5, నిద్ర గన్నేరు 1, చింత చెట్లు 3 కలిపి మొత్తం 22 చెట్ల తొలగింపునకు అటవీశాఖ అధికారులను కోరారు. వాటి రకం, ధరను అంచనా వేసిన అధికారులు ర.భ.శాఖకు నివేదించారు. 22 చెట్లకుగాను రూ.2.47 లక్షల ధరను నిర్ణయించి టెండర్లు నిర్వహించగా నలుగురు పాల్గొన్నారు. ఓ గుత్తేదారు రూ.3.36 లక్షలకు దక్కించుకున్నారు. అదనంగా 18శాతం జీఎస్టీ కూడా విధించినట్లు చెబుతున్నారు. ఈ అనుమతుల ముసుగులో ఇక్కడి రోడ్డుకు ఇరువైపులా సుమారు 65 వృక్షాలు ఉండగా ఇప్పటికే 40 నరికేశారు. ఒక చెట్టును కొట్టేసిన తరువాత దానికి గుర్తింపు సంఖ్య వేయాల్సి ఉండగా కొన్నింటికే కనిపిస్తున్నాయి.

మరోచోటకు తరలింపు

రోడ్డుకు సుమారు నాలుగు మీటర్ల దూరంలో ఉన్న చెట్లను కూడా తొలగించారు. దీనిపై గ్రామస్థులు, ప్రకృతి ప్రేమికులు గగ్గొలు పెడుతున్నా లెక్క చేయడం లేదు. కోతులు వస్తున్నాయని, ఇళ్లకు అడ్డుగా ఉన్నాయన్న సాకుతో కొన్నింటిని అక్రమంగా అమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో జుక్కల్‌ నియోజకవర్గం పిట్లం అటవీ రేంజి పరిధిలోని సంగారెడ్డి, నాందేడ్‌, అకోలా రోడ్డు విస్తరణలో భాగంగా చెట్లను కొట్టేయకుండా వేర్లతో సహా తొలగించి మరోచోట నాటించారు. జుక్కల్‌, పిట్లం రేంజి పరిధిలోని నర్సింగరావుపల్లి అటవీ ప్రాంతంలో ప్రస్తుతం అవి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. బీబీపేట మండలం యాడారం శివారులోని ఓ మందిరం వద్ద తొలగించిన మూడు చెట్లను సైతం ఇదే విధంగా మరోచోట నాటించారు. భిక్కనూరులో మాత్రం నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నారు.

పోలీసుస్టేషన్‌ ఎదురుగా కొట్టేసిన వేప చెట్లు


ఎక్కువ సమయం పడుతుందన్నారు

- తునికి వేణు, సర్పంచి, భిక్కనూరు

చెట్లను మరోచోట తరలించి నాటించాలనే ఉద్దేశంతో  ఓ స్వచ్ఛంద సంస్థను సంప్రదించాం. ఎక్కువ సమయం పడుతుందని చెప్పడంతో వీలుకాలేదు. కొన్ని చెట్లు విద్యుత్తు లైనుకు అడ్డుగా ఉండడంతో తొలగించాం.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

- రమేశ్‌, అటవీ రేంజి అధికారి, కామారెడ్డి

రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు, భవనాల శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు 22 చెట్ల తొలగింపునకు అనుమతులిచ్చాం. అంతకు మించి కొట్టేసినట్లు తమ దృష్టికి రాలేదు. పరిశీలించి వాల్టా చట్టం ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.


 

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని