logo
Published : 03 Jul 2022 03:21 IST

సాగుకు అంతరాయాలు

విద్యుత్తు కోతలతో రైతుల వెతలు

వానాకాలం పనులకు అడ్డంకులు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

వ్యవసాయానికి నిరంతరంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం తొమ్మిది గంటలే సరఫరా అవుతోంది. అందులోనూ కోతలు విధిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగు పనులు జూన్‌ మొదటి వారంలోనే మొదలయ్యాయి. అన్నదాతలు బోరుబావుల వద్ద తుకాలు(నారుమళ్లు) పోసుకుంటున్నారు. ఇంకా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక చెరువు కుంటల్లోకి నీరు రాలేదు. భూగర్భజలాలు వృద్ధి చెందలేదు. ప్రస్తుతానికి బోరుబావుల ఆధారంగానే సాగు పనులు జరుగుతుండగా.. విద్యుత్తు కోతలతో ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.05 లక్షల  వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. త్రీఫేజ్‌ విద్యుత్తు కోతలపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

వరినాట్లకు ఇబ్బందులు

బోరుబావుల కింద అందరి కంటే ముందుగా సాగు పనులు మొదలుపెడతారు. సన్నాలు సాగు చేసేవారు మే నెలాఖరు, జూన్‌ మొదటి వారంలో తుకాలు పోసుకొని జూన్‌ 15- 30 మధ్యలోనే నాట్లు వేసుకుంటారు. విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో మడులు తడవడం లేదు. రాత్రుళ్లు త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేయడం లేదు. కొందరు రైతులు తొలకరికే మొక్కజొన్న విత్తుకున్నారు. చెలక భూముల్లో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురవపోవడంతో మొక్కలు వాడిపోతున్నాయి. వాటికి నీరు పారిద్దామంటే సమయానికి విద్యుత్తు ఉండడం లేదు. ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే..

విద్యుత్తు డిమాండు లేదనే సాకుతో త్రీఫేజ్‌ సరఫరాలో కోత విధిస్తున్నారు. రబీ తర్వాత నిత్యం 9 గంటలలోపే అందిస్తున్నారు. నిత్యం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సరఫరా చేస్తున్నారు. ఇందులోనూ మధ్యమధ్యలో అనధికార కోతలు ఉంటున్నాయి. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో ఇదే సమస్యపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.


మడులు తడవడం లేదు

- కొండే సాయి, గాంధారి

మూడెకరాల్లో వరి సాగు చేద్దామని పనులు ప్రారంభించాను. నిత్యం 7- 8 గంటలు మాత్రమే విద్యుత్తు ఉంటోంది. రెండు మడులు కూడా తడవడం లేదు. నిరంతరాయంగా సరఫరా చేస్తే ముందు నారు పోసుకున్న వారు వరి నాట్లు పూర్తి చేసుకోవచ్చు. ఆలస్యమైతే కూలీల కొరత ఉంటుంది.


డిమాండు ఆధారంగానే..

- రమేశ్‌బాబు, ఎస్‌ఈ, ఎన్‌పీడీసీఈఎల్‌, కామారెడ్డి

విద్యుత్తు డిమాండ్‌ ఆధారంగా అందిస్తున్నాం. మొన్నటి వరకు ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా చేశాం. ప్రస్తుతం ఉదయం 4.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు చేస్తున్నాం. మున్ముందు డిమాండ్‌ ఆధారంగా సరఫరా పెంచుకుంటూ వెళ్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


ఇక నుంచైనా 24 గంటలు అందించాలి

- పల్లె నాగరాజు, చింతమాన్‌పల్లి, దోమకొండ

నా రెండెకరాల్లో చెరకు, వరి ఎకరం చొప్పున సాగు చేయడానికి సిద్ధమయ్యాను. బోరు కింద నాటు వేయాలంటే త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా తక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకు పెద్దగా సమస్య రాలేదు. ఇక నుంచైనా సరఫరా పెంచాలి.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts