logo
Published : 03 Jul 2022 03:21 IST

ఆయకట్టు పెంపు.. పైపులైన్లకే మొగ్గు

నాగమడుగు ఎత్తిపోతల పనులు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి,  న్యూస్‌టుడే, నిజాంసాగర్‌

ఆనకట్ట నిర్మాణ ప్రాంతంలో వీయర్‌ పనులు

ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జక్కాపూర్‌- కోమలంచ సరిహద్దుల్లో మంజీర నదిపై ప్రతిపాదిత ఆనకట్ట నిర్మాణ ప్రదేశంలో వీవర్‌(ఆనకట్ట అడుగుభాగం) నిర్మాణ పనులు చేపట్టారు. మంజీర వరద వచ్చేలోపు పూర్తి చేయాలని యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేత శంకుస్థాపన చేయాలని వేచిచూసిన అధికారులు ఆయకట్టు రైతులకు నిర్దేశిత సమయంలో సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు ప్రారంభించారు. సీఎం వచ్చినప్పుడు పైలాన్‌ ఆవిష్కరించి పంప్‌హౌస్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.

నీటి నిల్వకు..

ఆనకట్ట నిర్మాణ ప్రదేశంలో మొదటగా నీటి నిల్వ కోసం వీయర్‌ పనులు ప్రారంభించినట్లు ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. తదనంతరం ఆనకట్ట నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ రెండు పూర్తికాగానే పంప్‌హౌస్‌ పనులు ప్రారంభించనున్నారు. ఏడాదిన్నరలో ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.

రెండు పంప్‌హౌస్‌లు.. మూడు సంప్‌లు

తలాపునే నిజాంసాగర్‌ జలాశయం ఉన్నా మండలంలోని ఎనిమిది గ్రామాలకు చుక్కనీరందని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిట్లం, బిచ్కుంద, పెద్దకొడపగల్‌ మండలాల్లోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రీడిజైన్‌ చేసి మరో పది వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందే ప్రభుత్వం రూ.476.25 కోట్లు మంజూరు చేసింది. ఆనకట్ట నిర్మాణ ప్రాంతంలో రెండు పంటలు పండే సారవంతమైన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రెండు పంప్‌హౌస్‌లు, మూడ్‌ సంప్‌లు నిర్మించి పైప్‌లైన్‌ ద్వారా సాగునీరు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ఎత్తిపోతల ద్వారా మొదటి పంప్‌హౌస్‌లోకి.. అక్కడి నుంచి పైప్‌లైన్‌ ద్వారా సంప్‌లలో నింపుతూ రెండో పంప్‌హైస్‌లోకి పంపించేలా ప్రణాళికలు రూపొందించారు. తరువాత కాలువల తవ్వి ఆయకట్టకు నీటిని సరఫరా చేయనున్నారు.

వ్యయం తగ్గించేందుకు పాత మోటార్లు

మొదటి పంప్‌హౌస్‌లో ఐదు, రెండో దాంట్లో మూడు మోటార్లు ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేశారు. అదనంగా పది వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిన నేపథ్యంలో ప్రతిపాదిత వ్యయం పెరగనుంది. ఆర్థిక శాఖ అనుమతులు లభించే అవకాశాలు లేకపోవడంతో పాత మోటార్లు వినియోగించి ఖర్చు తగ్గించాలని నిర్ణయించారు. గతంలో కొత్తగూడెంలో వినియోగించిన వాటిని ఇక్కడికి తెప్పిస్తున్నారు.  


నిర్దేశిత సమయంలో పూర్తి

- శ్రీనివాస్‌, సీఈ, జలవనరులశాఖ, కామారెడ్డి

నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమయ్యాయి. స్థిరీకరించిన పది వేల ఆయకట్టుకు అనుగుణంగా చేపడుతున్నాం. మొత్తం 40 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాం.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని