logo
Published : 06 Aug 2022 06:02 IST

ఉపాధి డబ్బులు.. నింపాది

మూడు నెలలుగా కూలీల ఎదురుచూపులు

ఉమ్మడి జిల్లాలో రూ.82 లక్షలు పెండింగ్‌

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదు. వేసవిలో చేసిన పనులకు సంబంధించి ఇప్పటికీ రాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది కొత్త సీజన్‌ ప్రారంభమైన తర్వాత చెల్లింపులు మందగించాయి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చేసిన పనులకు మూడు నెలలు ఆలస్యంగా వచ్చాయి. అనంతరం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త సంవత్సరం మొదలైంది. మే నుంచి జూన్‌ వరకు చేసిన పనులకు సంబంధించి వేలాది మందికి కూలి అందని పరిస్థితి. గతంలో తపాలా కార్యాలయంలో ప్రత్యక్షంగా అందజేసేటప్పుడు క్రమం తప్పకుండా వచ్చేవి. గతేడాది డిసెంబరు నుంచి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 9560 మంది కూలీలకు రూ.82 లక్షలు అందాల్సి ఉంది.

బ్యాంకు ఖాతాలు లేక..

కేంద్రం అమలు చేస్తున్న ఎన్‌ఎంఎంఎస్‌(నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం) సాఫ్ట్‌వేర్‌ కారణంగా కొందరు కూలీల పేరు రెండు గ్రామ పంచాయతీల్లో నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కొత్త జపీలు ఆవిర్భవించినప్పటికీ ఉపాధి రికార్డుల్లో రెండు జీపీల్లోనూ ఉన్నట్లు చూపాయి. అధికారులు స్పందించి వాటిని సరి చేసేలోపు వేలాది మందికి డబ్బులు ఆలస్యమయ్యాయి. మరికొందరికి మూడు నెలలుగా జమకావడం లేదు. కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రకారం జాతీయస్థాయి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచిన వారికి మాత్రమే  జమవుతున్నాయి. గ్రామీణ బ్యాంకుల్లోని ఖాతాలను అనుమతించట్లేదు.

ఒక్కొక్కరికి రూ.9 వేల వరకు

ప్రస్తుతం బకాయి ఉన్న కూలీలకు ఒక్కొక్కరికి మూడు నెలలకు గాను రూ.7 వేల- 9 వేల వరకు చెల్లించాల్సి ఉంది. తమ ఖాతాల్లో ఎప్పుడు వేస్తారోనని ఎదురు చూస్తున్నారు. సమయానికి చేతికి అందక కుటుంబ అవసరాల కోసం అప్పులు చేస్తున్నారు.  


త్వరలో వస్తాయి..

- సాయన్న, డీఆర్డీవో, కామారెడ్డి

కూలీలకు ఉపాధి డబ్బులు త్వరలో జమ చేస్తాం. కొందరికి బ్యాంకు ఖాతాలు లేక ఇబ్బందవుతోంది. వారితో జాతీయ బ్యాంకుల్లో ఖాతా తెరిపించడానికి యత్నిస్తున్నాం. తపాలాశాఖ  అనుసంధానంతోనూ బ్యాంకు ఖాతా తెరుచుకునే అవకాశం కల్పించారు. కూలీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పని చేసిన డబ్బులు జమవుతాయి.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts