logo

ఆ స్నేహం

మన ప్రమేయం లేకుండానే కొన్ని బంధాలు ఏర్పడతాయి. మంచైనా, చెడైనా వాటిని కొనసాగించాల్సిందే. అదే విచక్షణతో ఎంచుకునే బంధం స్నేహం ఒక్కటే. కొందరు దాన్ని ఏటేటా దృఢపర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటివి ఆధునిక కాలంలోనే కాకుండా.. పురాణాల్లోనూ కనిపిస్తాయి.

Updated : 07 Aug 2022 05:45 IST

స్ఫూర్తిదాయకం... పురాణాల్లో దోస్తీ

నేడు మిత్రుల దినోత్సవం 

న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

మన ప్రమేయం లేకుండానే కొన్ని బంధాలు ఏర్పడతాయి. మంచైనా, చెడైనా వాటిని కొనసాగించాల్సిందే. అదే విచక్షణతో ఎంచుకునే బంధం స్నేహం ఒక్కటే. కొందరు దాన్ని ఏటేటా దృఢపర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటివి ఆధునిక కాలంలోనే కాకుండా.. పురాణాల్లోనూ కనిపిస్తాయి. నిజమైన స్నేహితులు ఎలా ఉండాలో నిరూపిస్తున్నాయి. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.


దుర్యోధనుడు-కర్ణుడు

కర్ణుడు దుర్యోధనుడి వెంట ఉండే కంటే   ధర్మం వెంట, సోదరులైన పాండవుల చెంతకు   చేరాలని కృష్ణుడు కోరతాడు. అందుకు కర్ణుడు బదులిస్తూ.. నన్ను   నమ్మి యుద్ధానికి సిద్ధమైన  మిత్రుడు దుర్యోధనుడిని వదిలి వెళ్లలేను. ధర్మబద్ధులైన పాండవులదే విజయమని తెలిసినా నన్ను నమ్ముకున్న మిత్రుడిని వదిలి రాలేనని చెబుతాడు. ఒక్కసారి స్నేహం చేస్తే చివరి వరకు కొనసాగించాలి.


కృష్ణుడు-అర్జునుడు

కృష్ణార్జునులు.. వీరిద్దరు మంచి మిత్రులు, బంధువులు. యుద్ధ సమయంలో అర్జునుడి వెంట శ్రీకృష్ణుడు నిలబడతాడు. సరైన మార్గదర్శనం చేస్తూ విజయం వైపు నడిపించాడు. గీతోపదేశం చేశాడు. మిత్రుల అభ్యున్నతికి మంచి మార్గదర్శనం చేసేవారు పక్కన నిలబడితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు.


కృష్ణుడు-కుచేలుడు..

శ్రీకృష్ణుడు సాందీప ఆచార్యుడి వద్ద విద్యనభ్యసించే సమయంలో కుచేలుడు(సుదామా) సహధ్యాయి. కాలక్రమంలో కృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు అధిక సంతానంతో పేదరికంలో మగ్గుతున్నాడు. స్నేహితుడిని సాయం అర్థించడం ఇష్టం లేని కుచేలుడు భార్య సూచనతో వెళ్తాడు. కృష్ణుడు మిత్రుడికి స్వాగతం పలికి నాకేమి తెచ్చావని ప్రశ్నించి కుచేలుడు తెచ్చిన అటుకుల మూటను తీసుకుంటాడు. కుచేలుడు తిరుగుపయనమై ఇంటికి చేరుకుని చూసి అవాక్కవుతాడు. మిత్రుడి మనసెరిగిన పరమాత్ముడు సౌభాగ్యాలు అనుగ్రహించాడు. ఈ విధంగా మన స్నేహితుల బాధలను మనసుతో గుర్తించగలగాలి. కుంగుబాటులో ఉన్న మిత్రులను గుర్తించి వారిలో ధైర్యం నింపాలి. పేదరికంలో ఉన్నవారికి చేయూతనందించి, వారిలో నైపుణ్యాన్ని గుర్తిస్తే రాణించడానికి ఆస్కారముంటుంది.


రాముడు-సుగ్రీవుడు

రామాయణంలోనూ మిత్ర నేపథ్యాన్ని చూస్తాం. సీతాన్వేషణ కోసం రాముడు వెళ్తుండగా రుష్యమూక పర్వతంపై సుగ్రీవుడు ఉంటారు. రామలక్ష్మణులను చూసి తననే అంతమొందించడానికి వచ్చారేమోనని హనుమంతుడిని పంపి సమాచారం రాబడతాడు. రాముడి గొప్పతనాన్ని తెలుసుకున్న హనుమ సుగ్రీవుడికి చెబుతాడు. అలా ఏర్పడిన స్నేహంతో ఇరువురు తమ ఇబ్బందులను ప్రస్తావిస్తారు. ఈ క్రమంలో రాముడు వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం దక్కేలా చేస్తాడు. రాముడు సీతను దక్కించుకోవడానికి సుగ్రీవుడు సాయపడతాడు. పరస్పరం సాయం చేసుకోవడమనేది ఇక్కడ గుర్తించాల్సిన అంశం.


కృష్ణుడు-ద్రౌపది

మహాభారతంలో మరో అరుదైన స్నేహం కనిపిస్తుంది. ఒకసారి కృష్ణుడు సుదర్శనచక్రం ప్రయోగించినప్పుడు వేలికి గాయమవుతుంది. వెంటనే ద్రౌపది వస్త్రాన్ని కడుతుంది. ఆపదలో ఉన్నప్పుడు తన అండ ఎల్లప్పుడు ఉంటుందని కృష్ణుడు భరోసా ఇస్తాడు. అన్నట్లుగానే ద్రౌపది వస్త్రాపహారణం సమయంలో ఆమెను కాపాడతాడు. ఒకరు మనకు చేసిన మేలును ఎప్పుడూ మరిచిపోవద్దని అర్థమవుతోంది.


త్రిజటలో వచ్చిన మార్పు..

లంకలోని అశోకవనంలో బందీగా ఉన్న సీతమ్మకు కొందరు రాక్షసులను కాపలాగా పెడతారు. వారిలో పెద్దదైన త్రిజట నిద్రలేచి తనకు ఒక కల వచ్చిందని చెబుతుంది. ఆ కలలో రాక్షసుల నాశనం, రాముని అభ్యుదయం కనిపించిందని చెప్పడంతో రాక్షసులు భయపడి పడిపోతారు. అప్పుడు రాముని సందేశాన్ని మోసుకొచ్చిన హనుమంతుడు సీతమ్మని కలవడానికి త్రిజటే అవకాశం కల్పిస్తుంది. చుట్టూ ప్రతికూల పరిస్థితులు, శత్రువులు ఉన్నా మనో నిబ్బరంతో ఉండాలి. అప్పుడు శత్రువు మిత్రుడై సాయం చేస్తారనడానికి ఇదో ఉదాహరణ.


వారి చొరవతోనే ఈస్థాయిలో..

కామారెడ్డి పట్టణం : ప్రతికూల పరిస్థితుల్లో మిత్రులందించిన తోడ్పాటుతో ఈ స్థాయిలో నిలబడగలిగానని చెబుతున్నారు కామరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కిష్టయ్య. పీజీలో మహేందర్‌, రాములు, మాణిక్‌రెడ్డి, దుర్గయ్య సహకరించారని వివరించారు. దీంతో 2002లో జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించానన్నారు. 2010లో డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా పదోన్నతి పొంది ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నట్లు చెప్పారు. మన ఉన్నతికి తోడ్పాటునందించిన వారిని ఎప్పటికీ మరిచిపోవద్దంటున్నారు.


అండగా నిలబడి..

బోధన్‌ పట్టణానికి చెందిన శ్యాంసుందర్‌, సురేష్‌ ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు స్నేహితులు. 45 ఏళ్ల స్నేహం వీరిది. ప్రైవేటులో అధ్యాపకుడిగా పనిచేస్తున్న సురేష్‌ కోసం 2012లో రూ.లక్షలు వెచ్చించి పాఠశాల కొనుగోలు చేశాడు సుందర్‌. ఇప్పటికీ పరస్పర నమ్మకంతో బడి నిర్వహణ సమర్థంగా కొనసాగిస్తున్నారు.


వైద్యపరంగా చూసుకొంటూ..

నిజామాబాద్‌ సాంస్కృతికం : ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మిత్రులకు.. తన వంతుగా చికిత్సలు చేయిస్తున్నారు నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన రాజేశం. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆయన ఇందుకోసమే ఒక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. కరోనా సమయంలోనూ సాయపడ్డారు. స్నేహితులంటే ఇష్టంతోనే ఇదంతా చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.


పరస్పర సహకారం

బోధన్‌ పట్టణానికి చెందిన ఉదయ్‌కిరణ్‌, మధు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు. 12 ఏళ్లుగా ఒకే దగ్గర పని చేస్తుండటంతో స్నేహితులయ్యారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఉదయ్‌కిరణ్‌ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పీజీటీగా ఉద్యోగం సాధించడంతో సంగారెడ్డి జిల్లాకు వెళ్లారు. అయినా వీరిద్దరూ స్నేహం కొనసాగిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో ఏ అవసరమున్నా పరస్పరం సహకారం అందించుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు