logo

తొలిమెట్టుకు తోడ్పాటు

ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు, అభ్యసనా ఫలితాలు రాబట్టడానికి ఈ నెల 17 నుంచి విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది.

Published : 08 Aug 2022 04:40 IST

గణిత అభ్యాస దీపికలు రూపొందించిన ఉపాధ్యాయుడు
దాత సాయంతో పంపిణీ
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు

ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు, అభ్యసనా ఫలితాలు రాబట్టడానికి ఈ నెల 17 నుంచి విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం పనిదినాలు 220 అయితే అందులో 140 రోజులు తొలిమెట్టు ప్రణాళిక అమలు చేయనున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా విద్యార్థుల్లో మౌలిక గణిత సామర్థ్యాల సాధనకు అవసరమైన పుస్తక సామగ్రిని మాత్రం పంపిణీ చేయడం లేదు. దీన్ని గమనించిన లింగంపేట మండల ఉపాధ్యాయుడు భట్టు నర్సిములు గణితం అభ్యాస దీపిక(వర్క్‌ బుక్‌) సిద్ధం చేశారు. దాత సాయంతో వాటిని ముద్రించి పంపిణీ చేస్తూ తొలిమెట్టుకు తోడ్పాటు అందిస్తున్నారు.

ఇంటి వద్ద సాధన చేయించేందుకు
జాతీయ విద్యా విధానం-2020లో భాగంగా విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే గట్టి పునాది వేయాలన్న ఆశయంతో తొలిమెట్టు కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ పేరుతో పాఠ్యాంశాలు బోధించేలా ఉపాధ్యాయులకు తర్ఫీదునిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు బడిలో చదువుకోవడం తప్ప సాయంత్రం ఇంటి వద్ద సాధన చేయించే తల్లిదండ్రులు శాతం తక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో లింగంపేట మండలంలోని నెహ్రూనగర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భట్టు నర్సిములు గణితం అభ్యాస దీపిక(ప్రాథమిక స్థాయి) రచించి గాంధారికి చెందిన వైద్యులు రాంసింగ్‌ సహకారంతో వెయ్యి పుస్తకాలు ముద్రించి పంపిణీ చేపట్టారు. వీటి ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించే వీలుంటందని పలు సర్వేలు నిరూపించాయి.


గణితం అభ్యాస దీపిక

గతంలో తెలుగు, ఆంగ్లంలో..
కొవిడ్‌ సమయంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించి ఆన్‌లైన్‌ బోధన చేపట్టింది. ప్రాథమిక తరగతుల విద్యార్థులను పట్టించుకోకపోవడంతో వారిలో విద్యా ప్రమాణాలు పడిపోయాయి. దీనిని గమనించిన నర్సిములు తెలుగు, ఆంగ్లం భాషలను తేలికగా నేర్చుకునేందుకు అభ్యాస దీపికలు రూపొందించారు. ఇంతటితోనే సరిపెట్టకుండా దాతల సాయంతో వాటిని ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేశారు. చదవడం- రాయడం ద్వారానే భాషను నేర్చుకోవచ్చనే ఉద్దేశంతో చిత్రాలతో కూడిన పుస్తకాన్ని తీర్చిదిద్ది విద్యావేత్తల ప్రశంసలు అందుకున్నారు.


సామర్థ్యాలు పెరుగుతాయి

భట్టు నర్సిములు, పుస్తక రచయిత

అభ్యసనతోనే విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతాయి. ఇందులో భాగంగానే అభ్యాస       దీపికలు రూపొందించా. దాతల సహకారంతో వాటిని ముద్రించి పంపిణీ చేస్తున్నా. గణిత అభ్యాస దీపికను లింగంపేట మండలంలోని ప్రాథమిక తరగతుల విద్యార్థులకు అందించేలా ప్రణాళికలు రూపొందించాను. మరింత మంది దాతలు ముందుకొస్తే జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలలకు పంపిణీ చేస్తా.


విద్య.. వైద్యం రెండు కళ్లు

రాంసింగ్‌, ప్రముఖ వైద్యుడు

పిల్లలకు విద్య, వైద్యం రెండు కళ్లలాంటివి. ప్రాథమిక తరగతుల్లో చదువుకు గట్టి పునాది పడితే భవిష్యత్తులో తిరుగుండదు. ఏ శాస్త్రానికైనా గణితం లేకుండా పురోగతి ఉండవు. అందుకే గణిత అభ్యాస దీపిక ముద్రణకు నావంతు తోడ్పాటు అందించా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని