logo

మారనున్న పాఠాలు

దేశ విద్యా ప్రణాళిక పిల్లల అవసరాలను ప్రతిబింబించాలి. ఇందుకనుగుణంగా పాఠ్యాంశాలను మార్చాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములు....

Published : 08 Aug 2022 04:40 IST

జాతీయ పాఠ్య ప్రణాళిక అమలుపై దృష్టి
ప్రజాభిప్రాయ సేకరణ
న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం


కామారెడ్డి జిల్లాకేంద్రం బతుకమ్మకుంట ప్రాథమిక బడిలో బోధన చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు

దేశ విద్యా ప్రణాళిక పిల్లల అవసరాలను ప్రతిబింబించాలి. ఇందుకనుగుణంగా పాఠ్యాంశాలను మార్చాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగస్వాములు కావాలని నూతన జాతీయ విద్యావిధానం-2020 పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పిల్లల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ ప్రక్రియ ప్రారంభమైంది.

నాలుగు విభాగాల్లో రూపకల్పన
నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం రూపొందనుంది. ఇప్పటి వరకు 1975, 1988, 2000, 2005లో జాతీయ విద్యా ప్రణాళికలు అమలు పరిచారు. మార్కులు, గ్రేడింగులతో విద్యార్థులపై ఒత్తిడి పెంచారు. ప్రస్తుతం నైతిక విలువలకు ప్రాధాన్యం ఇస్తూ కొత్త ప్రణాళిక తయారు చేయాలని కేంద్ర విద్యా పరిశోధన సంస్థ, విద్యాశాఖ భావిస్తోంది. శిశు, బాలల, ఉపాధ్యాయ, వయోజన విద్య వారీగా రూపొందించనున్నారు. ఏళ్ల నాటి అస్పష్ట పాఠ్యాంశాలను తొలగించనున్నారు.

జిల్లాలో విద్యార్థులు (ప్రభుత్వ, ప్రైవేటు)
కామారెడ్డి  1.57 లక్షలు
నిజామాబాద్‌ 2.25 లక్షలు

ఉపాధికి  ఊతమివ్వాలి : - నరేశ్‌, ఉపాధ్యాయుడు
కేంద్ర ప్రభుత్వం నూతన పాఠ్యప్రణాళిక చట్టం రూపొందించడం శుభ పరిణామం. ఉపాధికి ఊతమిచ్చేలా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. నైతిక విలువలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. పిల్లల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలి.

క్షేత్రస్థాయిలో  అవగాహన : - దామోదర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
నూతన జాతీయ విద్యావిధానంలో పాఠ్యప్రణాళిక అమలుపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలి. టీజీటీ, పీజీటీ స్థానాలను భర్తీ చేయాలి. కొత్త విధానంతో విద్యార్థులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రణాళికను అమలు చేయక తప్పదు.


11 అంశాలపై...

* నూతన ప్రక్రియ అమల్లో భాగంగా నేషనల్‌ కరిక్యులం ఫ్రేంవర్క్‌పై దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 23 భాషల్లో అభిప్రాయాలు సేకరిస్తున్నారు.   - సర్వేలో భాగంగా పాఠ్యప్రణాళిక, పుస్తకాలు, బోధనోపకరణాలు తదితర అంశాలపై యాప్‌, వెబ్‌సైట్ల ద్వారా సలహాలు, సూచనలను స్వీకరిస్తున్నారు.
* nvsms. sms.gov.in పోర్టల్‌లో తమ అభిప్రాయాలు తెలపొచ్చు.
* పాఠశాల విద్య ద్వారా విద్యార్థులు సాధించాల్సిందేంటి.. సమాజంతో సంబంధాలు, కొవిడ్‌ కారణంగా కలిగిన అభ్యసన నష్టం ఎలా పూడ్చాలి.. పది, ఇంటర్‌ బోర్డు పరీక్షల్లో ఎలాంటి మార్పులు అవసరం.. తదితర 11 అంశాలపై రెండు వేల లోపు అక్షరాల్లో నమోదు చేయాలి.
* ఉమ్మడి జిల్లాలో అందరికి ఆమోదయోగ్యమైన విద్యా ప్రణాళిక అమలుకు ప్రతిఒక్కరు తోడ్పాటునందించాలని విద్యా నిపుణులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని