logo

Nizamabad news : కామన్వెల్త్‌లో ఇందూరు పంచ్‌

ఇందూరు బిడ్డలు బాక్సింగ్‌లో ఒకే రోజు రెండు పతకాలు సాధించి జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా చాటారు. కామన్వెల్త్‌ క్రీడల్లో బాక్సింగ్‌లో ప్రాతినిధ్యం వహించిన వీరు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు.

Updated : 08 Aug 2022 09:11 IST

బాక్సింగ్‌లో జిల్లాకు రెండు పతకాలు
నిఖత్‌కు స్వర్ణం.. హుస్సాముద్దీన్‌కు కాంస్యం
ఒకే ఏడాదిలో మూడు విభిన్న టోర్నీలు


నిఖత్‌ జరీన్‌ (50 కిలోల విభాగం)

ఇందూరు బిడ్డలు బాక్సింగ్‌లో ఒకే రోజు రెండు పతకాలు సాధించి జిల్లా కీర్తిని అంతర్జాతీయంగా చాటారు. కామన్వెల్త్‌ క్రీడల్లో బాక్సింగ్‌లో ప్రాతినిధ్యం వహించిన వీరు అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఉన్న నిఖత్‌ జరీన్‌ 50 కిలోల విభాగంలో ప్రత్యర్థులను మట్టికరిపించి పసిడి పట్టేసింది. నిజామాబాద్‌కే చెందిన మరో బాక్సర్‌ హుస్సాముద్దీన్‌ సెమీస్‌లో ఓడినప్పటికీ అద్భుత ప్రదర్శనతో కాంస్యం గెలుచుకున్నాడు. 2018 లోనూ కాంస్యం సాధించాడు.

ఈనాడు, నిజామాబాద్‌

నిఖత్‌ జరీన్‌ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ విజయాల పరంపరా కొనసాగిస్తోంది. మేలో ప్రపంచ మహిళా బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచింది. టర్కీ నుంచి వచ్చిన వెంటనే కామన్వెల్త్‌ క్రీడలకు ప్రాతినిధ్యం వహించే వారి కోసం ఎంపికలు జరిగాయి. చక్కటి ప్రదర్శనతో 50 కిలోల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి బంగారు పతకం సొంతం చేసుకుంది. ఒకే ఏడాదిలో మూడు విభిన్నమైన టోర్నీల్లో ప్రపంచస్థాయి బాక్సర్లను ఎదుర్కొని విజయతీరాలకు చేరటంలో ఎక్కడా తడబడలేదు. ఒలింపిక్‌ పతకమే లక్ష్యంగా పెట్టుకున్న ఆమె ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినా సన్మానాలు, ఆర్భాటాలకు సమయం వృథా చేసేందుకు ఇష్టపడేది కాదంటున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం సాధన చేస్తూ టోర్నీకి సిద్ధమైనట్లు చెబుతున్నారు.


హుస్సాముద్దీన్‌ (57 కిలోల విభాగం)

విజయ ప్రస్థానం..
* 2011లో టర్కీలో ప్రపంచ జూనియర్‌ బాక్సింగ్‌ విజేత
* 2012, 2013లో సెర్బియా, బల్గేరియాలో వరుసగా రజతాలు. అండర్‌-19లో వరుసగా స్వర్ణాలు
* 2015 జలందర్‌, అసోంలో సీనియర్‌ జాతీయ మహిళా బాక్సింగ్‌ టోర్నీ విజేత. ఇదే ఏడాది శ్రీలంకలో బంగారు పతకం
* 2016లో సౌత్‌ ఏసియన్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌లో కాంస్యం, హరిద్వార్‌, హరియాణాల్లో జరిగిన జాతీయ మహిళా బాక్సింగ్‌లో రెండు కాంస్యాలు  
* 2018లో సెర్బియాలో జరిగిన బిల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ టోర్నీలో 56 కేజీల విభాగంలో స్వర్ణం  
* 2019లో బళ్లారిలో జాతీయ స్థాయి పోటీలో రజతం, ఇండియన్‌ ఓపెన్‌ టోర్నీలో కాంస్యం  
* 2019లో థాయిలాండ్‌లో జరిగిన ఏసియన్‌ టోర్నీలో కాంస్యం, జపాన్‌లో జరిగిన టోర్నీలో కాంస్యం, థాయిలాండ్‌ ఓపెన్‌లో రజతం  
* 2019లో బల్గేరియాలో జరిగిన స్టాంజా మెమోరియల్‌ టోర్నీ, ఇటలీలో జరిగిన టోర్నీల్లో స్వర్ణాలు
* 2021లో టోక్యో టోర్నీలో కాంస్యం, ఎలైట్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
* 2022లో బల్గేరియాలోని స్టాంజా టోర్నీలో స్వర్ణం, టర్కీలో 52 కేజీల విభాగం స్వర్ణం, తాజాగా కామన్‌వెల్త్‌ క్రీడల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణం.

ప్రముఖుల ప్రశంసలు
హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌ తండ్రితో ఫోన్లో మాట్లాడారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిఖత్‌, హుస్సాముద్దీన్‌కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సైతం ఇద్దరు క్రీడాకారులపై ప్రశంసలు కురిపించారు. వీరి విజయంతో దేశం గర్విస్తోందన్నారు.

ఆర్మీలో సుబేదార్‌ హోదా..
హుస్సాముద్దీన్‌ బాక్సింగ్‌ శిక్షకుడు సంసముద్దీన్‌ కొడుకు. తండ్రి వద్దే శిక్షణ పొందిన హుస్సాముద్దీన్‌ జూనియర్‌ స్థాయిలో జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. 2012లో క్రీడాకోటాలో ఆర్మీకి ఎంపికయ్యాడు. 2015లో అంతర్జాతీయ 6వ మిలటరీ క్రీడల్లో కాంస్యం గెలుచుకున్నాడు. గతేడాది స్పెయిన్‌లో జరిగిన ‘బాక్సమ్‌’ అంతర్జాతీయ టోర్నీలో రజతం కైవసం చేసుకున్నాడు. సీనియర్‌ బాక్సింగ్‌లో రెండు స్వర్ణాలు, అయిదు రజతాలు, మరో ఆరు కాంస్య పతకాలు ఆయన ఖాతాలో చేరాయి. జూనియర్‌ బాక్సింగ్‌లోనూ రెండు స్వర్ణాలు సాధించాడు. ఆర్మీలో సుబేదార్‌ హోదాలో ఉన్నారు.

వరుస విజయాలు
* 2017లో మాంగోలియాలో జరిగిన టోర్నీలో కాంస్యం
* 2017లో బల్గేరియా ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా బాక్సింగ్‌ టోర్నీలో కాంస్యం
* 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో కాంస్యం, అదే ఏడాది అంతర్జాతీయ టోర్నీలో రజతం
* 2019లో ఫిన్‌లాండ్‌, పోలాండ్‌, థాయిలాండ్‌లో వరుసగా రజతాలు, జర్మనీలో కాంస్యం
* 2020లో అంతర్జాతీయ బాక్సింగ్‌లో రజతం, ఇదే ఏడాది జర్మనీలో జరిగిన టోర్నీలో స్వర్ణం, చైనా ఓపెన్‌లోనూ స్వర్ణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని