logo

కలహాల కలవరం.. కవలలకు విషం

ముద్దులొలికే కవల పిల్లలు.. రోజూ పాలిచ్చి లాలించే తల్లి విషం తాగించి ఊపిరి తీసుస్తోందని ఊహించలేకపోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ చిన్నారి బలైంది. మరో కూతురి పరిస్థితి విషమంగా మారింది.

Published : 08 Aug 2022 04:40 IST

క్షణికావేశంలో చిన్నారులతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
ఓ పాప మృతి.. మిగతా ఇద్దరి పరిస్థితి విషయం
న్యూస్‌టుడే, మాచారెడ్డి


పిల్లలతో మమత

ముద్దులొలికే కవల పిల్లలు.. రోజూ పాలిచ్చి లాలించే తల్లి విషం తాగించి ఊపిరి తీసుస్తోందని ఊహించలేకపోయారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయానికి ఓ చిన్నారి బలైంది. మరో కూతురి పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రిలో తానూ చావుబతుకులతో పోరాడుతోంది. ఈ హృదయవిదారక ఘటన మాచారెడ్డి మండలం ఇసాయిపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడెం నవీన్‌, మమత దంపతులకు 11 నెలల క్రితమే ఆడ కవల పిల్లలు జన్మించారు. వారం రోజుల క్రితం రోడ్డుప్రమాదానికి గురైన నవీన్‌ గాయాలపాలై ఇంట్లోనే ఉంటున్నాడు. అత్తాకోడళ్లు మమత, లక్ష్మికి కుటుంబ విషయాల్లో గొడవలు జరిగేవి. శనివారం మాటామాట అనుకుంటుండగా భర్త నవీన్‌ కల్పించుకొని ఇద్దరినీ మందలించాడు. ఇంట్లో తరచూ గొడవలు జరగడంతోపాటు భర్త ప్రతిసారి తననే తిడుతున్నాడని మనస్తాపం చెందిన మమత పిల్లలు మహాశ్రీ, మహన్యను గదిలోకి తీసుకెళ్లింది. వారికి ఎలుకల మందు తాగించి తానూ తాగింది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించారు. హుటాహుటిన కామారెడ్డిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి మహాశ్రీ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. తల్లి మమత చికిత్స పొందుతోంది. భర్త నవీన్‌, అత్త లక్ష్మి, మామ నారాయణ వరకట్న వేధింపులతోనే తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని మమత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆమె తమ్ముడు కల్లూరి మధు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్‌కుమార్‌ పేర్కొన్నారు. డీఎస్పీ సోమనాథం ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న మమతతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.


మృతి చెందిన మహాశ్రీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని