logo

కులపతి.. సమస్యలు ఆలకించి

కులపతి హోదాలో తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆదివారం మూడు గంటల పాటు పర్యటించారు. ఉదయం తెవివికి వచ్చిన ఆమె పరిపాలన భవనం వద్ద పోలీసు సిబ్బంది, ఎస్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల గౌరవ వందనం స్వీకరించారు.

Published : 08 Aug 2022 04:40 IST

తెవివిలో మూడు గంటల పర్యటన


తెవివికి వచ్చిన గవర్నర్‌ తమిళిసైకి స్వాగతం పలుకుతున్న వీసీ రవీందర్‌

ఈనాడు, నిజామాబాద్‌, తెవివి క్యాంపస్‌, న్యూస్‌టుడే: కులపతి హోదాలో తమిళిసై సౌందరరాజన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆదివారం మూడు గంటల పాటు పర్యటించారు. ఉదయం తెవివికి వచ్చిన ఆమె పరిపాలన భవనం వద్ద పోలీసు సిబ్బంది, ఎస్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల గౌరవ వందనం స్వీకరించారు. వీసీ ఆచార్య రవీందర్‌, రిజిస్ట్రార్‌ శివశంకర్‌, అదనపు పాలనాధికారి చంద్రశేఖర్‌ గవర్నర్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. వీసీ ఛాంబర్లో గవర్నర్‌ను వర్సిటీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యులు మారయ్యగౌడ్‌, గంగాధర్‌గౌడ్‌, ఎల్‌ఎన్‌ శాస్త్రి, నసీం, రవీందర్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ ఆరతి సన్మానించారు.


విద్యార్థులతో మాట్లాడుతున్న గవర్నర్‌

అధికారుల దృష్టికి తీసుకెళ్తా..
కంప్యూటర్‌ సైన్స్‌ కళాశాలలో విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులతో గవర్నర్‌ సంభాషించారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను విద్యార్థి సంఘాల నాయకులు విన్నవించారు. పూర్తిస్థాయిలో బోధన, బోధనేతర ఉద్యోగాల భర్తీ, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఆడిటోరియం, బాలికల వసతిగృహ నిర్మాణం, క్రీడల బోర్డు కోసం నిధులు, పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత, స్నాతకోత్సవం, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నిర్వహణ తదితర సమస్యలను శివ, సంతోష్‌, విఘ్నేష్‌ వివరించారు. అధ్యాపకులు నందిని, నవీన్‌కుమార్‌ మాట్లాడారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని తమిళిసై చెప్పారు.


యూనివర్సిటీలో వంటశాలను పరిశీలిస్తూ...

వసతిగృహాల పరిశీలన
బాలికల, బాలుర(పాత, నూతన) వసతిగృహాలను పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థినుల ఇబ్బందులు తెలుసుకున్నారు. భవనం సరిపోవడం లేదని, ఒక్కో గదిలో సామర్థ్యానికి మించి సర్దుకుంటున్నామని వారు విన్నవించారు. మరో బాలికల వసతిగృహ నిర్మాణం అవసరమన్నారు. అనంతరం వర్సిటీలోని గ్రంథాలయాన్ని పరిశీలించిన గవర్నర్‌..  ఎంత మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారని అడిగారు. కంప్యూటర్లు పని చేస్తున్నాయో లేదో చూశారు. ఈ-లైబ్రరీ సదుపాయం లేకపోవటం, రెండు కంప్యూటర్లు పనిచేయకపోవటం వంటి విషయాలను ఆమె ప్రస్తావించారు. గవర్నర్‌ కార్యాలయ కార్యదర్శి సురేంద్రమోహన్‌, సంయుక్త కార్యదర్శులు భవానీశంకర్‌, రఘుప్రసాద్‌ పాల్గొన్నారు. కాగా మహనీయుల చిత్రపటాలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేసేందుకు వచ్చిన ఎమ్మార్పీఎస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీలోని సమస్యలను విన్నవించేందుకు వస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.


హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతూ అభివాదం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై

క్రమశిక్షణ పాటించండి
గవర్నర్‌ తమిళిసై సంభాషిస్తున్న సమయంలో ఓ విద్యార్థిని కల్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఒకింత అసహానానికి గురయ్యారు. క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ‘సమస్యలపై మీరిచ్చిన వినతిపత్రాలు నా దగ్గర ఉన్నాయి. సమస్యలు కాకుండా సాధారణ ప్రశ్నలు అడగాలని, పరిశోధకులు వచ్చి మాట్లాడాలని’ పిలిచారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. వసతిగృహాల్లోని విద్యార్థులు కరోనాతో బాధపడుతుంటే అధికారులు పట్టించుకోలేదని, నిజామాబాద్‌లోని ప్రైవేటు హోటల్‌లో సదస్సు నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చారని నాయకులు గవర్నర్‌ దృష్టికి తెచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని