logo

సహకారం.. స్వాహాపర్వం

ఎత్తొండ సహకార సంఘానికి సంబంధించి మాజీ డైరెక్టర్‌ ఒకరు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడంతో రికవరీ ప్రయత్నం ఆగిపోయింది. ధర్పల్లి సొసైటీ పరిధిలో సహకార చట్టం 1964 సెక్షన్‌ 60 ప్రకారం మాజీ అధ్యక్షుడికి నోటీసులు అందజేసినా నయాపైసా రాబట్టలేదు. రాష్ట్రంలోనే సంచలనం

Published : 09 Aug 2022 04:34 IST

పాలకవర్గాల తీరు అక్రమాలమయం

ఆడిట్‌ నివేదికతో వెలుగులోకి..

చర్యలు తీసుకోవడంలో అధికారుల మీనమేషాలు

న్యూస్‌టుడే, భీమ్‌గల్‌

ఎత్తొండ సహకార సంఘానికి సంబంధించి మాజీ డైరెక్టర్‌ ఒకరు హైకోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోవడంతో రికవరీ ప్రయత్నం ఆగిపోయింది. ధర్పల్లి సొసైటీ పరిధిలో సహకార చట్టం 1964 సెక్షన్‌ 60 ప్రకారం మాజీ అధ్యక్షుడికి నోటీసులు అందజేసినా నయాపైసా రాబట్టలేదు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన తాళ్లరాంపూర్‌ సొసైటీలో రూ.3.34 కోట్లు దుర్వినియోగమైంది. రికవరీ ప్రక్రియ ఇది వరకే ప్రారంభమైనా ఇంకా వసూళ్లు కాలేదు. ప్రధానంగా సహకార సొసైటీల్లో ధాన్యం కొనుగోళ్లు, రైతుల వాటాధనం, ప్రభుత్వం అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను ఖర్చు పెట్టడం వంటి విషయాల్లో అవినీతి జరుగుతోంది. సహకార సంఘాల్లో ఏం జరుగుతుందో రైతులకు తెలుసుకొనే అధికారం లేకపోవడంతో అవినీతి పెచ్చురిల్లుతోంది.

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పర్యవేక్షణ లేకపోవడం, పాలకవర్గం చేతిలోనే పెత్తనం ఉండటంతో రైతుల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులను సహకార సంఘాలు అప్పనంగా మింగేస్తున్నాయి. దీర్ఘకాలికంగా సీఈవోలు ఒకేచోట పనిచేయడం వల్ల సంఘాల్లో అక్రమాల జోరు కొనసాగుతోంది. అధికారులు, పాలకవర్గం చేతులు కలిపి అన్నదాతల సొమ్ము మాయం చేస్తున్నారని తాజా ఆడిట్‌ నివేదిక బహిర్గతం చేస్తోంది.

తనిఖీలు నామమాత్రం..

ఫిర్యాదు అందితే గాని స్పందించని అధికారగణంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సంఘాల్లో తరచూ అక్రమాలు జరుగుతున్నా, ఫిర్యాదులు అందినా తనిఖీలు నామమాత్రంగానే ఉన్నాయి. జిల్లాలోని పలు సహకార సంఘాల్లో ధీర్ఘకాలికంగా కో-ఆపరేటివ్‌ అధికారిగా ఒక్కరే కొనసాగిస్తుండటం వల్ల అవినీతి చోటుచేసుకుంటోంది. సీఈవోల బదిలీలు తక్షణమే చేపడితే సొసైటీల్లో అక్రమాలకు కొద్దిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

మిగతా సొసైటీల్లో..

సొసైటీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆడిటింగ్‌ చేసిన అధికారులే ధ్రువీకరిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

బాల్కొండ సొసైటీలో రూ.40 లక్షల వరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మాజీ ఛైర్మన్‌ తొమ్మిదేళ్లలో తీసుకున్న నిర్ణయాలు తప్పుగా ఉన్నాయని ఫిర్యాదులు అందినా విచారణ మాత్రం చేయడం లేదు.

* డిచ్‌పల్లి మండలం రాంపూర్‌ సొసైటీలో హమాలీల చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులొచ్చాయి.

* భీమ్‌గల్‌ సొసైటీలో కొనుగోళ్లలో అవినీతి జరిగిందని, న్యాయం చేయాలని రైతులు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు. రైతులకు చెల్లించే పంట రుణాలు, వడ్డీ చెల్లింపుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

* నవీపేట్‌ సొసైటీలో ఎరువుల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేయగా నోటీసులు జారీచేసి చేతులు దులుపుకొన్నారు.

* కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి సొసైటీలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయి. 4,609 క్వింటాళ్ల ధాన్యం కొనకుండానే కొనుగోళ్లు చేసినట్లు రికార్డులు చూపారని అందిన ఫిర్యాదుపై స్పందించలేదు. రెంజల్‌ మండలం నీలా సొసైటీలో ఇలాగే జరిగిందని ఫిర్యాదు అందింది.

అక్రమాలకు అడ్డాగా..

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయి. పాలకవర్గాలు సంఘాల్లో వాటాధనం, నిధులను ఇష్టారీతిన ఖర్చు చేస్తూ సొసైటీలను నిర్వీర్యం చేస్తున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 98 సంఘాలు ఉండగా నాలుగేళ్లలో మూడు సొసైటీల పరిధిలో రూ.4.57 కోట్ల అవినీతి జరిగిందని ఆడిట్‌ నివేదిక తేటతెల్లం చేసింది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు