logo

బతికుంటే రాఖీ కట్టేదాన్నేమో..

సమాజం తమను ప్రేమికులుగా ముద్ర వేసిందనే కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదాంతం అయింది. ఈ నెల 8న నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల సమీపంలో నందిపేట్‌ మండలానికి చెందిన

Published : 12 Aug 2022 03:23 IST

అందరి ఆడపిల్లల్లా భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నాను..
ఉన్నత చదువుల కోసం ఊరు దాటక తప్పలేదు..
అంతలోనే అనుకోని వ్యక్తి సోదరుడిలా
పరిచయమయ్యాడు..
అన్నాచెల్లెలుగా మెలిగేవాళ్లం..
మా బంధాన్ని చూసి ఒక్కొక్కరు
ఒక్కోలా మాట్లాడుకొనేవారు..
మొదట్లో వారి మాటలు తెలిసి కొంత బాధపడ్డాం..
ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేశాం..
చివరకు మాపైన ప్రేమికుల ముద్ర వేస్తే
భరించలేకపోయాం.
మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాం..
అతను తనువు చాలించాడని తెలిసి నేను బతకడం
వ్యర్థమనుకొన్నా..
అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా..
ఒక్కటి మాత్రం నిజం..
మేమీ లోకంలోనే ఉండి ఉంటే..
ఈ పండగ వేళ అన్నయ్య లాంటి తనకు రాఖీ కట్టేదాన్ని..
అప్పుడైనా ఈ సమాజం మా బంధాన్ని బలంగా నమ్మేదేమో..!

ఇట్లు..
రక్షాబంధన్‌ వేళ ప్రాణాలు వదిలిన ఓ సోదరి...

ఆ బంధం విషాదాంతం

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: సమాజం తమను ప్రేమికులుగా ముద్ర వేసిందనే కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విషాదాంతం అయింది. ఈ నెల 8న నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల సమీపంలో నందిపేట్‌ మండలానికి చెందిన బాలిక(17), యువకుడు(22) బలవన్మరణానికి యత్నించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాలిక ఇంట్లో వారికి చరవాణిలో చెప్పటంతో వారు అప్రమత్తమయ్యారు. నిజామాబాద్‌లో ఉంటున్న బంధువుల ద్వారా బాధితులిద్దరిని గుర్తించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందగా.. అదేరోజు అర్ధరాత్రి బాలిక ప్రాణాలు విడిచింది. తమపై సమాజం లేనిపోని నిందలు వేసిందని, తామిద్దరం ఇన్నాళ్లు అన్నాచెల్లెలుగా మెలిగామని బాధితులు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై మూడోఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని