logo

పన్నురాక.. పుస్తకం లేక..

విజ్ఞాన నిలయాలుగా పేర్కొంటున్న గ్రంథాలయాలు నిధుల కొరతతో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. ఈ-గ్రంథాలయాలుగా

Published : 12 Aug 2022 03:23 IST

గ్రంథాలయాల్లో సమస్యలు

పేరుకుపోయిన రూ.4.23 కోట్ల బకాయిలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

విజ్ఞాన నిలయాలుగా పేర్కొంటున్న గ్రంథాలయాలు నిధుల కొరతతో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. ఈ-గ్రంథాలయాలుగా సాంకేతికను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తిపన్ను నుంచి గ్రంథాలయ సెస్సును ఇవ్వడం లేదు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు సుమారు రూ.4.23 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోవడం గమనార్హం.

ఆస్తిపన్నులో 8 శాతం
పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తిపన్నులో ప్రత్యేకంగా 8 శాతం గ్రంథాలయ సెస్సుగా తీసుకుంటారు. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉండగా.. పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో పఠనాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఈ సెస్సు నిధులతోనే అభివృద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపట్టగలరు. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్‌టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులు చెల్లించొచ్చు. ఇందుకోసం సెస్సు రూపేణా గ్రామపంచాయతీల ద్వారా సుమారు రూ.3.50 కోట్లు రావల్సి ఉండగా.. కేవలం 54 శాతం మాత్రమే జమ చేస్తున్నారు. పురపాలికల ద్వారా సుమారు రూ.2 కోట్లు రావల్సి ఉంటే.. ఇప్పటి వరకు 75 శాతం అందజేశారు.

శాశ్వత భవనాలు అవసరం
ఉభయ జిల్లాల్లో పూర్తిస్థాయిలో శాశ్వత భవనాలు లేవు. నిజామాబాద్‌లో ఇంకా ఐదు శాఖాగ్రంథాలయల(నందిపేట్‌, రుద్రూరు, భీమ్‌గల్‌, జిల్లాకేంద్రం దుబ్బ, న్యూ ఎన్జీవోస్‌ కాలనీ)కు ఈ సమస్య ఉంది. ఇందులో భీమ్‌గల్‌ భవనం శిథిలావస్థకు చేరడంతో అద్దె గదిలోకి మార్చారు. గ్రామీణ గ్రంథాలయాలకు కూడా శాశ్వత భవనాలు అవసరం. దుబ్బ ప్రాంతంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో 5 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వివిధ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారికి అనుకూలంగా ఉన్న దుబ్బ శాఖాగ్రంథాలయానికి అద్దెగది దొరకడం లేదని బోర్గాం(పీ)లోని వివేకానంద గ్రంథాలయం ప్రాంగణంలోకి తరలించారు. ఇటీవలే ఇక్కడి బైపాస్‌రోడ్డులో నూతన కలెక్టరేట్‌ నిర్మించారు. అధికారులకు, వివిధ ప్రాంతాలకు చెందిన వారి కోసం ఇదే ప్రాంతంలో విశాలమైన నిర్మాణం చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మూడు శాఖాగ్రంథాలయాలకు భవనాలు నిర్మించాల్సి ఉంది.


వందశాతం వసూలుకు కృషి
- బుగ్గారెడ్డి, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల గ్రంథాలయ సంస్థ కార్యదర్శి

రెండు జిల్లాల్లో అన్ని శాఖా గ్రంథాలయాలకు శాశ్వత భవనాల కోసం కృషి చేస్తున్నాం. కొత్త మండలాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నాం. పంచాయతీలు, నగర, పురపాలికల నుంచి ఇప్పటి వరకు 60 శాతం వరకు సెస్సు జమ అయింది. ఇంకా పాత, కొత్త బకాయిలు అందించాలని సంబంధిత శాఖాధికారులను కోరాం. నిజామాబాద్‌ కేంద్ర గ్రంథాలయాన్ని విస్తరించాలని, అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు విన్నవించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని