logo

హలధారికి జలశక్తి

సాగు సజావుగా సాగాలంటే అవసరమైన నీరు ఉంటేనే సాధ్యం. తెలంగాణ అన్నపూర్ణగా ఉమ్మడి జిల్లాకు పేరుంది. ఇక్కడి ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. స్వాతంత్య్రానికి పూర్వమే నిజాంసాగర్‌, పోచారం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి

Updated : 13 Aug 2022 06:48 IST

 నిజాంకాలంలోనే జలాశయాల నిర్మాణం

 స్వతంత్ర భారతంలో ఎస్సారెస్పీ, కౌలాస్‌
 ఉమ్మడి జిల్లాను ‘వరి’ంచిన సాగు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

సాగు సజావుగా సాగాలంటే అవసరమైన నీరు ఉంటేనే సాధ్యం. తెలంగాణ అన్నపూర్ణగా ఉమ్మడి జిల్లాకు పేరుంది. ఇక్కడి ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. స్వాతంత్య్రానికి పూర్వమే నిజాంసాగర్‌, పోచారం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. ఆ తరువాత కౌలాస్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుల నిర్మాణంతో పటిష్ఠ సాగునీటి వ్యవస్థ ఏర్పడింది. ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా ప్రాజెక్టుల ఆధునికీకరణ, కాలువల తవ్వకాలు చేపట్టడంతో వ్యవసాయ స్వరూపమే మారింది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ఆవిర్భావం, విశిష్టతలపై ప్రత్యేక కథనం.

2004లో  కౌలాస్‌
కర్ణాటక రాష్ట్రం నుంచి  జుక్కల్‌ మండలంలోకి ప్రవేశించే కౌలాస్‌ నాలా మీద జుక్కల్‌, బిచ్కుంద మండలాలకు నీరిచ్చే ఉద్దేశంతో లింగంపల్లి, సవర్‌గావ్‌ గ్రామాల మధ్య కౌలాస్‌వాగుపై చిన్న నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేశారు. 1999లో నిర్మాణం చేపట్టి 2004లో పూర్తి చేశారు. కర్ణాటక నుంచి వచ్చే వరద నీటిని ఒడిసిపట్టుకునే ఉద్దేశంతో నిర్మించారు.

1933లో నిజాంసాగర్‌
హైదరాబాద్‌లో సంభవిస్తున్న కరవులను దృష్టిలో ఉంచుకుని నిజాం ప్రభువు నవాబ్‌ అలీ నవాబ్‌జంగ్‌ దీని నిర్మాణానికి పూనుకున్నారు.
* మంజీర గరిష్ఠ వరద ప్రవాహం 5.25 లక్షల క్యూసెక్కులుగా ఉన్న కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట వద్ద నిర్మించారు.
* మంజీర నదికి అడ్డంగా 110 అడుగుల ఎత్తుతో 14 అడుగులు వెడల్పుతో భారీ రాతి ఆనకట్టను ఎస్‌ ఆకారంలో 29.70 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 1923లో పనులు ప్రారంభించి 1933లో పొలాలకు నీరందించారు.
* ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో కాలక్రమేనా సామర్థ్యం 12 టీఎంసీలకు పడిపోయింది. ఈ నేపథ్యంలో 1977లో నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలుండేలా అదనంగా మరో ఏడు గేట్లు ఏర్పాటు చేసి ఆధునికీకరించారు.
* 93 వేల ఎకరాల నిజాంసాగర్‌ ఆయకట్టును స్థిరీకరించేందుకు అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకున్నాయి.

1922లో  పోచారం
ఉమ్మడి జిల్లాలో మొదటి జలాశయ నిర్మాణం ఇది. హైదరాబాద్‌ రాజ్యం భారత దేశంలో విలీనం జరిగే నాటికే అనగా 1922లోనే నిర్మాణం పూర్తయింది.
* నిజాం ఇంజినీరు అలీనవాబ్‌జంగ్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు.
* మంచిప్ప అడవి నుంచి చిన్న కాలువలు, ఒర్రెలు కలిసి వాగు(ఆలేరు)గా రూపాంతరం చెందిన దానిపై 1916లో నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో నిర్మాణం చేపట్టి ఆరేళ్లలో పూర్తి చేశారు.
* కేవలం నిర్మాణంతోనే సరిపెట్టకుండా ప్రధాన కాలువను గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేశారు.


1970లో  శ్రీరామసాగర్‌
స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన అతిపెద్ద నిర్మాణాల్లో శ్రీరామసాగర్‌ ఒకటి. 1951లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్‌ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై జలాశయ నిర్మాణానికి సమీకృత ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి, ప్రణాళికా సంఘానికి సమర్పించింది. ఈ మేరకు 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 196 టీఎంసీల నీటి వినియోగం కోసం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రూపుదాల్చింది.
* దీని ద్వారా 15 లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించారు. 1963లో పనులు ప్రారంభించి 1970లో మొదటిసారి 25 వేల ఎకరాలకు నీరందించారు. కాకతీయ, సరస్వతి కాలువల ద్వారా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాలకు, లక్ష్మీకాలువ ద్వారా నిజామాబాద్‌ జిల్లాలోని 45 వేల ఎకరాలకు సాగునీరందుతోంది.

వరద కాలువ
వరద కాలువ ప్రధాన తూమును నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలంలోని ముప్కాల్‌ వద్ద శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్టుపై నిర్మించారు. అధికంగా వరద వచ్చినప్పుడు దానిని గోదావరి నదిలోకి వదలడంతో పాటు నీటిని సద్వినియోగం చేయాలనే ఆలోచనతో ఈ పథకాన్ని రూపొందించారు.

పునరుజ్జీవంతో మరో అడుగు
* ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్తర తెలంగాణ సాగునీటి వ్యవస్థలో మరో కీలక అడుగు శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం.
* కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి జలాశయం నుంచి మిడ్‌ మానేరుకు నిత్యం తరలించే రెండు టీఎంసీల నీటిని మార్గమధ్యలో కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి గ్రామం 99 కి.మీ వద్ద వరద కాలువలో వదులుతారు.
* 102 కి.మీ వద్ద ఉన్న క్రాస్‌ రెగ్యులేటర్‌ను నియంత్రించడం ద్వారా ఒక టీఎంసీని వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌కు ఎత్తిపోయడం, మరో టీఎంసీని వరద కాలువ ద్వారా దిగువ మిడ్‌ మానేరుకు జలాశయానికి పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
* ఇందుకు గాను రూ.1067 కోట్లతో ప్రభుత్వం పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ్మ బాల్కొండ మండలం ముప్కాల్‌ సమీపంలోని వరద కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద 2017 ఆగస్టు 10న సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.

* ఒకవేళ మహారాష్ట్ర నుంచి శ్రీరామసాగర్‌కు వరద వస్తే వరద కాలువ ద్వారానే మిడ్‌ మానేరుకు నీరు చేరుతుంది. కాళేశ్వరం- వరదకాలువ- శ్రీరామసాగర్‌ పునరుజ్జీవం ద్వారా ఉత్తర తెలంగాణ వరదాయినిగా శ్రీరామసాగర్‌ మారనుంది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts