logo

పునరుద్ధరణకు నోచుకోక.. వేతనాలు రాక

అతిథి అధ్యాపకుల పునరుద్ధరణపై ఈ విద్యా సంవత్సరం చర్యలు కరవయ్యాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు, ఈ ఏడాది రెండు నెలల వేతనం బకాయి ఉంది. ఇటు జీతాలు రాక.. అటు సర్వీసు పునరుద్ధరణకు నోచుకోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 13 Aug 2022 06:24 IST

అతిథి అధ్యాపకుల ఇక్కట్లు
న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

అతిథి అధ్యాపకుల పునరుద్ధరణపై ఈ విద్యా సంవత్సరం చర్యలు కరవయ్యాయి. గత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు నెలలు, ఈ ఏడాది రెండు నెలల వేతనం బకాయి ఉంది. ఇటు జీతాలు రాక.. అటు సర్వీసు పునరుద్ధరణకు నోచుకోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు.
ఊరించి..  ఉసూరుమనిపించి
2013 నుంచి పని చేస్తున్న అతిథి అధ్యాపకులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఫిట్‌మెంట్‌ పెంచుతూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఒక తరగతికి గంటకు రూ.300 చొప్పున నెలకు 72 గంటలు మించకుండా రూ.21,600 వేతనం చెల్లించేవారు. సర్కారు ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటిస్తూ వీరికి కూడా అమలు చేయాలని నిర్ణయించారు. ఏడాదికి పైగా నిరీక్షణకు ఫలితం దక్కిందని ఊరట చెందుతుండగా మళ్లీ నిరాశే మిగిలింది. గంటకు రూ.390 చెల్లిస్తామని ప్రకటించినా అమల్లోకి రాలేదు. పెంచిన ఫిట్‌మెంట్‌ ప్రకారం ఇప్పటి వరకు నయాపైసా జమ కాలేదు.
ఉమ్మడి జిల్లాలో 120 మందికి నిరాశే
నిజామాబాద్‌లో 70, కామారెడ్డిలో 50 మంది అతిథి అధ్యాపకులకు పెంచిన ఫిట్‌మెంట్‌ లబ్ధి ఒనగూరలేదు. వివిధ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఏళ్ల నుంచి పని చేస్తున్నా న్యాయం జరగడం లేదని కలత చెందుతున్నారు. అనేక మంది వేతనాలు రాక ఇబ్బందిపడుతున్నారు. కనీసం ఎప్పుడు వస్తాయో తెలియక సందిగ్ధంలో పడ్డారు. కొందరు విధులకు హాజరవుతున్నారు. మరికొందరు వేతనాలు రాక పాఠాలు బోధించడం మానేశారు.


భారం మోయలేకపోతున్నాం
- శ్రీకాంత్‌, అతిథి అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు

సర్వీసును పునరుద్ధరించకున్నా విధులకు హాజరవుతున్నాం. వేతనాలు రాకున్నా పాఠాలు చెబుతున్నాం. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలపై శ్రద్ధ చూపాలి.


సర్కారు దృష్టికి
- షేక్‌ సలాం, ఇంటర్‌ నోడల్‌ జిల్లా అధికారి

అతిథి అధ్యాపకుల పునరుద్ధరణలో జాప్యం    కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే. 30 శాతం ఫిట్‌మెంట్‌ వర్తింపజేస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. వారి సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్తాం.


జీతాలు పెంచినా నిరాశే
- రమాకాంత్‌, సంఘం జిల్లా కోశాధికారి

ఈ విద్యా సంవత్సరం 30శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు పెంచినా లాభం లేకుండా పోయింది. నెలల తరబడి వేతనాల కోసం నిరీక్షిస్తున్నాం. అధికారులు సర్కారుపై ఒత్తిడి పెంచాలి.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts