logo

మూడు ముక్కలాట.. బొమ్మాబొరుసు

ఈ నెల 2న రామారెడ్డి మండలం రంగంపేట శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6900 స్వాధీనం చేసుకున్నారు.

Published : 13 Aug 2022 06:28 IST

*  ఈ నెల 2న రామారెడ్డి మండలం రంగంపేట శివారులో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.6900 స్వాధీనం చేసుకున్నారు.
*  ఇదే రోజు గాంధారి మండల కేంద్రంలోని వైకుంఠధామం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. మూడు ముక్కలాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని రూ.2900 నగదు, ఐదు చరవాణులు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
*  ఈ నెల 3న జుక్కల్‌ మండలం గుండూర్‌ తండా శివారులో పోలీసులు దాడి చేసి పది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.31,240 లభించాయి.
*  ఈ నెల 5న నిజాంసాగర్‌ మండలం వడ్డేపల్లి శివారులో పేకాటాడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు.
ఇలా జిల్లాలో రోజుకో చోట జూద స్థావరాలపై పోలీసుల దాడులు చేస్తూనే ఉన్నా.. గుట్టుచప్పుడు కాకుండా పేకాట సాగుతోంది. కొత్తగా బొమ్మాబొరుసు అనే ఆట జోరుగా ఆడుతున్నారు. ప్రధానంగా లింగంపేట అటవీ ప్రాంతంలో స్థానికులు కొందరు రోజుకో చోట నిర్వహిస్తూ రూ.లక్షలు పోగేసుకుంటున్నారు. మధ్య తరగతి ప్రజలు జూదానికి బానిసై రోడ్డున పడుతున్నారు.
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి : పోలీసులు దాడులు చేస్తుండటంతో ఆట స్థావరాలు మారుస్తున్నారే తప్ప మానుకోవడం లేదు. ఇటీవల పట్టుబడిన వారిలో పేద వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. గతంలో దీపావళి సందర్భంలో సాగేది. ఇప్పుడు ఏడాదంతా ఆడుతున్నారు. ఇదే అదనుగా కొందరు స్థావరాలు ఏర్పాటు చేసి కమీషన్‌ దండుకొంటున్నారు.

10 నిమిషాల ముందే సమాచారం
దళారులు జూదరులకు స్థావరం చిరునామా 10 నిమిషాల ముందు మాత్రమే సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలతో పాటు జనసంచారం లేని శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. బొమ్మాబొరుసు ఆడేందుకు సమీప జిల్లాల నుంచి పెద్దఎత్తున కార్లలో వస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా వాహనాలను బస్టాండు, దుకాణాల ముంగిట నిలుపుతున్నారు. అక్కడి నుంచి ద్విచక్రవాహనాలపై తరలిస్తున్నారు. ఒకవేళ పోలీసులొస్తే ముందే అప్రమత్తం చేసేందుకు కాపలాదారులను నియమించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చోటా నేతలే శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. మందు, విందులతో పాటు పేకాట కొనసాగిస్తున్నారు. ఉన్నదంతా పోగొట్టుకుంటున్న బాధితులు స్థావరాల సమాచారన్ని పోలీసులకు చెబుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్సు సిబ్బంది లింగంపేట మండలంలో ఆకస్మిక దాడులు చేసినప్పటికీ జూదరులు పారిపోయినట్లు సమాచారం. పోలీసులు గ్రామాల్లో అవగాహన కల్పించడంతోపాటు.. సాంకేతికత ఆధారంగా స్థావరాలను గుర్తించి దాడులు చేయాల్సిన అవసరం ఉంది.  


జిల్లాలో జోరుగా నిర్వహణ స్థావరాలపై పోలీసుల దాడులు
సం।। కేసులు అరెస్టులు బీబీబీ
2019 149 342 3,21,456
2020 283 1042 12,17,654
2021 235 843 10,43,278
2022 74 447 8,67,970
బీబీబీ  పట్టుబడిన నగదు (రూ.లల్లో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని