logo

రెండు వాహనాలు ఢీ: ఒకరి దుర్మరణం

ద్విచక్ర వాహనం, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

Published : 15 Aug 2022 06:01 IST

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని రాస్తారోకో


వీరేశం (పాతచిత్రం)

కోటగిరి, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం, ట్రాలీ ఆటో ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోటగిరి గ్రామానికి చెందిన వీరేశం(42), మహ్మద్‌ అలీలు ఆదివారం ద్విచక్ర వాహనంపై రుద్రూర్‌ వైపు వెళ్తుండగా సులేమన్‌నగర్‌ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వీరేశం(42) అక్కడికక్కడే మృతి చెందగా మహ్మద్‌ అలీకి గాయాలయ్యాయి. వీరేశం మరణించాడన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో యజమాని ఘటనా స్థలానికి వచ్చేంత వరకు మృతదేహాన్ని తీయరాదని అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రాస్తారోకో నిర్వహించారు. కోటగిరి-రుద్రూర్‌ రోడ్డుపై సుమారు రెండు గంటల పాటు బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళన కారులను సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ససేమిరా అన్నారు. రుద్రూర్‌ సీఐ జాన్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని వాహన యజమానితో చర్చించారు. యజమాని హైదరాబాద్‌లో ఉన్నానని తాను సోమవారం వచ్చి మాట్లాడతానని సీఐతో చెప్పారు. విషయాన్ని గ్రామస్థులకు చెప్పి యజమాని వచ్చేంత వరకు మృతదేహానికి శవ పరీక్షలు జరపబోమని సీఐ హామీనివ్వడంతో వారు ఆందోళనను విరమించారు. కోటగిరి, రుద్రూర్‌, వర్ని ఎస్సైలు రాము, రవీందర్‌, అనీల్‌రెడ్డిలు బందోబస్తు నిర్వహించారు.


ఆందోళనకారులతో మాట్లాడుతున్న రుద్రూర్‌ సీఐ జాన్‌రెడ్డి

చికిత్స పొందుతూ యువకుడు..
బోధన్‌ గ్రామీణం: జీవితంపై విరక్తి చెంది పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్‌ మండలం మినార్‌పల్లికి చెందిన శివకుమార్‌ అలియాస్‌ మహ్మద్‌ రఫీక్‌ (24) రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకొన్నాడు. ప్రస్తుతం వారికి 8 నెలల బాబు ఉన్నాడు. కూలీ పనులు చేసుకొనే యువకుడు వారం క్రితం గడ్డిమందు తాగడంతో బంధువులు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఏఎస్సై రవీందర్‌ తెలిపారు. 

మూర్ఛ వ్యాధితో వృద్ధుడు.. నవీపేట, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన బాబుమియా(60) మూర్ఛవ్యాధితో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆదివారం మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు. పాత ఇనుప సామాన్లు సేకరించి విక్రయించే ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఎడపల్లి, న్యూస్‌టుడే: జానకంపేట శివారులో ఆదివారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్‌ నుంచి బోధన్‌ వైపు వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఓ వృద్ధురాలితో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

హోర్డింగ్‌ బోర్డుకు మంటలు
ఇందూరు సిటీ, న్యూస్‌టుడే: ఆర్‌పీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణం ఎదుట ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ బోర్డుకు ఆదివారం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు, దుకాణంలో ఉన్నవారు ఆందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపు చేశారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని