logo

నవ యువ భారత్‌

‘హర్‌ ఘర్‌ తిరంగా, సామాజిక మాధ్యమాల్లో డీపీని జాతీయ పతాకంతో మార్చుకోవాలని’ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు నిమిషాల్లోనే ప్రతి పల్లెకు చేరింది. ఆధునిక భారత సమాచార సాంకేతిక వృద్ధికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం జనాన్ని జాగృతం చేయడం తేలికైంది. దీన్ని సద్వినియోగం చేసుకొని స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నవ భారత నిర్మాణానికి ఉద్యమించాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉంది.

Published : 15 Aug 2022 06:24 IST

ఆధునిక భారత నిర్మాణానికి ఉద్యమించాలి
న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

‘హర్‌ ఘర్‌ తిరంగా, సామాజిక మాధ్యమాల్లో డీపీని జాతీయ పతాకంతో మార్చుకోవాలని’ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు నిమిషాల్లోనే ప్రతి పల్లెకు చేరింది. ఆధునిక భారత సమాచార సాంకేతిక వృద్ధికి ఇదొక నిదర్శనం. ప్రస్తుతం జనాన్ని జాగృతం చేయడం తేలికైంది. దీన్ని సద్వినియోగం చేసుకొని స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా నవ భారత నిర్మాణానికి ఉద్యమించాల్సిన బాధ్యత నేటితరం యువతపై ఉంది.


చదువు


సూపర్‌-30 ఆనంద్‌

స్వాతంత్య్రం వచ్చే నాటికి 17 శాతం ఉన్న అక్షరాస్యత నేడు 64 శాతానికి చేరుకొంది. దీన్ని మరింత పెంచడమే కాకుండా జీవనోపాధిని చూపే నైపుణ్య చదువులు పేదల దరికి చేరాల్సిన అవసరముంది. అందుకు ఉన్నతస్థాయిలో స్థిరపడిన వారు చొరవ చూపాలి.

* సూపర్‌-30: చాలా మందికి తెలిసిన కార్యక్రమం ఇది. పేదరికంలో ఉన్న 30 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి.. వారు ఐఐటీల్లో సీట్లు సాధించేలా ఆనంద్‌కుమార్‌ అనే వ్యక్తి శిక్షణ ఇస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకుండా అలాంటి వారిని ప్రోత్సహించాలి.


పర్యావరణం


హీతా లఖాని

మానవ తప్పిదాలతో జీవ వైవిధ్యాన్ని దెబ్బ తీస్తున్నాం. యథేచ్ఛగా నీరు, గాలిని కలుషితం చేస్తున్నాం. చెట్లు పెంచడం, జల వనరులు సంరక్షించడం వంటివి చేయాలి.

* హీతా లఖానీ: గ్రీన్‌ వారియర్స్‌ పేరుతో పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులతో కలిసి ముంబయికి చెందిన హీతా లఖానీ ఉద్యమం చేస్తున్నారు. వాతావరణ మార్పు, జీవవైవిధ్యం, జలవనరుల సంరక్షణ కోసం కార్యక్రమాలు చేపడుతున్నారు. 11వ ప్రపంచ వైల్డర్‌నెస్‌ సంస్థకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.


ప్లాస్టిక్‌ రహితం

దేశంలో ప్లాస్టిక్‌ పెద్ద ముప్పుగా మారింది. ఈ సమస్యను అధిగమించడం నేటి యువతరం, బాలలపైనే ఉంది. పాలిథిన్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించడానికి సమాజంలో చైతన్యం నింపాల్సిన అవసరం ఉంది. 

* స్నేహషాహి: జీవావరణ, పర్యావరణంపై బెంగళూరులోని అశోక ట్రస్టుకు చెందిన పరిశోధన సంస్థలో గుజరాత్‌కు చెందిన ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. ఒకవైపు చదువుకుంటూనే ‘వి ది ఛేంజ్‌’ నినాదంతో ప్లాస్టిక్‌ నిషేధంపై పోరాడుతున్నారు.


సుపరిపాలన

వలస పాలకుల అవినీతి, పక్షపాతం వంటివి ప్రజల జీవన ప్రమాణాలను భారీస్థాయిలో దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో సుపరిపాలనకు యువ అధికారులు, పాలకులు పాటుపడాలి. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి.

* ఆర్తిదేవి: ఒడిశాలోని ధన్‌కాపాడా గ్రామానికి సర్పంచిగా వ్యవహరించిన ఆర్తిదేవికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు వచ్చింది. బ్యాంకు అధికారిగా ఉన్న ఆమె తమ గ్రామంలో మార్పు తేవాలని భావించారు. అందుకోసం సర్పంచిగా ఎన్నికల్లో నిలబడి గెలిచారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా పారదర్శక, జవాబుదారీ పాలన అందించారు. తమ సంప్రదాయాలు, కళలను ప్రోత్సహించారు.


లింగ వివక్ష

ఆడపిల్లలు పుట్టింది మొదలు.. ఎదిగే వరకు ప్రతి దశలోనూ వివక్ష ఎదురవుతోంది. దాన్ని ఎదుర్కొనేలా వారిని తీర్చిదిద్దాలి. అమ్మాయిల హక్కులు సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలి.

* సుష్మా బడూ: హరియాణాలోని ఓ పల్లెకు సర్పంచిగా వ్యవహరించారు. బాలికలపై వివక్ష నిర్మూలనకు కృషి చేసి మూడు గ్రామాల్లో మార్పు తీసుకురాగలిగారు.


స్వయం సమృద్ధి

స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాల్సిన తరుణమిది. కరోనా సమయంలో జీవన విధానంలోని లోపాలు బయటపడ్డాయి. పొదుపు, సొంత వనరులు కలిగి ఉండాలని లాక్‌డౌన్‌ ద్వారా అవగతమైంది. అందుకే ప్రతి ఒక్కరు పొదుపు చర్యలు పాటించాలి. కనీసం ఇంటి అవసరాలు తీర్చేలా కూరగాయలు పండించుకోవాలి.

* ఉత్తాన్‌: గుజరాత్‌లో ఒక స్వచ్ఛంద సంస్థ. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి దెబ్బతిని ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి అవసరాలు తీర్చడానికి కార్యక్రమాన్ని చేపట్టింది. కొందరికి కూరగాయల విత్తనాలు పంపిణీ చేసింది. పండించడానికి అవసరమైన సలహాలు, సూచనలు అందించింది. అలా ఒక్కో కుటుంబ సభ్యులు పండించిన కూరగాయలను మరో మూడు కుటుంబాలకు ఇచ్చేలా చూశారు. 53 గ్రామాల్లో 2514 కుటుంబాలకు విత్తనాలు ఇస్తే.. 7 వేల కుటుంబాలకు కూరగాయలు అందాయి. పెంచండి, వినియోగించుకోండి, పంచుకోండి అనే నినాదంతో ముందుకు కదిలారు.


ఆరోగ్యభారత్‌

ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో పాటు జీవనశైలి వ్యాధులు పెరిగాయి. ఈ నేపథ్యంలో పొగతాగడం, మద్యం, మత్తు పదార్థాల వినియోగం మానేయడంతో పాటు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి.

* 2015లో ఆగస్టు 15న డాక్టర్‌ అభిజిత్‌ సోనావాణె అనే వైద్యుడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. వీధుల్లోని నిరాశ్రయులు, యాచకులు, పేదలకు వైద్యం చేయడానికి డాక్టర్‌ ఫర్‌ బెగ్గర్స్‌ పేరుతో వారికి చికిత్స అందించడం ప్రారంభించారు.


నీటి వనరుల సంరక్షణ


వాటర్‌షెడ్‌ ఆర్గనైజేషన్‌ ట్రస్టు సంరక్షిస్తున్న నీటి వనరు

కొందరు తమ స్వార్థం కోసం జలవనరుల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చెరువులు, కుంటలు, నదులు, కాలువలను వదలట్లేదు. ఫలితంగా ఏటా వానాకాలంలో కాలనీలు నీట మునుగుతున్నాయి.

* పుణెకు చెందిన వాటర్‌షెడ్‌ ఆర్గనైజేషన్‌ ట్రస్టు: నీరు ప్రధాన అంశంగా పనిచేసే సంస్థ ఇది. వేలాది గ్రామాల్లో స్వచ్ఛందంగా పనిచేసేందుకు జల్‌సేవక్‌లను నియమించి నీటి బడ్జెట్‌ విధానం అనుసరిస్తారు. నీటి వినియోగం, సంరక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తారు.


అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గుర్తింపు ఉంది. అంతర్జాతీయంగా మన దేశ సూచీలను బేరీజు వేసుకుని రానున్న వందేళ్ల స్వతంత్ర భారతానికి తగిన కార్యాచరణ రూపొందించాలి.  

 

దేశ జనాభాలో సగటు వయసు 29 ఏళ్లు..
ఇదే అమెరికాలో 40,
యూరప్‌లో 46,
జపాన్‌లో 47గా ఉంది.

15-59 ఏళ్ల జనాభాలో పనిచేసే వారి శాతం.. 62%

మొత్తం జనాభాలో 25 ఏళ్లలోపు ఉన్న జనాభా.. 54%.


భవిష్యత్తుకు మార్గదర్శి


సర్వేలో పాల్గొన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలోని అభ్యర్థులు

నిజామాబాద్‌ సాంస్కృతికం, బోధన్‌ పట్టణం, కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: వజ్రోత్సవాల స్ఫూర్తి భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుందని యువత అభిప్రాయపడింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ‘ఈనాడు’ 50 మంది యువతతో సర్వే నిర్వహించింది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts