logo
Published : 17 Aug 2022 02:46 IST

పెడదాం.. పంచప్రాణాలు

ప్రధాని పిలుపును స్వీకరించాల్సిన తరుణమిది

అందరూ కదిలితేనే లక్ష్యం సాధ్యం

ఇందూరు ఫీచర్స్‌, న్యూస్‌టుడే

స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. మరో 25 ఏళ్లకు వందేళ్ల సంబురాలు చేసుకొనే నాటికి భారత్‌ను సమున్నతంగా నిలుపుదాం. అందుకు పంచ ప్రాణాలపై శక్తిని కేంద్రీకరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రకోట వేదికగా ఈ మాటలన్నారు. మరి దిల్లీలో పిలుపునిస్తే... దేశ రాజధానిలో ఆచరిస్తే సరిపోతుందా? అంటే గల్లీ, పల్లె నుంచి ఆ మార్పు రావాలి. క్షేత్ర స్థాయిలో మొదలవ్వాలి. అలా జరగాలంటే ఇందూరూ పంచ ప్రాణాలపై దృష్టి సారించాలి. ఇంతకీ ప్రధాని చెప్పినవేమిటి? వాటిలో ఉమ్మడి జిల్లా ఎలాంటి మార్పు తీసుకురావాలో కథనం.


దేశాభివృద్ధి

దేశం అభివృధ్ధి చెందినదిగా గుర్తింపు పొందాలంటే... జిల్లా స్థాయిలో సమగ్ర పురోగతి సాధించాలి. రవాణా రంగంలోనే చూసుకుంటే స్వాతంత్య్రం సిద్ధించాక రైల్వే వ్యవస్థలో విద్యుద్ధీకరణ పూర్తవడం ప్రత్యేకత. ఇంకా డబ్లింగ్‌ లైన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ను అనుసంధానించి నిరంతర విద్యుత్తుకు దోహదం చేసే వ్యవస్థ నిజామాబాద్‌ మీదుగా ప్రయాణిస్తోంది. వ్యవసాయాధారిత జిల్లాలో అనుబంధ పరిశ్రమల స్థాపన అవసరముంది. విమానాశ్రయం వేగవంతంగా పూర్తి చేయాలి. రవాణాపరంగా అన్ని ప్రాంతాలతో అనుసంధానమైతే జిల్లా ముందుకు వెళ్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తే పేదలంతా నాణ్యమైన విద్యను పొందుకోవడానికి ఆస్కారముంటుంది.


బానిసత్వ మూలాలు వదిలించుకోవాలి

వందల ఏళ్లుగా బానిసత్వ మూలాలు ఇంకా వెంటాడుతున్నాయన్నది ప్రధాని ఆలోచన. నిజమే ఇంకా ఎవరైనా ఏదైనా సాయం చేస్తే బాగుంటుందన్న ఆలోచల్లో చాలా మంది ఉన్నారు. అది పోవాలి. ప్రజలు స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనమవ్వాలి. అందుకు పరిశ్రమలు స్థాపించడం, ఉపాధి కల్పించే సంస్థల స్థాపన ఇక్కడ ఊపందుకోవాలి. ఇప్పటికే జిల్లాకు చెందిన చాలా మంది వివిధ ప్రాంతాల్లో తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారు ఇటు వైపు ఒకసారి దృష్టి సారించాలి. ప్రధాన నగరాలకే పరిమితమైన పరిశ్రమలు, ఐటీ కంపెనీల స్థాపనను ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించాలి.  


వారసత్వ వైభవం

సమయానుకూలంగా మార్పు చెందే అలవాటు మన దేశమిచ్చిన సువర్ణావకాశం. ఇందూరును అన్నపూర్ణగా మార్చారు మన పెద్దలు. ఈ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సమయానుకూలంగా మార్పు చెందించాలి. అంటే అవసరానికి అనుగుణంగా పంటల మార్పిడికి ప్రయత్నించాలి. మూసధోరణి వైపు కాకుండా కూరగాయలు, ఫలాలు, ఆహారోత్పత్తులు సాగు చేయాలి. ఫలితంగా స్థానిక అవసరాలు తీరడంతోపాటు ఎగుమతులతో ఆదాపరంగానూ లాభాలు పండించుకోవచ్చు.


ఐక్యత

వాస్తవానికి ఇందూరు మినీ ఇండియానే. వివిధ రాష్ట్రాల ప్రజలు వ్యాపారం, ఉపాధి కోసం వచ్చి స్థిరపడ్డారు. అందరూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. పండగల సందర్భంగా వారి విశిష్టతలు చాటుకుంటారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతుంటారు. డివిజన్ల వారీగా తీసుకున్నా ప్రత్యేకతలే. బాన్సువాడ,  బోధన్‌ ప్రాంతాల్లోని శివారు పల్లెల్లో మూడు సంస్కృతులు విలసిల్లుతాయి. కన్నడ, మరాఠీÈ, తెలంగాణ సంప్రదాయాలు ఆచరణలో ఉంటాయి. ఈ భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతారు.

సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఉమ్మడి జిల్లాలో వివిధ మతాల కుటుంబాలు


బాధ్యతలు

రాజ్యాంగం కల్పించిన హక్కులు వినియోగించుకునే క్రమంలో బాధ్యతలు నిర్వర్తించడమూ కీలకమే. మన పరిధిలో మనం వాటిని విస్మరించకూడదు. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలి. పౌరుడిగా క్రమశిక్షణ కలిగి జీవించాలి. అధికారిగా ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల చేత ఎన్నికైన పాలకులు ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలి. ఇలా ఎవరి పని వారు చేస్తే అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యపడుతుంది.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని