logo

రూర్బన్‌ పథకం.. పనులు మందగమనం

పట్టణ స్థాయి సదుపాయాలను పల్లెల్లో కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. 2017లో ఎడపల్లి మండలం దీని కింద ఎంపికైంది. గ్రామాల్లో ప్రగతి పనులు, యువతకు ఉపాధి, వలసల నియంత్రణ, విద్యారంగం, వ్యవసాయ రంగానికి చేయూతనందించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో కేంద్రం వాటా రూ.30 కోట్లు

Published : 17 Aug 2022 02:46 IST

ఏడాది నుంచి విడుదల కాని బిల్లులు

గడువు పొడిగిస్తూ.. కొనసాగిస్తున్న వైనం

ఎడపల్లి, న్యూస్‌టుడే

పిల్లర్లకే పరిమితమైన కూరగాయల విక్రయ భవనం

పట్టణ స్థాయి సదుపాయాలను పల్లెల్లో కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రూర్బన్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. 2017లో ఎడపల్లి మండలం దీని కింద ఎంపికైంది. గ్రామాల్లో ప్రగతి పనులు, యువతకు ఉపాధి, వలసల నియంత్రణ, విద్యారంగం, వ్యవసాయ రంగానికి చేయూతనందించేందుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాలి. ఇందులో కేంద్రం వాటా రూ.30 కోట్లు కాగా రాష్ట్రం వాటా రూ.70 కోట్లు. రూ.30 కోట్ల నిధులు మంజూరు కావడంతో 2018 నుంచి పనులను ప్రారంభించారు. మొదట్లో పనులు చకచకా సాగడంతో బిల్లులు సక్రమంగా వచ్చాయి. ఆ తర్వాత పనులు మందకొడిగా సాగుతూ వచ్చాయి. కొన్ని పనులు పూర్తి కాగా మరికొన్ని కొనసాగుతున్నాయి. ఇంకొన్ని అసలే ప్రారంభం కాలేదు. గత ఏడాది కాలంగా గుత్తేదార్లకు బిల్లులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మూడేళ్లుగా...

మూడేళ్ల క్రితమే రూ.30 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులను పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా కొనసాగుతున్నాయి. స్థలాల కొరత, నిధుల మంజూరులో జాప్యం, గుత్తేదార్ల నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం నాటికి ముగిస్తామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు.

చెల్లించినవి రూ.17.10 కోట్లే..

ఇప్పటి వరకు అభివృద్ధి పనులకు రూ.17.10 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.12.90 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడంతో పాటు అధికారుల నిరంతర పర్యవేక్షణ చేపడితే తప్ప పనులు పూర్తయ్యే అవకాశం లేదు. జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి కూడా గతంలో ప్రత్యేక సమీక్షలు నిర్వహించినా ఫలితం లేదు.


ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తాం

పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తమే. అయితే ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. నిధులు విడుదల కాగానే బిల్లులు చెల్లిస్తాం.

     -  చందర్‌ నాయక్‌, డీఆర్డీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని