logo

రుణమాఫీ కాక.. నవీకరణ చేసుకోక

పంట రుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. రూ.లక్ష వరకు పంట రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేకుండా పోయింది. మాఫీ కోసం ఎదురుచూస్తూ రైతులు

Updated : 19 Aug 2022 05:47 IST

ఎన్‌పీఏ(నిరర్థక ఆస్తుల) జాబితాలోకి అన్నదాతల ఖాతాలు

అవగాహన కల్పించేందుకు డివిజన్‌ స్థాయి సమావేశాలు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

పంట రుణమాఫీ నిధుల కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. రూ.లక్ష వరకు పంట రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ప్రకటించగా పూర్తిస్థాయి నిధుల విడుదలపై ఇప్పటికీ స్పష్టతలేకుండా పోయింది. మాఫీ కోసం ఎదురుచూస్తూ రైతులు రుణాల నవీకరణకు ముందుకు రాకపోవడంతో వారి ఖాతాలు ఎన్‌పీఏ(నిరర్ధక ఆస్తుల) జాబితాలోకి చేరుతున్న తీరుపై ప్రత్యేక కథనం

ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో జిల్లాలో 1.25 వేల మందికి పైగా రైతులు తమ రుణాలను నవీకరణ చేయించుకోలేదు. బ్యాంకర్లు పదేపదే చెప్పినా పెడచెవిన పెట్టారు. వడ్డీ ఎక్కువ పడుతుందని హెచ్చరించినా పట్టించుకోలేదు. ఇప్పుడు వడ్డీ తడిసిమోపెడవుతోందని వాపోతున్నారు. కనిష్ఠంగా రెండున్నరేళ్లు, గరిష్ఠంగా నాలుగేళ్ల నుంచి పంట రుణ బకాయిలున్నాయి. ఆయా రైతుల ఖాతాలు ఎన్‌పీఏ(నిరర్ధక ఆస్తుల) జాబితాలోకి వెళ్లినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులతో పాటు బ్యాంకర్లకు పంట రుణాల పంపిణీపై ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ నెల 23న బాన్సువాడ,. 24న కామారెడ్డి, 25న బిచ్కుంద డివిజన్లలో నిర్వహించేందుకు లీడ్‌ బ్యాంక్‌ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
బ్యాంకుల వారీగా అర్హుల గుర్తింపు
2018 డిసెంబరు 11 వరకు ఉన్న రుణాల్లో గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సదరు రుణాలను నవీకరించకున్నా పాత తేదీ ఆధారంగానే అర్హులను గుర్తించి మాఫీ జాబితాలోకి తీసుకున్నారు. ఈ తేదీ తరువాత తీసుకున్న వ్యవసాయ, బంగారంపై తీసుకున్న రుణాలను చేర్చలేదు. ఈ క్రమంలో జిల్లాలో 2,57,129 మంది రైతులకు రూ.633.63 కోట్లు మాఫీ అవుతుందని గుర్తించారు. విడతల వారీగా కాకుండా ఒకే దఫా చేపట్టాలని అన్నదాతలు కోరుతున్నారు.  
రెండు విడతలూ అసంపూర్తిగానే
పంట రుణాల్లో గరిష్ఠంగా రూ.లక్ష వరకు మాఫీ చేసే ప్రక్రియలో భాగంగా రూ.25 వేలలోపు తీసుకున్న వారితో మొదలుపెట్టారు. ఏడాదిన్నర గడుస్తున్నా ఈ ప్రయోజనం ఇప్పటికీ 41శాతం మందికి మాత్రమే అందింది. ఎప్పటికి మాఫీ అవుతుందో స్పష్టత లేదు. రెండో విడతలో రూ.50 వేలలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 17.86శాతం మందికి మాత్రమే వర్తించింది. రెండు విడతలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో ఇక రూ.లక్ష లోపు వారికి ఎప్పటికి అవుతుందోనని రైతులు కలవరపడుతున్నారు.


లక్ష్యం చేరేందుకు చర్యలు
పంట రుణ లక్ష్యం చేరేందుకు చర్యలు చేపట్టాం. రుణమాఫీ సాకుతో రైతులు నవీకరణకు ముందుకు రావడం లేదు. దీంతో వారి ఖాతాలు ఎన్‌పీఏలోకి చేరుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. అవగాహన కల్పించడంతో పాటు లక్ష్యం మేరకు రుణాలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.

- రమేశ్‌, మేనేజర్‌, లీడ్‌ బ్యాంక్‌, కామారెడ్డి


ప్రక్రియ సాగిందిలా
రుణాలున్న మాఫీ మొత్తం అయిన చెల్లించింది
రైతులు (రూ.కోట్లలో) వారు (రూ.కోట్లలో)
51,575(రూ.25 వేలలోపు) 43.56 21,254 24.60
30,307(రూ.50 వేలలోపు) 89.79 5,414 16.14
ప్రస్తుత సీజన్లో పంట రుణ లక్ష్యం: రూ.3,615 కోట్లు
రైతులకు పంపిణీ చేసింది: రూ.467 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని