logo

నెత్తుటి దారులు

జిల్లాలోని రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తు రోడ్డెక్కి.. తిరిగి ఇంటికి చేరే వరకు సురక్షితంగా చేరుకుంటామా లేదా అనేంతలా అధ్వానంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్నవి కూడా.. జులైలో కురిసిన వానలకు మరింత దెబ్బతిన్నాయి. ఫలితంగా ద్విచక్రవాహనాలు అదుపు తప్పుతున్నాయి

Updated : 19 Aug 2022 05:46 IST

జిల్లాలో అధ్వానంగా మారిన రోడ్లు

న్యూస్‌టుడే బృందం పరిశీలన

జిల్లాలోని రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తు రోడ్డెక్కి.. తిరిగి ఇంటికి చేరే వరకు సురక్షితంగా చేరుకుంటామా లేదా అనేంతలా అధ్వానంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్నవి కూడా.. జులైలో కురిసిన వానలకు మరింత దెబ్బతిన్నాయి. ఫలితంగా ద్విచక్రవాహనాలు అదుపు తప్పుతున్నాయి. మరమ్మతుల కోసం నిధులు వచ్చేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపిస్తేనే దీనికో పరిష్కారం లభించనుంది.

బోధన్‌ పట్టణం నుంచి సాలూర (7 కి.మీ.)
నాగన్‌పల్లి, సాలూర శివారు పరిధిలో ఎక్కువగా గుంతలు ఉన్నాయి. మొరం వేయించినా వర్షాలకు కొట్టుకుపోయింది. ర.భ పరిధిలో ఉన్నప్పుడు ఐదేళ్ల క్రితం రోడ్డు వేశారు. ఇటీవల ఎన్‌హెచ్‌ 63 పరిధిలోకి మారింది. ‘నర్సి-నాందేడ్‌ నుంచి సాలూర మీదుగా ఎన్‌హెచ్‌-63 రోడ్డు జిల్లా కేంద్రానికి అనుసంధానం కానుంది. సాలూర నుంచి బోధన్‌ బైపాస్‌ వరకు రూ.60 కోట్లు మంజూరయ్యాయి. పది మీటర్లకు విస్తరించి కొత్త రోడ్డు వేయిస్తామని’ ఏఈ సతీశ్‌ వెల్లడించారు.
- న్యూస్‌టుడే, బోధన్‌ గ్రామీణం
రాత్రివేళల్లో గుంతలు కనిపించక ఎక్కువ మంది గాయపడుతున్నారు.

నవీపేట - నాళేశ్వర్‌(4 కి.మీ)
ఈ మార్గంలో మొత్తంగా 108 గుంతలు ఏర్పడ్డాయి. నిజాంపూర్‌, తుంగిని మధ్య రాకపోకలకు వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ‘రోడ్డు బాగు చేయడానికి రూ.2.58 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు’ పీఆర్‌ ఏఈ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.  - న్యూస్‌టుడే, నవీపేట
పొతంగల్‌ మంజీర వంతెన నుంచి సిర్పూర్‌, మహారాష్ట్ర సరిహద్దు వరకు  (2 కి.మీ.)
జుక్కల్‌, మద్నూర్‌ వాసులు నిజామాబాద్‌కు వెళ్లేందుకు దూరభారాన్ని తగ్గించడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి వీలుగా 2009లో పొతంగల్‌ వద్ద మంజీర నదిపై రెండు వారధులతో పాటు రోడ్డు నిర్మించారు. దీన్ని ఇటీవల జాతీయ రహదారుల పరిధిలోకి మార్చారు. ‘మద్నూర్‌ నుంచి పొతంగల్‌, కోటగిరి, రుద్రూర్‌, బోధన్‌ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదించినట్లు’ సంబంధిత శాఖ అధికారి సతీశ్‌ తెలిపారు.
- న్యూస్‌టుడే, కోటగిరి
ఎనిమిది ప్రమాదాలు జరిగాయి. ఐదుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్ర చైన్‌పూర్‌కు చెందిన అనుషాబాయి, రమేశ్‌, పోతంగల్‌కు చెందిన గంగాధర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

వినాయకుల బావి వద్ద..
భూగర్భ మురుగుకాల్వల నిమిత్తం ఈ మార్గంలో తవ్వకాలు చేపట్టారు. అనంతరం రూ.20 లక్షలతో తారు వేసినా.. కొన్నాళ్లకే కంకర తేలింది. రాత్రివేళల్లో ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు. ‘వినాయకుల బావి నుంచి కి.మీ వరకు రూ.40 లక్షలతో పనులు ప్రారంభిస్తాం. టెండర్‌ ప్రక్రియ కూడా ముగిసినట్లు’ జోన్‌-2 ఏఈ ఇనాయత్‌ తెలిపారు. - న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

నందిపేట్‌ - దేగాం (13 కి.మీ)
నందిపేట్‌ బైసాస్‌ రోడ్డు నుంచి దేగాం వరకు గుంతలు ఏర్పడ్డాయి. ఏడేళ్లుగా మరమ్మతులు చేయలేదు. ‘ఆరు కిలోమీటర్ల పరిధిలో పనులు చేయడానికి 2.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభిస్తామని’ ఆర్‌అండ్‌బి ఏఈ రఘువీర్‌ చెప్పారు. ‘700 మీటర్ల మేర పీఆర్‌ శాఖకు చెందిన మార్గంలోనూ మరమ్మతులకు రూ.70 లక్షలు మంజూరయ్యాయి. నిధులు సరిపోవట్లేదని తిరిగి ప్రతిపాదనలు పంపిస్తున్నట్లు’ పీఆర్‌ ఏఈ కిషన్‌ చెప్పారు.  - న్యూస్‌టుడే, నందిపేట
ఇప్పటివరకు నాలుగు ప్రమాదాలు జరిగాయి.
నందిపేట్‌కు చెందిన సంతోశ్‌, రవి, డొంకేశ్వర్‌కు చెందిన గంగారం గాయపడ్డారు. దుబ్బాక - రేకులపల్లి చౌరస్తా (6 కి.మీ) దుబ్బాక శివారులోని వంతెన నుంచి రేకులపల్లి విద్యుత్తు ఉపకేంద్రం వరకు సమస్యగా మారింది. పదేళ్లుగా ఎలాంటి పనులు చేపట్టలేదు. ‘రామడుగు నుంచి పోత్నూరుగుట్ట వరకు రహదారి విస్తరణ కోసం నిధులు మంజూరై టెండర్‌ పూర్తయినట్లు’ ఆర్‌అండ్‌బి ఏఈ మనోహర్‌ పేర్కొన్నారు.
- న్యూస్‌టుడే, ధర్పల్లి
రేకులపల్లికి చెందిన గంగయ్య అనే వృద్ధుడు చనిపోగా.. సల్పబండ తండాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి.

44వ నంబర్‌ జాతీయ రహదారి నుంచి పడకల్‌ మీదుగా చెంగల్‌ వరకు (15 కి.మీ)
పడకల్‌ నుంచి కలిగోట్‌ గ్రామాల మధ్య కంకర తేలింది. భీమ్‌గల్‌ వాసులు ఎక్కువగా ఈ మార్గంలోనే ప్రయాణిస్తుంటారు. ‘తాత్కాలిక మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు’ ఆర్‌అండ్‌బీ ఏఈ ప్రవీన్‌ తెలిపారు.  
నలుగురు ద్విచక్రవాహనదారులు గాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని