logo

బతుకమ్మ పాటల్లో... మహిళల జీవన చిత్రం

ఊరు ఊరంతా పూలవనం ఆడబిడ్డల చప్పట్ల తాళం పెద్దమ్మల పాటల రాగం బతుకమ్మ మహా సంబురం అన్ని వర్గాల ఐక్యతాగానం ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం మన జీవన ప్రతిబింబం తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం

Published : 26 Sep 2022 02:27 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

బోధన్‌ శ్రీవిజయసాయి పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు, పిల్లలు

ఊరు ఊరంతా పూలవనం ఆడబిడ్డల చప్పట్ల తాళం పెద్దమ్మల పాటల రాగం బతుకమ్మ మహా సంబురం అన్ని వర్గాల ఐక్యతాగానం ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం మన జీవన ప్రతిబింబం తెలంగాణ సాంస్కృతిక ఉత్సవం

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు పూలశిఖరం. ఆడపడుచుల ఆత్మీయతకు వేదికగా నిలుస్తుంది బతుకమ్మ సంబురం. వందల సంఖ్యల్లో అమ్మవారి పాటల్లో మహిళామణుల జీవన చిత్రం ఆవిష్కృతమవుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల్లో బతుకమ్మను కొలిచే పాటల ప్రత్యేకతపై.. ‘బతుకమ్మ సాంస్కృతిక పునరుజ్జీవనం-ఒక పరిశీలన’ పేరిట ప్రముఖ కవయిత్రి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు శారద తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకొన్నారు. ఈ అంశంపై ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

రెండు జిల్లాల్లో పర్యటించి..

బతుకమ్మ పాటల సేకరణ కోసం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించాను. తొలుత మహిళలు అంతగా స్పందించేవారు కాదు. నేను కొన్ని పాటలు పాడగానే అందులో తప్పులను గుర్తుపట్టి సరిచేసేవారు. తర్వాత వారే పాటలు పాడేవారు. మొత్తం 60 పాటల వరకు సేకరించాను. ప్రకృతి, ఆత్మీయత, అనుబంధం, సామెతలు, పొడుపు కథలు వంటివి అందులో ఉన్నాయి. ప్రతి పాట చివర్లో ఉయ్యాలో, వలలో, కోల్‌, సందమామా వంటి పదాలు ఉండడం ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. సందేశాత్మకంగా ఉండటంతో పాటు స్త్రీల జీవన ఘట్టాలను తమ పాటల్లో గుర్తు చేసుకుంటారు.

బతుకమ్మకు ముందు చిన్నారులు చేసుకునే బొడ్డెమ్మతో అనుబంధాన్ని చెబుతుంటారు. తమ ఇష్టదైవం శివుని సతీమణి గౌరీమాతగా పేర్కొంటారు. గంగాగౌరి సంవాదం, అక్కమ్మపాట, నీలమ్మ, సీతమ్మ పెండ్లి పాట, సత్యవతి కథ వంటి పాటలు వినిపిస్తాయి.


శుక్రవారం నాడు ఉయ్యాలో

లేచెనే గౌరమ్మ ఉయ్యాలో

చన్నీటి జలకాలు ఉయ్యాలో

ఆడెనె గౌరమ్మ ఉయ్యాలో

ముత్తెమంత పసుపు ఉయ్యాలో

ముఖమంత పూసింది ఉయ్యాలో

పగడమంత పసుపు ఉయ్యాలో

పాదమంతా పూసింది ఉయ్యాలో

చింతాకు పట్టుచీర ఉయ్యాలో

చింగులు మెరియంగ ఉయ్యాలో ..

.. ఇందులో గ్రామీణ మహిళ అలంకరణ, కట్టూబొట్టూ సంస్కృతిని ప్రతిబింబిస్తోంది.


బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో..

నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో

నా బిడ్డ నెలగౌరి ఉయ్యాలో

నిచ్చమల్లె చెట్టేసి ఉయ్యాలో...


కోడళ్లకు నేర్పించా..

- అంజమ్మ, వినాయక్‌నగర్‌, నిజామాబాద్‌

చిన్నప్పటి నుంచి బతుకమ్మంటే ఇష్టం. మా అమ్మ పాటలు పాడుతుంటే చూసి నేర్చుకున్నా. 15 పాటల వరకు వస్తాయి. ముఖ్యంగా ఊరికి ఉత్తరాన వలలో.. పాట గుర్తింపు తెచ్చింది. మా కోడళ్లకు కూడా వీటిని నేర్పించాను.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని