logo

అడ్డగోలు రిజిస్ట్రేషన్లు ఆగట్లే

ఉమ్మడి జిల్లాలోని పది మంది సబ్‌ రిజిస్ట్రార్లలో అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగానే ఐదుగురు సస్పెండ్‌ అయ్యారు. వీరందరికీ రెండేసి ఇంక్రిమెంట్లు కోత పెట్టడంతో పాటు సర్వీసు ప్రయోజనాలు లభించకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆ శాఖలో మార్పు కనిపించటం లేదు. యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధమైన దస్తావేజులు తయారు చేస్తున్నారు.

Published : 26 Sep 2022 02:27 IST

ఈనాడు, నిజామాబాద్‌

ఉమ్మడి జిల్లాలోని పది మంది సబ్‌ రిజిస్ట్రార్లలో అక్రమ రిజిస్ట్రేషన్ల కారణంగానే ఐదుగురు సస్పెండ్‌ అయ్యారు. వీరందరికీ రెండేసి ఇంక్రిమెంట్లు కోత పెట్టడంతో పాటు సర్వీసు ప్రయోజనాలు లభించకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఆ శాఖలో మార్పు కనిపించటం లేదు. యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధమైన దస్తావేజులు తయారు చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో అవసరమైన హక్కు పత్రాలు సృష్టిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీల ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములవుతున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ అవినీతికి కలిసొచ్చే అంశంగా మారుతోంది.

నిషేధిత జాబితాలో చేర్చట్లేదు

నిజామాబాద్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు ఎక్కువయ్యాయి. మత్స్యశాఖ భూమి కబ్జాకు యత్నించిన వారు పక్క సర్వే నంబరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వచ్చారు. దీనిపై రెండుసార్లు కేసులయ్యాయి. ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ మత్స్యశాఖ అధికారి ఇటీవల రెవెన్యూ అధికారులకు లేఖ రాసినా స్పందన లేదు. దీంతో వివాదం కలిగిన ఆ స్థిరాస్తిని మరొకరికి విక్రయించారు. ఈ భూమిని గతంలో సర్వే చేసిన సర్వేయర్‌ ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నివేదిక ఇవ్వటం మూలంగా సస్పెండ్‌ అయ్యారు. అయినా అప్రమత్తంగా వ్యవహరించడం లేదు.

హద్దులపై  అనుమానాలు..

దేవస్థానం భూముల విషయంలోనూ అన్ని అనుమానాలే ఉన్నాయి. కంఠేశ్వరాలయ భూముల్లో 362 సర్వే నంబరు బైపాస్‌ రోడ్డులోని పులాంగ్‌ వాగులో ఉన్నట్లుగా సర్వే నివేదిక ఇచ్చారు. కానీ దేవుడి భూమి వాగులోకి ఎలా వెళ్లింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి భూములు ఎత్తులో ఎలా ఉన్నాయనే విషయాలు ప్రశ్నలుగానే మిగిలాయి. ఈ సర్వే నంబరుతో అనేక ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అసలు ఈ సర్వే నంబరులోని మొత్తం భూమి ఎంత? పట్టా ఎంత? దేవస్థానం పరిధిలోనిది ఎంత? ఎటువైపుగా ఉందనే విషయాలు తేల్చే సర్వే గతంలో జరిగింది. కానీ దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సర్వే చేసిన సర్వేయర్‌ మరో చోట విధుల్లో నిర్లక్ష్యంతో సస్పెండ్‌ అయ్యారు.

మున్సిపాలిటీల  తప్పిదాలు..

బాన్సువాడలో రెండు అక్రమ రిజిస్ట్రేషన్లకు మున్సిపాలిటీ కారణమైంది. 2.30 ఎకరాల భూమికి అసెస్‌మెంట్‌ నంబరు జారీ చేసిన అధికారులు.. తీరా అది అక్రమ రిజిస్ట్రేషన్‌ అని తేలటంతో మ్యుటేషన్‌ను నిలిపివేశారు. ఈ వివాదం ముగియకుండానే మరో చోట నిర్మాణం లేకుండానే అసెస్‌మెంట్‌ నంబరు జారీ చేశారు. అక్కడా రిజిస్ట్రేషన్‌ జరిగి.. ఆ స్థిరాస్తి మరొకరి పేరుపైకి మారింది. వివాదం ఉన్నతస్థాయి వరకు వెళ్లడంతో మున్సిపాలిటీ నంబరు ఇవ్వటంతోనే చేశామని.. సంబంధిత అధికారులు చెప్పారు. నిజామాబాద్‌లోనూ అర్సపల్లి, న్యాల్‌కల్‌ రోడ్డులో ఖాళీ స్థలాలకు అసెస్‌మెంట్‌ నంబర్లు జారీ అయ్యాయి.

రూ.కోట్ల స్థలానికి రక్షణ కరవు..

నిజామాబాద్‌ నగర ప్రధాన రహదారిలోని 890 గజాల స్థలం వివాదంలోకి వెళ్లింది. ఖాళీ స్థలానికి మున్సిపాలిటీ ఇంటి నంబరుతో తప్పుడు రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ స్థలం మాదంటూ ఇద్దరు వ్యక్తులు పోరాడుతున్నారు. హైకోర్టులో ఒకరికి అనుకూలంగా తీర్పు రాగా.. అవతలి వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు ఇలా జరుగుతుండగానే అక్రమ రిజిస్ట్రేషన్లతో భూమిని అన్యాక్రాంతం చేయాలనుకున్న వ్యక్తులు దాన్ని ఇతరులకు విక్రయించటం ప్రారంభించారు. కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపట్టారు. దీంతో హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిన వ్యక్తి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మాణాలను అడ్డుకోవాలంటూ కమిషనర్‌ చిత్రామిశ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి లేఖ కూడా రాశారు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయకుంటే.. అక్రమార్కులను కట్టడి చేయటం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

రంగంలోకి నిఘా వర్గాలు..

అక్రమ రిజిస్ట్రేషన్లతో నాలా ఫీజు, స్టాంపు డ్యూటీ ఎగవేత జరిగి ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దానికి తోడు లింకు డాక్యుమెంట్లు, సరైన హక్కు పత్రాలు లేకుండా జరిగే వాటితో పెద్ద మొత్తంలో అవినీతికి ఆస్కారం ఉంటుంది. గతంలో 11 దస్తావేజులు ఇదే తరహాలో రూపొందించినట్లు గుర్తించారు. వాటిపై చేపట్టిన విచారణ అటకెక్కడంతో ఆయా స్థిరాస్తిని మరొకరికి బదలాయించేందుకు చూస్తున్నారు. తాజాగా 3500 గజాల దస్తావేజు నుంచి.. 2400 గజాలకు జీపీఏ పత్రాలు సృష్టించిన వ్యవహారం వెలుగుచూసింది. ఈ అక్రమాలపై విచారించేందుకు నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. అసెస్‌మెంట్‌ నంబర్ల వివరాలు సేకరిస్తున్నాయి. ఇందులో భాగమైన వారి వివరాలు తెలుసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని