logo

అటు పరిష్కారం.. ఇటు తిరస్కారం

కొన్నేళ్లుగా అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం కుదరక భూ వివాదాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇరు శాఖలతో సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి రెవెన్యూ భూములకు పట్టాల మంజూరు చేపట్టాలని

Published : 26 Sep 2022 02:27 IST

బాన్సువాడ డివిజన్లో అటవీ- రెవెన్యూ భూ వివాదాలు కొలిక్కి

ఇతర ప్రాంతాల్లో కనిపించని చొరవ

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

రైతుకు ఇచ్చిన ఈ-పట్టా

కొన్నేళ్లుగా అటవీ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం కుదరక భూ వివాదాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇరు శాఖలతో సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించి రెవెన్యూ భూములకు పట్టాల మంజూరు చేపట్టాలని పదేపదే నిర్దేశిస్తున్నా అడుగు ముందుకు పడడం లేదు. ఈ తరుణంలో కర్షకుల కష్టాలను గమనించిన బాన్సువాడ డివిజన్‌ రెవెన్యూ యంత్రాంగం అటవీ- రెవెన్యూ భూముల వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఎల్లారెడ్డి, కామారెడ్డి రెవెన్యూ డివిజన్లలో మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. రైతుల చేసుకున్న దరఖాస్తులు తిరస్కారానికి గురవుతున్నాయి.

కార్యాచరణ చేశారిలా..

మొదటగా రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రెవెన్యూ- అటవీ భూముల వివాదాలున్న గ్రామాలను గుర్తించారు. ఇరుశాఖల వద్ద ఉన్న దస్త్రాలను సరిపోల్చుకొని జియోగ్రాఫికల్‌ సర్వే ద్వారా హద్దులు నిర్ణయించే పనులు చేపట్టారు.

* సరిపోని ప్రదేశాల్లో సర్వేలాండ్‌ విభాగం అధికారుల ఆధ్వర్యంలో టిప్పన్లలోని భూవిస్తీర్ణాలతో సరిపోల్చుతూ హద్దులు నిర్ణయిస్తున్నారు.

* గ్రామసభ నిర్వహించి అందరి అంగీకారం తీసుకుని భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వేలాది ఎకరాలు

జిల్లాలోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల హద్దులు తేలని పరిస్థితి ఉంది. ప్రధానంగా మాచారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, రామారెడ్డి, సదాశివనగర్‌, గాంధారి మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అటవీ, రెవెన్యూ భూముల హద్దులు తేలితేనే పోడు హక్కుపత్రాల జారీ ప్రక్రియ ముందుకు సాగుతుంది. బాన్సువాడలో అమలు చేసిన విధంగా ఎల్లారెడ్డి, కామారెడ్డిలోనూ చొరవ చూపితే అన్నదాతల సమస్యలు తీరనున్నాయి.

బాన్సువాడలో పలువురికి లబ్ధి

సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ దిశానిర్దేశంలో మూడు నెలల క్రితం బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ యంత్రాంగం భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.

* బీర్కూర్‌తండాకు చెందిన ముగ్గురు రైతులకు టీఎం-33 మాడ్యూల్‌ ద్వారా శుక్రవారం పట్టాలిచ్చారు. ఇదే విధంగా మండలంలోని బీర్కూర్‌, మల్లాపూర్‌ గ్రామాల్లోనూ సంయుక్త సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించారు.

* పిట్లం మండలంలోని చిన్నగౌరారం గ్రామంలోనూ అటవీ భూములకు హద్దులు ఖరారు చేయడంతో 118.20 ఎకరాల విస్తీర్ణం రెవెన్యూ భూములుగా తేలాయి. వాటిని సాగు చేసుకుంటున్న 160 మంది రైతులకు టీఎం-33 మాడ్యూల్‌ ద్వారా పాసుపుస్తకాలు మంజూరు కోసం దరఖాస్తు చేయించారు.

* నస్రుల్లాబాద్‌ మండలంలోని సంగెం గ్రామంలో సర్వే పూర్తి చేసి హద్దులు పాతారు.

* బొల్లక్‌పల్లి గ్రామంలో మరో ఇద్దరు రైతులకు 2.35 ఎకరాల విస్తీర్ణానికి పట్టాల మంజూరు నిమిత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు.


సంయుక్త సర్వేతో హద్దుల నిర్ణయం

- రాజాగౌడ్‌, ఆర్డీవో, బాన్సువాడ

అటవీ- రెవెన్యూ అధికారుల సంయుక్త సర్వేతో భూముల హద్దులు నిర్ణయిస్తున్నాం. నిజాంసాగర్‌, బీర్కూర్‌, పిట్లం, నస్రుల్లాబాద్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ విధంగా చేశాం. మొత్తం వివాదాలు పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం.


ఎట్టకేలకు పట్టా వచ్చింది

- నామానాయక్‌, బీర్కూర్‌తండా, బీర్కూర్‌

అప్పట్లో ప్రభుత్వ భూమి ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు వచ్చి ఇబ్బందులకు గురి చేసేవారు. మూడేళ్లుగా పట్టా కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగాం. అధికారులు సంయుక్త సర్వే చేసి అటవీ భూముల హద్దులు నిర్ణయించడంతో రెవెన్యూ భూమిగా తేలింది. ఎట్టకేలకు పట్టా ఇచ్చారు.


భూమి దక్కదనుకున్నా

- పరశురాములు, బీర్కూర్‌తండా, బీర్కూర్‌

మా పూర్వీకులకు 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసిన భూమి అటవీశాఖదంటూ రెండున్నరేళ్లుగా పంటలు సాగు చేయనివ్వలేదు. రెవెన్యూ అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఆశలు వదిలేసుకున్న తరుణంలో ఎట్టకేలకు సంయుక్త సర్వే నిర్వహించి హద్దులు పాతారు. రెవెన్యూ భూమిగా తేల్చి ధరణి పోర్టల్‌ ద్వారా పట్టాలు మంజూరు చేయడం ఆనందంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని