logo

సుదూరం.. దృశ్యరూపక పాఠం

జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ విద్యా బోధన అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలు చెప్పే విధంగా ఏర్పాట్లు చేశారు. దృశ్యరూపంలో తరగతులను వీక్షించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపేవారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో అన్ని బడుల్లో ఈ తరహా తరగతులను

Updated : 26 Sep 2022 05:31 IST

ప్రభుత్వ బడుల్లో పర్యవేక్షణ కరవు

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం

జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ విద్యా బోధన అమల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆరేళ్ల క్రితం ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రొజెక్టర్‌ ద్వారా పాఠాలు చెప్పే విధంగా ఏర్పాట్లు చేశారు. దృశ్యరూపంలో తరగతులను వీక్షించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపేవారు. ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానం సత్ఫలితాలనివ్వడంతో అన్ని బడుల్లో ఈ తరహా తరగతులను తప్పనిసరి చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సంకల్పించారు. ప్రొజెక్టర్‌తో పాటు ఎల్‌ఈడీ తెరలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.30 వేల వరకు వెచ్చించి మార్పులు తెచ్చారు. ప్రస్తుతం డిజిటల్‌ బోధన అటకెక్కింది. జిల్లాలోని 186 ఉన్నత పాఠశాలల్లో 70శాతం వరకు అమలు కావడం లేదు.

సలువుగా అర్థమయ్యేలా..

జిల్లాలో 4- 5 ఏళ్ల వరకు డిజిటల్‌ తరగతుల నిర్వహణ సజావుగా సాగింది. మొదట 8, 9, 10 తరగతులకు వారంలో 3- 4 క్లాసులు డిజిటల్‌ పాఠాలే బోధించేవారు. విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి.. ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి ఇవెంతగానో దోహదపడ్డాయి. జిల్లాలోని వివిధ బడుల్లో వీటి నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవైంది. సమయసారిణి నుంచి డిజిటల్‌ తరగతులను తొలగించారు. ఇవి తప్పనిసరి కాదనే భావన ఉపాధ్యాయుల్లో ఏర్పడింది. క్రమంగా అమలు చేయడం మానేస్తూ వచ్చారు. కొవిడ్‌ సమయంలో విద్యార్థులు రెండేళ్లపాటు ఆన్‌లైన్‌లోనే పాఠాలు విన్నారు. ప్రస్తుతం కొన్ని బడుల్లో గతంలో ఇచ్చిన పరికరాలన్నీ మూలనపడ్డాయి. అంతర్జాల సౌకర్యం లేకపోవడం, గదుల కొరతతో అడ్డంకులు తప్పడం లేదు.

దాతలు టీవీలు, సామగ్రి  ఇచ్చినా..

దాతలు స్పందించి వేలాది రూపాయలు విలువ చేసే ప్రొజెక్టర్లు, ఇతర సామగ్రిని బడులకు వితరణ చేశారు. టీవీల్లో గణితం, సామాన్యశాస్త్రం, ఆంగ్లం పాఠ్యాంశాలు వచ్చేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ప్రస్తుతం చాలాచోట్ల వీటిని వినియోగించడం లేదు.  

కొన్ని ప్రాంతాల్లో  సిగ్నళ్ల సమస్య

జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంతర్జాల సిగ్నళ్లు సక్రమంగా అందక విద్యార్థులు డిజిటల్‌ పాఠాలకు దూరమవుతున్నారు. దాదాపు 30 బడుల్లో పరికరాలు వృథాగా ఉన్నాయి. అంతర్జాల వసతిని మెరుగుపరచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలలో  నిరుపయోగంగా పరికరాలు


తప్పనిసరి కాదన్నారు

- వేణుశర్మ, విద్యాశాఖ సమన్వయకర్త

డిజిటల్‌ తరగతులు వివిధ పాఠశాలల్లో అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఇవి తప్పనిసరి కాదని విద్యాశాఖ పేర్కొంది. అందులో ప్రత్యేకంగా బోధించాల్సిన పాఠాలేమీ లేవు. ఇందుకు సంబంధించిన పరికరాలు వృథా కానివ్వం. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులను పకడ్బందీగా చేపట్టాం. ప్రస్తుతం డిజిటల్‌ తరగతులను మరోమారు చక్కదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని