logo

ప్రజాప్రతినిధి.. సాగు విధి

నిబద్ధత ఉంటే కానిదేదీ లేదంటున్నారు మహిళామణులు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పజెప్పిన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ జీవనాధారమైన పంటల సాగులో రాణిస్తున్నారు నందిపేట్‌ ప్రజాప్రతినిధులు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు. వ్యవసాయంలో

Published : 26 Sep 2022 02:27 IST

రెండు రంగాల్లో రాణిస్తున్న మహిళామణులు

న్యూస్‌టుడే, నందిపేట్‌

నిబద్ధత ఉంటే కానిదేదీ లేదంటున్నారు మహిళామణులు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పజెప్పిన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే తమ జీవనాధారమైన పంటల సాగులో రాణిస్తున్నారు నందిపేట్‌ ప్రజాప్రతినిధులు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ తమ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్నారు. వ్యవసాయంలో సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులు సాధిస్తూ కుటుంబానికి ఆర్థిక చేయూతనిస్తున్నారు.

మొక్కజొన్న తూర్పారపడుతున్న సర్పంచి లలిత

వన్నెల్‌(కే) సర్పంచి కాటిపల్లి లలిత గ్రామ ప్రథమ పౌరురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే వ్యవసాయంలో రాణిస్తున్నారు. తమకున్న 11 ఎకరాల్లో విభిన్న పంటలు సాగు చేస్తున్నారు. ఐదెకరాల్లో ఆయిల్‌ఫాం, అంతర పంటగా సోయాబీన్‌, నాలుగెకరాల్లో పసుపు, అంతరంగా మొక్కజొన్న, రెండెకరాల్లో వరి వేశారు. వీటన్నింటిని పర్యవేక్షిస్తూనే గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆమె బాధ్యతలు చేపట్టాక రూ.78 లక్షలతో సీసీ రోడ్లు  వేయించారు. రూ.23 లక్షలతో సీసీ డ్రైనేజీలు, రూ.29 లక్షలతో సామాజిక భవనాలు నిర్మించారు. రూ.4.5 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. పచ్చదనం, పరిశుభ్రతలో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అవసరమైతే స్థానిక సమస్యలను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దృష్టికి నేరుగా తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

కూరగాయల అక్క

వరి పొలంలో జడ్పీటీసీ సభ్యురాలు యమున

జడ్పీటీసీ సభ్యురాలు ఎర్రం యమున. గతంలో వ్యవసాయం చేస్తూ మార్కెట్‌లో కూరగాయలు విక్రయించేవారు. పదవీ  బాధ్యతలు చేపట్టాక కూడా దీనిని కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో అధికారిక కార్యక్రమాలు ఉంటే హాజరవుతున్నారు. వివిధ సమస్యలతో ఇంటికి వచ్చే వారి నుంచి వినతులు స్వీకరించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. రూ.10 లక్షలతో పాతూర్‌లో సీసీ డ్రైనేజీ నిర్మించారు.రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, నందిపేట్‌లో అంతర్గత రోడ్ల మరమ్మతులు చేశారు. వివిధ గ్రామాల్లో సామాజిక భవనల్లో బోర్లు వేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. నిత్యం  వ్యవసాయ క్షేత్రానికి వెళ్లడం మాత్రం   మరవరు. తమకున్న పదెకరాల్లో వరి, కూరగాయలు, పూలు సాగు చేస్తున్నారు. దిగుబడులు తీసుకెళ్లి సంతలో విక్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని