logo

అర్హుల జాబితా వడపోత

మలి విడత రాయితీ జీవాల పంపిణీకి సర్కారు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలను మారుస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి దశలో డీడీలు చెల్లించి నిరీక్షించిన లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

Published : 27 Sep 2022 05:59 IST
గతంలో డీడీలు తీసిన వారికి ప్రాధాన్యం 
రాయితీ జీవాల పంపిణీలో మారిన మార్గదర్శకాలు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం: మలి విడత రాయితీ జీవాల పంపిణీకి సర్కారు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలను మారుస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదటి దశలో డీడీలు చెల్లించి నిరీక్షించిన లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో కొంత మంది వివిధ కారణాలతో చనిపోగా.. వీరిని తొలగిస్తూ అర్హులెవరున్నరనే దానిపై జాబితా వడపోస్తోంది. ఈ ప్రక్రియ తుదిదశకు చేరింది. గతంలో మాదిరి లబ్ధిదారుడి వాటా డీడీ రూపంలో చెల్లించకుండా నేరుగా జిల్లా పాలనాధికారి ప్రత్యేక ఖాతాకే నగదు బదిలీ చేసేలా ఆదేశాలున్నాయి. జిల్లాకు జీవాలను ఏ ప్రాంతం నుంచి సేకరించాలనేది ఒక్కటే మిగిలింది. ఇది ఖరారైతే రెండో విడత పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది.

2,917 మందికి..

రాష్ట్ర ప్రభుత్వం 2017లో రాయితీ జీవాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలో మొత్తంగా 19,106 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఈ జాబితాను రెండుగా విభజించి మొదటి దశలో 10,722 మందికి దశల వారీగా అందజేశారు. రెండో జాబితాలో 8,384 మంది మిగిలిపోయారు. వీరిలో కొంత మంది ముందస్తుగా భాగస్వామ్య వాటా కింద డీడీలు చెల్లించారు. చివరి వరకు వేచిచూసిన వారికి ఇటీవలే అందజేశారు. డీడీలు వెనక్కి తీసుకున్న వారికి ఇప్పుడు మొదటి ప్రాధాన్యం కింద ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలో 2917 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. చనిపోయిన కొంత మందిని తొలగించి కొత్త జాబితాను తయారు చేశారు. ప్రస్తుతం 952 మంది తమ భాగస్వామ్య వాటా చెల్లించారు. జిల్లాకు మిగిలిన యూనిట్లకు సంబంధించి 1,76,064 జీవాలు రావల్సి ఉంది.

పెరిగిన వాటాధనం

ఒక్కో యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలుండగా.. పెరిగిన జీవాల ధరతో ప్రభుత్వం రూ.1.75 లక్షలకు పెంచింది. ఇందులో లబ్ధిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఇస్తారు. ఇదివరకు లబ్ధిదారుడు రూ.31,250 డీడీ తీసి మండల పశువైద్యాధికారికి సమర్పించేవారు. మారిన మార్గదర్శకాల ప్రకారం రూ.43,750 చెల్లించాలి. ఈ మొత్తాన్ని కలెక్టర్‌ ప్రత్యేక ఖాతాకు పంపించాలి. లబ్ధిదారులే నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లించి సంబంధిత వివరాలు మండల పశువైద్యాధికారికి అందజేయాలి.

పారదర్శకంగా..

గతంలో పంపిణీ చేసినప్పుడు కొన్ని అక్రమాలు చోటు చేసుకున్నాయనే అపవాదు ఉంది. ఈసారి అలాంటిదేమీ లేకుండా లబ్ధిదారుల ఎంపికను ఈ-ల్యాబ్‌లో నమోదు చేస్తున్నామని.. పూర్తి పారదర్శకతతో  పంపిణీ  చేస్తామని జిల్లా పశుసంవర్ధకశాఖ  సహాయ సంచాలకులు బాలిగ్‌ అహ్మద్‌ ‘న్యూస్‌టుడే’కు వివరించారు.

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts