logo

ధరణితో భూసమస్యలు పరిష్కారం

పెండింగ్‌ భూసమస్యలను ధరణి పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ ద్వారా పరిష్కరిస్తున్నామని పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సివిల్‌ భూతగాదాలు మినహా

Updated : 27 Sep 2022 06:00 IST

జితేష్‌ వి.పాటిల్‌, పాలనాధికారి, కామారెడ్డి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: పెండింగ్‌ భూసమస్యలను ధరణి పోర్టల్‌లోని గ్రీవెన్స్‌ ద్వారా పరిష్కరిస్తున్నామని పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సివిల్‌ భూతగాదాలు మినహా ఇతర వాటిపై రైతులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టీఎం-33 మాడ్యూల్‌లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పలు ఐచ్ఛికాలు ప్రవేశపెట్టిందన్నారు. వీటిపై ఇప్పటికే మీసేవ కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించామని వెల్లడించారు.

ఆయుర్వేద ఔషధాలు

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1200 మంది మహిళలు, చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. దీన్ని నివారించేందుకు బాలామృతం ప్లస్‌తో పాటు ప్రత్యేకంగా ఆయుర్వేద ఔషధాలు పంపిణీ చేశాం. ఇందుకు గాను అంగన్‌వాడీ టీచర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలతో ప్రత్యేకంగా కమిటీలు వేశాం. ఫలితంగా పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య 200కు తగ్గింది.

సర్వేనంబర్‌(6)లోని ప్రభుత్వ భూమి స్వాధీనం

కామారెడ్డి పట్టణంలో సర్వేనంబరు(6)లోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించాం. ఇప్పటికే నోటీసులు జారీచేశాం. నిబంధనలకు అనుగుణంగా వాటిని ప్రజా అవసరాలకు వినియోగిస్తాం. ఇతర ఆక్రమణల ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని పురపాలిక అధికారులకు ఆదేశాలు జారీచేశాం.

అర్జీల నమోదుకు ప్రత్యేక రిజిస్టర్‌

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వస్తున్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం.

వైద్యశాఖపై ప్రత్యేక నిఘా

జిల్లాలోని 14 పీహెచ్‌సీల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వైద్యశాఖలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖ పనితీరును చక్కదిద్దాలని నిర్ణయించాం. ప్రైవేటు ఆసుపత్రుల తనిఖీల తీరుపై సమీక్షిస్తాం.


సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ మేళాలు

ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌ కొలువులు ఇప్పించే నిమిత్తం హెచ్‌సీఎల్‌తో ఒప్పందం చేసుకుని జాబ్‌మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవలే బాన్సువాడలో నిర్వహించాం. ఇప్పటివరకు చేపట్టిన ప్రాంగణ నియామకాల్లో 36 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరికి హెచ్‌సీఎల్‌ కంపెనీ నిర్వాహకులు డిగ్రీ విద్యతో పాటు సాఫ్ట్‌వేర్‌ శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వనున్నారు.


అన్నదాతలకు అండగా...

జిల్లాలో డెయిరీ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకుల సేవలను వినియోగించుకుని పాల దిగుబడులు పెంచడంతోపాటు ఉత్పత్తులు తయారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనివల్ల పాడి రైతులకు ప్రయోజనం కలగనుంది. కూరగాయలు పండించే కర్షకులకు చేయూత నిచ్చేందుకు కంపెనీలు ఇంటికే వచ్చి కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నాం.


దళితబంధు గ్రౌండింగ్‌ పూర్తి

నిజాంసాగర్‌ మండలంలో 1,298 దళిత కుటుంబాలు ఎంపిక చేసుకున్న యూనిట్ల గ్రౌండింగ్‌ పూర్తయింది. ప్రతి ఒక్కరి ఖాతాల్లో నగదు జమచేశాం. ముద్దచర్మ వ్యాధి కారణంగా గొర్రెలు, గేదెల కొనుగోలును వాయిదా వేశాం. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు దళితబంధు వర్తింపజేసేలా కార్యాచరణ రూపొందించాం.

ధరణి పోర్టల్‌ గ్రీవెన్స్‌ వివరాలు
వచ్చిన దరఖాస్తులు 17,749
పరిష్కరించినవి 15,570
పెండింగ్‌లో ఉన్నవి 2,179

Read latest Nizamabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని