logo

ఆహార అభద్రత..

అర్హులైన వారికి ప్రజాపంపిణీ బియ్యం అందడం లేదు. వారి పేర్లు కార్డుల్లో చేర్చడంలో జాప్యం జరుగుతుండటం ఇందుకు కారణం. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తోంది.జిల్లావ్యాప్తంగా

Published : 27 Sep 2022 05:59 IST

రేషన్‌ కార్డుల్లో కొత్తపేర్లు చేర్చడంలో జాప్యం
జిల్లావ్యాప్తంగా 18,941 మంది ఎదురుచూపులు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌: అర్హులైన వారికి ప్రజాపంపిణీ బియ్యం అందడం లేదు. వారి పేర్లు కార్డుల్లో చేర్చడంలో జాప్యం జరుగుతుండటం ఇందుకు కారణం. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తోంది.జిల్లావ్యాప్తంగా ఆయా కుటుంబాల్లో కొత్తగా జన్మించిన వారి పేర్లు కార్డుల్లో చేర్చడానికి స్థానికంగా వీలులేకుండా పోయింది. దరఖాస్తుల వివరాలను రాష్ట్ర స్థాయికి పంపించినప్పటికి అతీగతీ లేదు. జిల్లాలో 18,941 మంది పేర్లు కార్డుల్లో చేర్చాల్సి ఉంది.

బియ్యం అందక..

రేషన్‌కార్డులో సభ్యుల సంఖ్యకు అనుగుణంగా బియ్యం సరఫరా చేస్తున్నారు. ఐదారేళ్ల క్రితం జన్మించిన పిల్లల పేర్లు కార్డుల్లో లేకపోవడంతో వారికి బియ్యం రావడం లేదు. దీనివల్ల కూలీ పని చేసుకుని కుటుంబాలు పోషించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్న కుటుంబంలో భార్యాభర్తలకు మాత్రమే సరకు వస్తోంది. పిల్లలకు కోటా రాకపోవడంతో బయట కిలోకు రూ.10-12 చొప్పున కొనుగోలు చేసుకుంటున్నారు.

మృతుల గుర్తింపు..

సుమారు మూడు, నాలుగేళ్ల క్రితం నుంచి మృతుల వివరాలు సేకరించ లేదు. వారి పేరిట బియ్యం ప్రతినెల మంజూరవుతూనే ఉన్నాయి. ఈ కోటాను కొందరు కుటుంబీకులు తీసుకుంటుండగా.. మరికొన్ని చోట్ల డీలర్లు పంచుకుంటున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం గతనెల ఇంటింటా సర్వే నిర్వహించింది. మృతుల వివరాలు సేకరించింది. జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేల మంది లబ్ధిదారులు మృతి చెందారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించి కార్డుల్లో పేర్లు నమోదు చేయించే అవకాశం ఉంది.

గతంలో వెనువెంటనే..

రేషన్‌కార్డులు జారీ చేయడం.. కొత్తవారి పేర్లు నమోదు గతంలో భిన్నంగా ఉండేది. స్థానిక తహసీల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే వెనువెంటనే జరిగిపోయేవి. జిల్లాస్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహించడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు.


వివాహమైన అమ్మాయిలు..

రేషన్‌ కార్డుల నుంచి వివాహమైన ఆడపిల్లల పేర్లు తొలగిస్తున్నారు. తిరిగి అత్తారింటి వారిదాంట్లో చేర్చడానికి చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి దరఖాస్తులు జిల్లావ్యాప్తంగా 6 వేల వరకు ఉన్నాయి. ఇందులో చాలా మంది తమకు భర్తతో కలిపి ప్రత్యేకంగా జారీ చేయాలని విన్నవించగా.. గతేడాది కొందరికి కొత్త కార్డులు ఇచ్చారు. కొత్త పేర్లు చేర్చే విషయంలో నాన్చుడు ధోరణి మాత్రం వీడటం లేదు.


అంతా రాష్ట్రస్థాయిలో.. - రాజశేఖర్‌, ఇన్‌ఛార్జి డీఎస్‌వో, కామారెడ్డి
రేషన్‌కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియ అంతా రాష్ట్రస్థాయిలోనే ఉంటుంది. దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశాం. పేర్లు చేర్చాక వారికి బియ్యం పంపిణీ చేస్తాం.

రేషన్‌ కార్డులు : 2,53,776
పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులు: 51,585
సభ్యుల పేర్లు చేర్చినవి: 33,094
పెండింగ్‌లో ఉన్నవి: 18,941

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని