logo

అన్నదాతలకు ధరణి తిప్పలు

భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ధరణిని అందుబాటులోకి తెచ్చింది. కానీ కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి భూములు మరొకరి పేరిట నమోదు కావడం..

Published : 27 Sep 2022 06:02 IST

భీమ్‌గల్‌ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న గంగారెడ్డి

ఈనాడు, నిజామాబాద్‌: భూవివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం ధరణిని అందుబాటులోకి తెచ్చింది. కానీ కిందిస్థాయి సిబ్బంది చేసిన తప్పిదాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒకరి భూములు మరొకరి పేరిట నమోదు కావడం.. విస్తీర్ణాలు తక్కువగా రావడం, పట్టాభూమి నిషేధిత జాబితాలోకి వెళ్లడం వంటివి జరిగాయి. ధరణిలోని పొరపాట్లు సవరించడానికి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆప్షన్లు ఇచ్చినా.. పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత రైతులు సోమవారం తహసీల్దార్ల కార్యాలయాలకు వచ్చి మరోసారి తమ గోడు వెళ్లబోసుకున్నారు.


నిషేధిత జాబితాలో నమోదైంది
- సుధాకర్‌, దుర్గానగర్‌, మాక్లూర్‌

మా అమ్మ సావిత్రి పేరిట రెండెకరాల భూమి ఉండేది. కొంతకాలం కిందటే ఆ భూమిని నా భార్య భాగ్యలక్ష్మి పేరిట మార్చాను. కానీ కొత్త పాస్‌ పుస్తకాలు రాలేదు. భూమి నిషేధిత జాబితాలో నమోదైనట్లు అధికారులు చెప్పారు. అందులో నుంచి తొలగించాలంటూ ఏడాది క్రితం దరఖాస్తు చేశాను. తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.


కొత్త పాసుపుస్తకం రాలేదు
- నెనావత్‌ రమేష్‌, ధనంబండ తండా, ధర్పల్లి

మా తాతల కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటున్నాం. పాత పట్టా ప్రకారం 2.10 ఎకరాలు ఉంది. కొత్త పాస్‌ పుస్తకాల కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడుస్తున్నా రాలేదు. 275 సర్వే నంబర్‌లో జారీ చేసిన పట్టా పాసు పుస్తకాల విస్తీర్ణం ఇంతకు మించి ఉండటంతో సమస్య ఉన్నట్లు అధికారులు చెప్పారు.


గల్ఫ్‌ వెళ్లొచ్చేసరికి.. మార్చేశారు
- మేతరి గంగారాం, బట్టాపూర్‌, ఏర్గట్ల

గ్రామంలో నాకు 38 గుంటల భూమి ఉంది. దాన్ని మా గ్రామానికి చెందిన మరో వ్యక్తి గంగారాం పేరుపై ధరణిలో తప్పుగా నమోదు చేశారు. గల్ఫ్‌లో ఉండటంతో సమస్యను ఆలస్యంగా గుర్తించాను. తహసీల్దార్‌ కార్యాలయంలో విన్నవించినా ప్రయోజనం దక్కడం లేదు.


అసైన్డ్‌ అని చెబుతున్నారు
- కురుమ నరేష్‌, అంబం, రుద్రూర్‌

నా పేరు మీద 22 గుంటల పట్టా భూమి ఉంది. కొత్త పాస్‌ పుస్తకం రావటంతో పాటు రైతుబంధు కూడా వస్తోంది. కుటుంబ అవసరాల నిమిత్తం భూమిని విక్రయించాలని వెళ్లాను. ధరణిలో అసైన్డ్‌ భూమిగా నమోదై ఉన్నట్లు తహసీల్దార్‌ చెబుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందో తెలియట్లేదు.


నా భూమి.. మరొకరి పేరుపై
- మామిడిపల్లి గంగారెడ్డి, చేంగల్‌, భీమ్‌గల్‌

కొత్త పాస్‌ పుస్తకాలు వచ్చాక నా భూమిని మరొకరి పేరుపై నమోదు చేసినట్లు గుర్తించాను. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. క్షేత్రస్థాయిలో పంచనామా చేశారు. నివేదిక కూడా పంపినట్లు అధికారులు చెబుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. మా మండలానికి చెందిన మరో రైతుకు 8 ఎకరాలు ఉండగా.. ధరణిలో 6 ఎకరాలే నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని