logo

అదనపు వసూళ్లు.. కార్యాలయానికి మెరుగులు

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకో చోట అవినీతి వెలుగు చూస్తోంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్లు సస్పెండ్‌ అయ్యారు. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాకేంద్రంలోని

Published : 29 Sep 2022 03:21 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

బ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకో చోట అవినీతి వెలుగు చూస్తోంది. వివిధ కారణాలతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఐదుగురు సబ్‌ రిజిస్ట్రార్లు సస్పెండ్‌ అయ్యారు. అయినా ఆ శాఖలో మార్పు కనిపించడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాకేంద్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వసూళ్ల దందా వెలుగు చూసింది. కొన్నేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయాన్ని ఇటీవల ఖాళీ చేయాలని యజమాని కోరారు. దీంతో పాతరాజంపేటలోని పంచాయతీ భవనంలోకి తరలించాలని నిర్ణయించారు. ఇందుకు తగ్గట్లుగా నవీకరించేందుకు ఒక్కో డాక్యుమెంట్‌ రైటర్‌(లేఖరి) నుంచి కొంత మొత్తం రాబడుతున్నట్లు సమాచారం. లేఖరులు ఇదే అదనుగా రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.

డొనేషన్‌ పేరిట
నూతన భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకయ్యే ఖర్చులను డొనేషన్‌ పేరిట రాబట్టేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.  ఈ కార్యాలయం పరిధిలో 34 మంది లేఖరులుండగా రూ.20 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నుంచి నిర్దేశించిన మొత్తం రాబట్టినట్లు తెలిసింది. మిగిలిన వాళ్లు ఇవ్వకుంటే పని జరిగేది లేదని హెచ్చరికలు జారీ చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల నుంచే..
నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయం ముంగిట మకాం వేసిన లేఖరులు డొనేషన్‌ సొమ్మును ప్రజల నుంచే రాబడుతున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంటుకు వసూలు చేసే మొత్తాన్ని రెట్టింపు చేసి దోచుకుంటున్నారు. రెండ్రోజుల కిందట జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్‌కు చెందిన వ్యక్తి ప్లాటు రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా డాక్యుమెంట్‌ రైటర్‌ రూ.9500 చెల్లించాలని నిర్దేశించాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ఇది మామూలేనని జవాబివ్వడం గమనార్హం. అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. పురపాలక సంఘానికి చెల్లించాల్సిన వీఎల్‌టీ ట్యాక్సును కూడా లేఖరులు తమ జేబులో వేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పురపాలక సంఘం అధికారులు కలెక్టర్‌ ద్వారా సబ్‌రిజిస్ట్రార్‌కు లేఖలు పంపారు. వీఎల్‌టీ దస్త్రం లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయొద్దని నిర్దేశించారు. అయినా లేఖరుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు, సిబ్బంది దొంగచాటుగా రిజిస్ట్రేషన్లు కానిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

గిట్టకే ఆరోపణలు
- శ్రీలత, సబ్‌రిజిస్ట్రార్‌, కామారెడ్డి

నూతన కార్యాలయం నవీకరణ నిమిత్తం వసూళ్లు చేస్తున్నామనడం తప్పుడు ఆరోపణ. ఇటీవల వీఎల్‌టీ ఉంటేనే రిజిస్ట్రేషన్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో అదే పాటిస్తున్నాం. ఇది గిట్టని కొందరు లేఖరులు కార్యాలయం సిబ్బందితో పాటు అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వినియోగదారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఎవరికీ పైసా ఇవ్వొద్దు. నేరుగా నా వద్దకు వచ్చి నిబంధనలకు అనుగుణంగా దస్త్రాలు సమర్పిస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని