logo

జిల్లాలో మరో కొత్త మండలం

జిల్లాలో మరో  రెవెన్యూ మండలం ఏర్పాటు కానుంది. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లోని కోటగిరి నుంచి 14 రెవెన్యూ గ్రామాలతో పోతంగల్‌ కొత్తగా ఆవిర్భవించనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో

Published : 29 Sep 2022 03:21 IST

2 14 గ్రామాలతో పోతంగల్‌
ఈనాడు, నిజామాబాద్‌

గ్రామ కూడలి

జిల్లాలో మరో  రెవెన్యూ మండలం ఏర్పాటు కానుంది. బోధన్‌ రెవెన్యూ డివిజన్‌లోని కోటగిరి నుంచి 14 రెవెన్యూ గ్రామాలతో పోతంగల్‌ కొత్తగా ఆవిర్భవించనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో జిల్లాలోని మండలాల సంఖ్య 33కు చేరుకోనుంది. కొత్త మండలంలో ప్రతిపాదించిన గ్రామాల విషయంలో ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక.. 15 రోజుల అనంతరం తుది నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ వెంటనే పోతంగల్‌ నుంచే పాలన ఆరంభం కానుంది.

మంజీర తీర గ్రామాలు..
కొడిచర్ల, జల్లపల్లి, కల్లూర్‌, హంగర్గ, హెగ్డోలి, కొల్లూర్‌, దోమలెడ్గి, సోంపూర్‌, టాక్లి, సుంకిని, కారేగావ్‌, హుమ్నాపూర్‌, తిరుమలపూర్‌లతో కలిసి  పోతంగల్‌ మండల కేంద్రంగా రూపుదిద్దుకోనుంది. చాలావరకు మంజీర నదికి సమీపంలోని గ్రామాలతో ఏర్పాటు కానుంది. ప్రస్తుత  కోటగిరి.. 28 గ్రామ పంచాయతీలతో పెద్ద విస్తీర్ణంతో ఉంది. పాలన సౌలభ్యం కోసం తమకు వేరుగా మండలం ఏర్పాటు చేయాలంటూ పరిసర గ్రామాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొంతకాలంగా కోరుతూ వచ్చారు. ఈ విషయాన్ని స్థానిక శాసనసభ్యుడు, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. సాలూరతో పాటే ఇదీ వస్తుందని ప్రచారం జరిగింది. కానీ జాబితాలో పేరు లేకపోవటంతో నాయకులు మళ్లీ సభాపతి దృష్టికి తమ ఆకాంక్షను తీసుకెళ్లారు. ఆయన వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజా ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదలైంది.

26 వేల జనాభా.. 14 గ్రామాలను విభజించి పోతంగల్‌ను మండలంగా ఏర్పాటు చేయడంతో పాలనా సౌలభ్యం కలగనుందని ఆర్డీవో రాజేశ్వర్‌ తెలిపారు. వీటిలో పోతంగల్‌, జెల్లపల్లి, కొల్లూర్‌, హంగర్గ మేజర్‌ పంచాయతీలు. కొత్త మండలం జనాభా 26,151 మందితో ప్రతిపాదించారు. ఇప్పటికే ఆయా గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకున్న నేపథ్యంలో తుది నోటిఫికేషన్‌ త్వరలోనే రానుంది. ప్రభుత్వ నిర్ణయంపై సభాపతి పోచారం సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని