logo

ప్రాథమిక స్థాయిలో ఆరోగ్యశ్రీ..!

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఓపీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఏయే వ్యాధులతో సతమతమవుతున్నారో వివరాల లెక్క తీస్తున్నారు.

Published : 29 Sep 2022 03:21 IST

వైద్యసేవలు మెరుగుపరిచే దిశగా కార్యాచరణ
న్యూస్‌టుడే, కామారెడ్డి వైద్యవిభాగం

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఓపీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో ఏయే వ్యాధులతో సతమతమవుతున్నారో వివరాల లెక్క తీస్తున్నారు. వాటికి అనుగుణంగా వైద్యం అందేలా చర్యలు చేపట్టనున్నారు.

చిన్నపాటి శస్త్రచికిత్సలు
ప్రస్తుతం జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల పరిధిలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. పీహెచ్‌సీల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చి చిన్నపాటి శస్త్రచికిత్సలతో పాటు క్లిష్ట పరిస్థితులకు వెళ్లకుండా వైద్యంలో మార్పులు చేయనున్నారు. రోగి తన వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే నయం చేసుకునే దిశగా సేవలందించనున్నారు. దీనికి తోడు పట్టణాల్లోని బస్తీ దవాఖానాలను మరింత మెరుగుపరచనున్నారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో మాత్రమే ప్రారంభించగా... త్వరలో బాన్సువాడలో అందుబాటులోకి రానుంది. ఇటీవల వైద్యవిధాన పరిషత్‌ పరిధిలోకి వచ్చిన ఆరోగ్యకేంద్రాల్లోనూ వైద్యం మరింత మెరుగుపరిచేందుకు యంత్రాంగం నడుం బిగించింది.

జిల్లా ఆసుపత్రిలో రోగుల తాకిడి

వ్యాధులపై మరోమారు సర్వే
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వివిధ వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇందులో రక్తపోటు, మధుమేహం, అర్షమొలలు, కీళ్లనొప్పులు, వివిధ శారీరక రుగ్మతలతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ఔషధాలతో నియంత్రించే అవకాశం ఉంది. శస్త్రచికిత్సల నిమిత్తం ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు రావాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఆరోగ్యకేంద్రం పరిధిలో కేసుల సరళికి అనుగుణంగా ప్రత్యేక వైద్య నిపుణులను పిలిపించి ఆరోగ్యశ్రీ కింద చర్యలు చేపట్టనున్నారు. త్వరలో ఇంటింటికి వెళ్లి వ్యాధుల వివరాలను నమోదు చేయనున్నారు.

భారం తగ్గించేందుకే
రోగులు వ్యయప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రాలకు వస్తుంటారు. గ్రామాల నుంచి రావడానికి రవాణా ఛార్జీలు భారమవుతున్నాయి. సహాయకులతో కలిపి ఇద్దరి నుంచి ముగ్గురు ఆసుపత్రికి వస్తున్నారు. రానుపోను రూ.500 వరకు ఖర్చవుతోంది. ప్రైవేటు అంబులెన్సులైతే రూ.వేలల్లో భరించాల్సిందే. ఈ నేపథ్యంలో వారి చెంతకే వైద్యాన్ని చేరువ చేయనున్నారు. పీహెచ్‌సీల్లో ఆరోగశ్రీ సేవలు అందుబాటులోకి తెచ్చాక మలివిడతలో వెల్‌నెస్‌ కేంద్రాల్లోనూ అమలు చేయాలని యోచిస్తున్నారు.

సిద్ధంగా ఉన్నాం
- డా.శోభ, డిప్యూటీ డీఎంహెచ్‌వో

ప్రతి పీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మంచి ఆలోచనతో అన్ని కేంద్రాల్లో చిన్నపాటి శస్త్రచికిత్సలు, ఇతర సేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని