logo

బెంబేలెత్తిస్తున్న శునకాలు

నగరం.. పట్టణాలు.. పల్లెలు అనే తేడా లేకుండా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రుల్లో పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవడం కష్టమవుతోంది. వీటి బెడద తీవ్రమవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కుక్కల నియంత్రణలో ఎలాంటి నిర్ణయం

Published : 30 Sep 2022 03:21 IST

నగరంలో ఆగిన శస్త్రచికిత్స ప్రక్రియ
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

* ఆర్మూర్‌ పట్టణం పెద్దబజార్‌లో పది రోజుల క్రితం కుక్క దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.
* తాజాగా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ)లోనూ ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి.

గరం.. పట్టణాలు.. పల్లెలు అనే తేడా లేకుండా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రుల్లో పనులు ముగించుకొని ఇంటికి చేరుకోవడం కష్టమవుతోంది. వీటి బెడద తీవ్రమవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కుక్కల నియంత్రణలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తలనొప్పి వ్యవహారమంటూ అటు పంచాయతీ, బల్దియా పాలకవర్గాలతోపాటు అధికారులు చేతులెత్తేస్తున్నారు.

హైకోర్టు  ఆదేశించినా..
శునకాల నియంత్రణపై హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించిన న్యాయమూర్తులు ప్రతి మున్సిపాలిటీలో కుక్కల జనన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకు ఆరు నెలల గడువిచ్చినా ఎక్కడా ముందడుగు పడలేదు.

గతంలో  ఇలా..
ఎక్కడైనా కుక్క కాటు ఘటనలు చోటు చేసుకుంటేనే పంచాయతీ, బల్దియా సిబ్బంది స్పందిస్తున్నారు. ఆ ప్రాంతంలో వాటి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. జంతు ప్రేమికుల నుంచి అభ్యంతరాలు రాకుండా ఆచితూచి అడుగేస్తున్నారు. గతం లో నగరపాలక సంస్థ అధికారులు శునకాలను పట్టుకెళ్లి డిచ్‌పల్లి-ఇందల్‌వాయి, ఆర్మూర్‌, మామిడిపల్లి పరిధిలోని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టి వచ్చేవారు. ఈ ప్రక్రియ అనధికారికంగా చేపట్టారు.

ముగిసిన  ఒప్పందం
నిజామాబాద్‌ నగరంలో కుక్కలకు కు.ని. శస్త్రచికిత్సలు చేపట్టేందుకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనల మేరకు వాటికి ఆపరేషన్‌ చేసిన తర్వాత వారం రోజులపాటు సంరక్షణలో ఉంచుకునేవారు. శునకాల ఆరోగ్యం మెరుగుపడగానే ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో అదే ప్రాంతంలో వదిలేసేవారు. ఒప్పందం ముగియడంతో ప్రక్రియ అటకెక్కింది. త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇవీ నిబంధనలు
శునకాలకు విషం ఇచ్చి చంపడం నిషేధం
సుశిక్షితులైన వ్యక్తులు మాత్రమే వాటికి గాయం కాకుండా పట్టుకోవాలి
కుక్కల తరలింపునకు చెత్త తరలించే వాహనాలు ఉపయోగించొద్దు
కు.ని. చికిత్సకు ముందు, తరువాత విశ్రాంతి గదుల్లో ఉంచాలి.
అటవీ ప్రాంతంలో వదిలేస్తే అక్కడ నీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలి.

నగర శివారులోని ముబారక్‌నగర్‌ మహాలక్ష్మి నగర్‌లో కుక్కల గుంపు

ఫిర్యాదు చేస్తే పట్టుకుంటారు
- జయసుధ, జిల్లా పంచాయతీ అధికారి, నిజామాబాద్‌

గ్రామాల్లో ఎక్కడైనా కుక్కల సమస్య తీవ్రంగా ఉందని పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే స్పందిస్తున్నారు. ప్రత్యేక కార్మికుల ద్వారా వాటిని పట్టుకొని దూరంగా  వదిలేస్తున్నారు. శునకాల నివారణకు పంచాయతీలో ప్రత్యేకంగా సిబ్బంది లేరు. ఉన్న కార్మికులు పారిశుద్ధ్య సమస్యపై దృష్టి సారిస్తున్నారు. కుక్కలతో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించాం.

నివారణపై దృష్టి
- సాజీద్‌అలీ, ప్రజారోగ్య అధికారి, నగరపాలక సంస్థ

నగరంలో కుక్కల నివారణపై చర్యలు తీసుకుంటున్నాం. ఏదైనా కాలనీ నుంచి ఫిర్యాదు వస్తే సిబ్బంది వెళ్లి పట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసే ప్రక్రియ మళ్లీ ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని