logo

తనిఖీలు 32 నోటీసులు 16

అగ్నిమాపకశాఖ అనుమతులుండవు.. పారిశుద్ధ్యం అసలే ఉండదు.. రోగులకు కనీసం కుర్చీలుండవు.. పడకలు, స్కానింగ్‌ రుసుముల పట్టిక కనిపించదు.. రిజిస్టర్‌ వైద్యులు కానరారు.. క్లుప్తంగా జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాల పరిస్థితి

Published : 30 Sep 2022 03:21 IST

ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ
నామమాత్ర తనిఖీలపై విమర్శలు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి


పిట్లంలో ప్రైవేటు ఆసుపత్రిని తనిఖీ చేస్తున్న వైద్యాధికారుల బృందం (పాతచిత్రం)

గ్నిమాపకశాఖ అనుమతులుండవు.. పారిశుద్ధ్యం అసలే ఉండదు.. రోగులకు కనీసం కుర్చీలుండవు.. పడకలు, స్కానింగ్‌ రుసుముల పట్టిక కనిపించదు.. రిజిస్టర్‌ వైద్యులు కానరారు.. క్లుప్తంగా జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులు, రోగనిర్ధారణ కేంద్రాల పరిస్థితి ఇది. ఇటీవల వైద్యాధికారులు చేపడుతున్న తనిఖీల్లో అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 32 ఆసుపత్రులను పరిశీలించగా.. 16 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దొంగల చేతికే తాళాలు ఇచ్చినట్లు..
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నిర్దేశించినప్పటికీ అధికారులు శ్రద్ధ పెట్టలేదు. కలెక్టర్‌ ప్రత్యేక ఆదేశాలతో  తనిఖీల నిమిత్తం బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంతకాలు లేకుండా వాట్సప్‌ గ్రూపులో తెల్లకాగితంపై రాసి పెట్టారు. దీనినే ఉత్తర్వులుగా భావించి పరిశీలన చేపట్టాలని నిర్దేశించారు. నియమితులైన సభ్యులు ఇందుకు ససేమిరా అనడంతో తిరిగి సంతకాలతో కూడిన ఉత్తర్వులు విడుదల చేశారు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులను బృందాల్లో సభ్యులుగా నియమించడం విమర్శలకు దారితీస్తోంది.

కొరవడిన పర్యవేక్షణ
పొరుగు జిల్లాల్లో డీఎంహెచ్‌వోల పర్యవేక్షణలో పక్కాగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి వివరాలు బహిరంగంగా వెల్లడిస్తున్నారు. జిల్లాలో డీఎంహెచ్‌వో సెలవులో ఉండటంతో పాటు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పర్యవేక్షణ కొరవడి నామమాత్రంగానే సాగుతున్నాయి. ముందస్తు ఒప్పందాల్లో భాగంగానే నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఉల్లంఘనలు ఇలా.. :  వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ల్యాబులు నడుపుతున్నారు. అగ్నిమాపకశాఖ అనుమతులు ఉండటం లేదు. మందుల చీటీలో రాసిన ఔషధాలు వారి ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న మెడికల్‌ దుకాణాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. మౌలిక వసతులు సక్రమంగా ఉండటం లేదు. రిజిస్ట్రేషన్‌ సమయంలో పేర్కొన్న వైద్యులకు బదులుగా మరొకరు వైద్యం చేస్తున్నారు. దంత వైద్యుడు ఇతర వ్యాధులకు చికిత్సలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ఉల్లంఘనలు కోకొల్లలు. వాటిని గుర్తించి సరిదిద్దాల్సిన బృందాలు మొక్కుబడి తనిఖీలు చేపడుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

నిబంధనల ప్రకారం
వైద్యారోగ్యశాఖ నిర్దేశానుసారం తనిఖీల సందర్భంగా సదరు ఆసుపత్రి రిజిస్టరై ఉందా.. లేదా పరిశీలించాలి.
అనుమతులు తీసుకున్న సమయంలో పేర్కొన్న వైద్యులు విధులు నిర్వహిస్తున్నారా.. లేదా చూడాలి. వారి అర్హతలు ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలి.
ఆసుపత్రిలో ల్యాబ్‌ ఉంటే అనుమతులు తనిఖీ చేయాలి.
ఇలా మొత్తం 24 అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏవీ లేకున్నా నోటీసు జారీ చేసి నిర్దేశిత గడువులోపు సమకూర్చుకోవాలని ఆదేశించాలి.

జరుగుతోందిలా...
జిల్లావ్యాప్తంగా ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ కేవలం ఆరు మాత్రమే తనిఖీలు చేస్తున్నాయి.
కేవలం అనుమతులు, అగ్నిమాపక పరికరాల బిగింపు, కుర్చీలు, తాగునీరు వంటి కనీస వసతులు పరిశీలించి మమ అనిపిస్తున్నాయి.
ముఖ్యంగా పార్కింగ్‌, తాగునీటి సౌకర్యాలపై మాత్రమే నోటీసులు జారీ చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాకేంద్రంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో పది నిమిషాల్లోనే తనిఖీ ప్రక్రియ పూర్తి చేశారంటే ఏవిధంగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

డీఎంహెచ్‌వో దిశానిర్దేశం లోనే...
- చంద్రశేఖర్‌, ఇన్‌ఛార్జి వైద్యాధికారి, కామారెడ్డి

ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తనిఖీలు చేస్తున్నాం. ప్రస్తుతం డీఎంహెచ్‌వో సెలవులో ఉండటంతో వారం రోజులుగా ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్నా. బృందాల నియామకం మొదలుకొని తనిఖీల కార్యాచరణ వరకు డీఎంహెచ్‌వో మార్గదర్శకత్వంలోనే ఖరారైంది. కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ సమీక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. పీఎంపీ, ఆర్‌ఎంపీల ఆధ్వర్యంలోని చికిత్స కేంద్రాలను కూడా తనిఖీలు చేయాలని నిర్దేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని