logo

సమృద్ధి జలం..

భూగర్భజలాలు పైపైకి వస్తున్నాయి. ఈ ఏడాది అంచనాలకు మించి వానలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా జూన్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు క్రమం తప్పకుండా కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండి రెండు, మూడు సార్లు

Published : 30 Sep 2022 03:21 IST

రెండు నెలల్లో 1.34 మీ. పెరుగుదల
జిల్లా సరాసరి నీటి మట్టం 5.90 మీ.
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

బోరు నుంచి పైకి ఉబికి వస్తున్న భూగర్భజలం

భూగర్భజలాలు పైపైకి వస్తున్నాయి. ఈ ఏడాది అంచనాలకు మించి వానలు పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా జూన్‌ నుంచి సెప్టెంబరు చివరి వరకు క్రమం తప్పకుండా కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండి రెండు, మూడు సార్లు అలుగెళ్లాయి. వర్షం నీరు భూమిలోకి సమృద్ధిగా ఇంకడంతో రెండు నెలల వ్యవధిలో 1.34 మీటర్ల నీటి మట్టాలు పెరిగాయి. ఈ ఏడాది జులైలో సరాసరిగా 7.24 మీటర్లు ఉండగా ప్రస్తుతం 5.90 మీటర్లకు చేరుకుంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 822.33 మి.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 1154.1 మి.మీ. నమోదైంది. 40.3 శాతం అధిక కురవడం విశేషం.

పొదుపు చర్యలు అవసరం
ప్రస్తుతానికైతే జలమట్టాలు ఎన్నడూలేనంత పైకి వచ్చాయి. ఈ ఏడాది వర్షాకాలం దాదాపు ముగిసినట్లే. తిరోగామి రుతుపవనాలతో అక్టోబరు, నవంబరులో తుపాన్లు రావొచ్చు. ఇప్పటి నుంచే భూగర్భజలాల సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే యాసంగి పంటలకు ఇబ్బందవుతుంది. ప్రస్తుతం నీటికుంటలు, కందకాల్లో నీరు నిలిచే విధంగా చూడాలి. ఉపాధిహామీ పనుల్లో జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కందకాలు నిర్మించారు. కొందరు అవగాహన లేక పూడ్చివేస్తున్నారు. తిరిగి తవ్వడంతోపాటు చెక్‌డ్యాంల నిర్మాణం, వరదకాల్వల మరమ్మతులతో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. పల్లపు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఊట చెరువులతోనూ పెంచుకోవచ్చు.

నీటి పొదుపు అలవాటు చేసుకోవాలి
- సతీష్‌యాదవ్‌, ఏడీ, భూగర్భజలశాఖ, కామారెడ్డి

జిల్లాలో భూగర్భజలాలు జూన్‌ నుంచి పెరుగుతున్నాయి. నీటి పొదుపుపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలి. భూగర్భజలాల సంరక్షణకు కృషి చేయాలి. సాధ్యమైనంత వరకు వర్షపు నీటిని భూమిలోకి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని