logo

రాష్ట్రంలో భూ సమస్యలపై 24 లక్షల దరఖాస్తులు

తెరాస ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో సబ్బండవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాకేంద్రంలో మూడు

Published : 30 Sep 2022 03:21 IST

వెంకటరమణారెడ్డికి నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేస్తున్న ఈటల రాజేందర్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో సబ్బండవర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న భాజపా నేత వెంకటరమణారెడ్డికి నచ్చజెప్పి గురువారం దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల సమస్యలను పరిష్కరించే వారే కరవయ్యారన్నారు. ధరణి పోర్టల్‌ నుంచి ఎవరి భూమి ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ భూ సమస్యలను పరిష్కరించాలని సుమారు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. గ్రామస్థాయిలో పరిష్కారం కోసం పని చేసే వీఆర్వో వ్యవస్థను రద్దు చేశారన్నారు. ఒక తహసీల్దారుపై పెట్రోల్‌ పోసి చంపేసిన ఘటన తెలంగాణలోనే జరిగిందన్నారు. ఒప్పంద ప్రాతిపదికన పని చేసే ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించితేనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ధరణిపై భాజపా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో గ్రామగ్రామాన తిరిగి రైతులను సమీకరించి ఉద్యమం చేపడతామని చెప్పారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, నాయకులు తేలు శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి, విపుల్‌ జైన్‌, లక్ష్మారెడ్డి, మహేష్‌గుప్తా, భరత్‌, కౌన్సిలర్లు శ్రీకాంత్‌, నరేందర్‌, సుజిత, మానస తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఈటల రాజేందర్‌కు జిల్లా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని