logo

జోడో యాత్రకు జోరుగా కసరత్తు

దేశ ప్రజల మధ్య ఐక్యత తీసుకొచ్చే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ నెలాఖరుకు జిల్లాకు చేరుకోనుంది. ఐదారు రోజులు జిల్లాలో కొనసాగే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Updated : 02 Oct 2022 06:05 IST

నిజాంసాగర్‌ నుంచి మద్నూర్‌ వరకు రాహుల్‌ పర్యటన
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి


రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర రూట్‌మ్యాప్‌

దేశ ప్రజల మధ్య ఐక్యత తీసుకొచ్చే లక్ష్యంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఈ నెలాఖరుకు జిల్లాకు చేరుకోనుంది. ఐదారు రోజులు జిల్లాలో కొనసాగే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగరావుపల్లిలో ప్రవేశించి పిట్లం, పెద్దకొడపగల్‌, బిచ్కుంద, జుక్కల్‌ క్రాస్‌రోడ్ల మీదుగా మద్నూర్‌ నుంచి మహారాష్ట్రకు సాగుతుంది.

జుక్కల్‌లోనే 74 కి.మీ.
యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు నిమిత్తం ఈ నెల 4న గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లాలోని ముఖ్య నాయకులకు ఆహ్వానాలు అందాయి. రాష్ట్రంలో జోడోయాత్ర 84 కి.మీ. మేర సాగుతుండగా జుక్కల్‌ నియోజకవర్గంలోనే 74 కి.మీ. ఉండటంతో విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనిపై చర్చించేందుకు మాజీమంత్రి షబ్బీర్‌అలీని దిల్లీకి పిలిపించారు.

రోజుకు 10 నుంచి 15 కి.మీ.
యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు పది నుంచి పదిహేను కి.మీ. మేర కొనసాగేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అంటే జిల్లాలో రాహుల్‌ యాత్ర ఐదు రోజులపైనే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. స్థానికులతోపాటు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం జరిగే సమావేశంలో తుది రూట్‌మ్యాప్‌ ఖరారవుతుందని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని