logo

నెలాఖరుకు మూడు ఆర్వోబీలు పూర్తి

హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆర్నెల్లల్లో నాందేడ్‌ వరకు పూర్తవుతాయని అధికారులు చెప్పారని ఎంపీ అర్వింద్‌ అన్నారు.

Published : 02 Oct 2022 04:51 IST


పాదచారుల వంతెన ప్రారంభిస్తున్న ఎంపీ అర్వింద్‌, చిత్రంలో డీఆర్‌ఎం శరత్‌ చంద్రయాన్‌

ఇందల్‌వాయి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ రైల్వే మార్గంలో విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆర్నెల్లల్లో నాందేడ్‌ వరకు పూర్తవుతాయని అధికారులు చెప్పారని ఎంపీ అర్వింద్‌ అన్నారు. ఇందల్‌వాయి రైల్వేస్టేషన్లో రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తైన ప్లాట్‌ఫాం, పాదచారుల వంతెనను శనివారం రైల్వేశాఖ డీఆర్‌ఎం శరత్‌చంద్రాయన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ స్టేషన్‌ అభివృద్ధికి ఇప్పటి వరకు రూ.4 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఆర్మూర్‌లో ఈ నెలాఖరుకు మూడు ఆర్వోబీలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలో తొమ్మిది చోట్ల రైల్వేగేట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా చెల్లిస్తే కేంద్రం వంతెనలు నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు స్థానిక నేతలు ఇందల్‌వాయిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలని, ఇందల్‌వాయి-ధర్పల్లి మార్గంలో ఆర్వోబీ నిర్మించాలని వినతిపత్రాలు అందజేశారు. వెంట భాజపా రూరల్‌ ఇన్‌ఛార్జి దినేశ్‌ కులాచారి, మండలాధ్యక్షులు నాయిడి రాజన్న, గంగారెడ్డి, రైల్వే అధికారులు మోతీలాల్‌ నాయక్‌, రామకృష్ణ, అభిరాం, వెంకన్న ఉన్నారు.

అభివృద్ధి చేసి చూపిస్తా..
మాక్లూర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: అభివృద్ధి చేసి చూపిస్తానని.. చేయకముందే ఎంతో చేశామని చెప్పుకోవటం తమకు తెలియదని ఎంపీ అర్వింద్‌ పేర్కొన్నారు. మాక్లూర్‌ మండలం రాంచంద్రపల్లిని శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో ప్రధాన వీధులు పరిశీలించారు. ముఖ్యమై సమస్యలైన బైపాస్‌ రోడ్డు, రైతు గిడ్డంగి, నిజాంసాగర్‌ కాలువపై రెండు వంతెనలు, కల్యాణ మండప నిర్మాణాల గురించి గ్రామస్థులు విన్నవించారు. స్పందించిన ఎంపీ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరలో అంచనాలు రూపొందించి ఎంపీ ల్యాడ్స్‌తో దశల వారీగా ఒక్కోటి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నూతుల శ్రీనివాస్‌రెడ్డి, కంచెట్టి గంగాధర్‌, మారంపల్లి గంగాధర్‌, సంతోష్‌, వినోద్‌, వినోద్‌, సురేశ్‌ నాయక్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు