logo

మన మధ్యే బాపూ

ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాలవారు నమ్మలేకపోవచ్చు.... ఇదీ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ అన్నమాటలు.   బ్రిటీష్‌ వలస పాలన నుంచి విముక్తి కల్పించడంతో పాటు అప్పటికే సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారదోలడానికి గాంధీజీ  ప్రయత్నించారు.

Published : 02 Oct 2022 04:51 IST

మహాత్ముడి ఆశయాల దిశగా ఇందూరు పల్లెలు
ఇందూరు ఫీచర్స్‌, న్యూస్‌టుడే

 

ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూ ప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే ముందు తరాలవారు నమ్మలేకపోవచ్చు.... ఇదీ ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్‌ అన్నమాటలు.   బ్రిటీష్‌ వలస పాలన నుంచి విముక్తి కల్పించడంతో పాటు అప్పటికే సమాజంలో నెలకొన్న రుగ్మతలను పారదోలడానికి గాంధీజీ  ప్రయత్నించారు. అలాంటి వాటిలో కొన్ని కీలకమైన అంశాలను భుజానికెత్తుకుని ఆచరణలో పెడుతున్నాయి పలు ఊళ్లు. నేటి పరిస్థితులు, వనరుల ఆధారంగా ఆదర్శనీయమైన విధానాలతో ఆకట్టుకుంటున్నాయి. బాపూజీ ఆశయాలను బతికిస్తున్నాయి. అలాంటి వాటిపై గాంధీ జయంతి సందర్భంగా ‘ఈనాడు’ ప్రత్యేక కథనం...


అందరూ బడిలోనే...

చదువు ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పిన వ్యక్తి గాంధీ. అక్షరాస్యత పెరగాలన్న ఆయన స్ఫూర్తిని ఇందల్‌వాయి మండలం సిర్నాపల్లి తీసుకుంది. తమ దగ్గర డ్రాపౌట్లు లేకుండా పిల్లలందరినీ బడికి పంపుతున్నారు. ఏడేళ్లుగా డ్రాపౌట్‌ లేని పల్లెగా నిలిచింది. బడిఈడు పిల్లలంతా పాఠశాలల్లోనే కనిపిస్తారు.

* ప్రాథమిక పాఠశాలలు : 4 * విద్యార్థులు : 234 * ఉన్నత పాఠశాలలు : 186


శతశాతం పన్నుల వసూలు

ఆర్మూర్‌ మండలం రాంపూర్‌ గ్రామంలో గత ఐదేళ్లుగా శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయడం ద్వారా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వస్తున్న 14వ ఆర్థిక సంఘం, ఎన్‌ఎఫ్‌సీ నిధులు, ఇంటి పన్నులు గ్రామ ప్రగతిలో కీలకంగా మారాయి. సర్పంచి బంటు దయానంద్‌ చక్కటి ప్రణాళికతో కాలనీల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు నిర్మించారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామంగా తీర్చిదాద్దారు. ఈ గ్రామం జాతీయ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కు ఎంపికైంది. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజనకు ఎంపిక కావడంతో రూ.30 లక్షల నిధులు వచ్చాయి. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకున్నారు.

* జనాభా : 548 * ఓటర్లు : 428  * నివాసాలు : 172 * భౌగోళిక విస్తీర్ణం : 705 ఎకరాలు

- ఆర్మూర్‌ గ్రామీణం


స్వచ్ఛత బాటలో పయనిస్తూ...

పారిశుద్ధ్యంలో స్వచ్ఛత సాధించాలని జాతిపిత భావించారు. ఈ స్వచ్ఛత విషయంలో బహిరంగ మలవిసర్జన అపరిశుభ్ర వాతావరణానికి కారణమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ పిలుపును అందుకుని వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవడమే కాదు వినియోగిస్తూ నిజామాబాద్‌ జిల్లాలో సిర్నాపల్లి, కామారెడ్డిలో శివాయిపల్లి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ పల్లెల్లో అందరూ మరుగుదొడ్లు వినియోగిస్తున్నారు.

సిర్నాపల్లి జనాభా : 3806 * కుటుంబాలు : 1146 * మరుగుదొడ్లు : 1146
శివాయిపల్లి జనాభా : 1100 * కుటుంబాలు : 215 * మరుగుదొడ్లు : 215


మురుగే కనిపించని ఊరు

తమ గ్రామంలో డ్రైనేజీలు ఎప్పుడు కడతారు? తరచూ పర్యటించే పాలకులకు ప్రజల నుంచి ఎదురయ్యే ప్రశ్న. వారు అప్పటికప్పుడు సమాధానమిచ్చి దాటుకున్నా... నిధులొచ్చే వరకు ప్రజలు మురుగుతో సహజీవనం చేయాల్సిందే. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకపల్లి గ్రామస్థులు మాత్రం అలా చూడలేదు. మురుగు కాలువలే అవసరం లేకుండా మురుగు సమస్యను అధిగమించవచ్చని నిరూపించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతలు నిర్మించుకుని వినియోగించిన నీటిని భూమిలోకి ఇంకిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు పరిరక్షించడంతో పాటు మురుగు సమస్యకు స్వస్తి పలకడం వంటి ప్రయోజనాలు చేకూరాయి.

వెంకంపల్లి జనాభా : 732 * నివాసాలు : 172


శాంతి చర్చలకు బాటలు...

నేరం ఒక జబ్బు అన్నారు గాంధీజీ. నేరాలతో గ్రామంలో శాంతికి విఘాతం కలుగుతుంది. అప్పుడు ఊరు ప్రగతికి అవరోధం ఏర్పడుతోందన్నది వాస్తవం. ఇంత పెద్ద దేశానికి శతాబ్దాల వలస పాలన నుంచి విముక్తి కల్పించడానికి మహాత్ముడు అనుసరించింది అహింస, శాంతి చర్యల విధానమే. అలాంటి విధానాన్ని నేడు కొన్ని పల్లెలు అనుసరిస్తున్నాయి.

నందిగామ...: నవీపేట మండలం నందిగామలో 2014 ఎన్నికల సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాలకు చెందిన 32 మందిపై కేసులు నమోదవగా ఆరు నెలలు కోర్టు చుట్టూ తిరిగారు. కేసులతో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా వివాదాలను గ్రామంలోనే పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. 2016లో వివాదరహిత పల్లెగా గుర్తింపు పొందింది. నేటికీ అక్కడ ఆత్మహత్యలు మినహా ఇతర కేసులేవీ నమోదు కాకుండా ప్రతి వివాదాన్ని గ్రామంలోనే శాంతియుతంగా పరిష్కరిస్తారు.

* జనాభా : 3100 * ఓటర్లు : 1150 * కుటుంబాలు : 420

తిమ్మక్‌పల్లి : ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తుందీ పల్లె. గ్రామంలో ఎవరికి ఏ వివాదం తలెత్తినా సాధ్యమైనంత వరకు పోలీసు ఠాణా గడప తొక్కకుండా వివాదాలను సామరస్య పూర్వకంగా పల్లెలోనే పరిష్కరించుకుంటున్నారు. దాదాపుగా ఠాణా గడప తొక్కకుండానే జాగ్రత్తపడుతున్నారు.

* జనాభా : 292


చెత్త సేకరణలో మిన్న

పుష్కరాల సమయంలో ఇష్టారీతిన పడేసిన చెత్తను స్వయంగా గాంధీజీనే శుభ్రం చేశారు. మన దైనందిన జీవితంలో వెలువడే వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వీర్యం చేయడంపై శ్రద్ధ చూపడంలేదు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ పల్లెలో ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఇంటికి రెండు చెత్త డబ్బాలు ఇచ్చారు. వాటిలో నిల్వ చేసిన చెత్తను ఇంటి ముందుకు వచ్చిన వాహనం స్పీకర్‌ ప్రకటనతో నివాసదారులు వాహనంలో వేస్తున్నారు. చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. సర్పంచి పద్మ చొరవ, ప్రణాళికతో చెత్త సేకరణ ప్రక్రియ నిర్దేశించిన లక్ష్యానికి అనుకూలంగా సాగుతోంది.

జనాభా : 4064 * నివాసాలు : 1100

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని