logo

నేడు సద్దుల బతుకమ్మ సంబురం

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మకు వెయ్యేళ్లకు పైగానే చరిత్ర ఉన్నట్లు పరిశోధకులు ‘కందకుర్తి యాదవరావు’ అభిప్రాయపడ్డారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సోమవారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మతో పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, ఉమ్మడి జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై కథనం.

Published : 03 Oct 2022 03:41 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మకు వెయ్యేళ్లకు పైగానే చరిత్ర ఉన్నట్లు పరిశోధకులు ‘కందకుర్తి యాదవరావు’ అభిప్రాయపడ్డారు. ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు సోమవారం నిర్వహించనున్న సద్దుల బతుకమ్మతో పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, ఉమ్మడి జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై కథనం.

ఇందూరులోని పాత కలెక్టరేట్‌ మైదానంలో...

చాళుక్యుల కాలం నుంచి..
పశ్చిమ చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళుల కాలం నుంచే బతుకమ్మ ఉత్సవాలు కొనసాగుతున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పాటల్లోని అప్పటి రాజుల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.
శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో
ధరచోళదేశము ఉయ్యాలో..
ధర్మాంగుడన రాజు ఉయ్యాలో..
నూరు నోములు నోమి ఉయ్యాలో..
నూరుమందిని గాంచె ఉయ్యాలో..

కాకతీయ ప్రతాపరుద్రుడి కాలంలో బతుకమ్మ నిమజ్జనం కోసం గొలుసుకట్టు చెరువుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారని అంటారు. అనంతరం దోమకొండ సంస్థానం కామినేని వంశస్థులు, సిర్నాపల్లి చీలం జానకీబాయి చెరువులు తవ్వించారు. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని సిర్నాపల్లి గడి ప్రాంగణంలోనూ బతుకమ్మ ఆడేవారు. నిజాం కాలంలో రజాకార్లు పెట్టిన అన్ని ఇబ్బందులను ఎదుర్కొని అమ్మవారిని కొలిచేవారని చెబుతున్నారు.

ఏర్పాట్లు పూర్తి..
నిజామాబాద్‌ ఖిల్లా బొడ్డెమ్మ చెరువు, పులాంగ్‌ వాగు, బోర్గాం(పి)వాగు, ఆర్మూర్‌ గూండ్లచెరువు, జాన్కంపేట్‌, మోర్తాడ్‌, భీమ్‌గల్‌, కామారెడ్డి పెద్దచెరువు, అడ్లూర్‌ ఎల్లారెడ్డి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు దీపాలు, బారికేడ్లతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.

బోర్గాం(పి)లో...
బోర్గాం(పి)లో చివరి రోజు ఊరంతా కదిలివస్తుంది. సుమారు 1500 కుటుంబాలు.. 9 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇంటికొకరు చొప్పున పాల్గొంటారు. తొలుత బతుకమ్మలను హనుమాన్‌ ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. అక్కడ పూజించిన తర్వాత డప్పులు, కోలాటాలతో ఊరేగిస్తారు.

బొడ్డెమ్మలను తీసుకొస్తున్న యువతులు


ఎడపల్లి.. మోర్తాడ్‌లో ఆలస్యంగా

డపల్లిలో దసరా తర్వాత సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇందుకు ఓ కథనం ప్రచారంలో ఉంది. నిజాం కాలంలో గడిలో సిపాయి తుపాకీ పేల్చిన తర్వాతే ప్రజలు ఉత్సవాలు ప్రారంభించేవారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలి సదరు సిపాయి మృతిచెందారు. దీంతో వేడుకలు వాయిదా వేశారు. దసరా తర్వాత ముహూర్తం చూసి జరిపారు. అప్పటినుంచి అలాగే కొనసాగుతోంది. ఈసారి శనివారం అమ్మవారిని పూజించనున్నారు. మోర్తాడ్‌లోనూ దసరా మరుసటి రోజైన గురువారం చేయనున్నారు. దేవీమాత నిమజ్జనం రోజునే బతుకమ్మ ఉత్సవాలు చేయాలనే పెద్దల నిర్ణయాన్ని పాటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని