logo

వారసత్వ స్థలం.. అనుమతులు కష్టం

భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాదిరిగా పంచాయతీల్లోనూ టీఎస్‌- బీపాస్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా లేఅవుట్‌, ఇళ్ల నిర్మాణాల తనిఖీల కోసం క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు టైటిల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం తనిఖీ అధికారుల నియామకాలు చేస్తున్నారు.

Published : 03 Oct 2022 03:41 IST

పల్లెల్లో టీఎస్‌ బీపాస్‌ అమలుకు మొదలైన కసరత్తు
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

వన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల జారీ కోసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాదిరిగా పంచాయతీల్లోనూ టీఎస్‌- బీపాస్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో మండలాల వారీగా లేఅవుట్‌, ఇళ్ల నిర్మాణాల తనిఖీల కోసం క్షేత్రస్థాయి పరిశీలనతోపాటు టైటిల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం తనిఖీ అధికారుల నియామకాలు చేస్తున్నారు. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో కొన్ని ఆటంకాలు ఎదురుకానున్నాయి.

నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కే దరఖాస్తులు
ఈ నూతన విధానంలో దరఖాస్తుల పరిశీలన, ఆమోదం అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దరఖాస్తులు నేరుగా కలెక్టర్‌ లాగిన్‌కే చేరుకోనున్నాయి. అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు), పంచాయతీ, మండల సైట్‌ ఇన్‌స్పెక్షన్‌, టైటిల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ అధికారులు వీటిని చూసే వీలుంటుంది. అయినా ఆయా నిర్మాణాలు లేదా అనుమతులకు కలెక్టర్‌ అనుమతితోనే ఆమోదం లభిస్తుంది.

తనిఖీ అధికారులు వీరే..
మండల స్థాయిలో టీఎస్‌- బీపాస్‌ అమలును పర్యవేక్షించేందుకు ఇద్దరు అధికారులను ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్దేశించింది. సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారిగా డిప్యూటీ తహసీల్దారు లేదా రెవెన్యూ పరిశీలకులు ఉండనున్నారు. టైటిల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ అధికారిగా మండల పరిధిలోని పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ అధికారి వ్యవహరించనున్నారు.

పొందడం ఇలా..
పంచాయతీల్లో లేఅవుట్లు, ఇంటి నిర్మాణం అనుమతుల కోసం ప్రస్తుతం అమలవుతున్న ఈ-పంచాయతీ విధానాన్ని టీఎస్‌- బీపాస్‌కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

భవన నిర్మాణం కోసం అన్ని రకాల ధ్రువపత్రాలు, ఇంటి ప్లాన్‌తో సహా నిర్ణీత రుసుం చెల్లించి మీసేవ కేంద్రంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజూ వందల సంఖ్యలో వస్తున్నాయి.

మొదటగా క్షేత్రపరిశీలన అధికారి(సైట్‌ ఇన్‌స్పెక్షన్‌ అధికారి) తనిఖీ చేసి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అనంతరం టైటిల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ అధికారి అంగీకారంతో నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతులు లభించనున్నాయి.

అనుమతి నిమిత్తం దరఖాస్తుదారులు చెల్లించిన రుసుం మొదట రాష్ట్ర నిధికి తరువాత పంచాయతీలకు బదలాయించనున్నారు. ఇందుకు ప్రతి పంచాయతీకి కొత్త ఖాతా తెరిపించే పని మొదలుపెట్టారు.

ఇబ్బందులు ఇలా..
గ్రామాల్లో స్థలాలకు ఇప్పటికీ సరైన డాక్యుమెంట్లు ఉండటం లేదు. వారసత్వంగా వస్తున్న జాగల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కొన్ని అసైన్డ్‌, మరికొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. తెల్లకాగితాలపై రాసుకున్న ఒప్పందాలు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీఎస్‌-బీపాస్‌ విధానంలో అనుమతులు లభించడం కష్టమే. వ్యవసాయ భూములను సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించిన విధంగా వారసత్వంగా వచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను కూడా క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పిస్తే ఫలితం ఉంటుంది.

వివరాలు పంపాలని నిర్దేశించారు
- శ్రీనివాస్‌రావు, డీపీవో, కామారెడ్డి

పల్లెల్లో టీఎస్‌-బీపాస్‌ అమలు నిమిత్తం మండల స్థాయిలో తనిఖీ అధికారుల వివరాలు పంపాలని నిర్దేశించారు. ఇదే విధంగా పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నూతన బ్యాంకు ఖాతాలు తెరిపించాలని సూచించారు. టీఎస్‌-బీపాస్‌ అమలుపై పూర్తి మార్గదర్శకాలు విడుదల కాలేదు. అవి రాగానే పంచాయతీ కార్యదర్శులతో పాటు పాలకవర్గ సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహించనున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని